'పైసా' చిక ప్రేమ
మనసు దొంగిలించేవాళ్లు అనుకుంటే బీరువా తాళాలు అప్పగించినవాళ్లవుతారు.ఎక్కడ కాపు కాస్తున్నారో తెలీదు. ఎవరి మీద కన్నేశారో తెలీదు. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దొంగలు మనింటికే రావచ్చు.
అరుణ్ హైదరాబాద్‌లో ఆటోవాలా. వయసు 24. అక్కడే ఉంటున్న సౌమ్య (పేరు మార్చాం) ఇంటర్ చదువుతోంది. వయసు 16. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య. కాలేజీకి వెళ్లొస్తుండే దారిలో అరుణ్ పరిచయం అయ్యాడు. ముందు ఫోన్‌లలోనే మాట్లాడుకునే ఇద్దరు ఆ తర్వాత ఫేస్ బుక్, చాటింగ్ వరకు వెళ్లారు. ఆ పరిచయం... కలిసి తిరిగేంతవరకు వెళ్లింది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం’ అని సడెన్‌గా అన్నాడు అరుణ్ ఒకరోజు. అంతే కాదు, మాయ మాటలతో సౌమ్య మనసు దోచుకున్నాడు. అరుణ్ తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉంది సౌమ్యకు. చూస్తుండగానే ఆరు నెలలు గడచిపోయాయి.
ఓ రోజు అరుణ్ (మూడు నెలల క్రితం) సౌమ్య దగ్గరకు వచ్చి, ‘నాకు కడుపులో అల్సర్ ఉందట. లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలంట. లేకపోతే బతకను. ఆరేడు లక్షలు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వే ఎలాగైనా సర్దాలి’ అన్నాడు.
సౌమ్య ప్రాణం విల్లవిల్లాడింది. కానీ అంత డబ్బు! ఎలా..? సౌమ్యకు దిక్కు తోచలేదు. రెండు మూడు రోజులుగా అరుణ్ అడగడం, సౌమ్య ఏమీ సమాధానం ఇవ్వకపోవడం జరుగుతూనే ఉంది. నాల్గవరోజు అరుణ్ ఫోన్ చేశాడు. ‘డబ్బు ఇవ్వకపోతే మనిద్దరికీ సంబంధం ఉందని అందరికీ చెబుతాను. మనం దిగిన ఫొటోలు అందరికీ పంచుతాను! నీ పరువు, మీ అమ్మనాన్నల పరువు పోతుంది’ అని వార్నింగ్ ఇచ్చాడు. సౌమ్య హతాశురాలైంది. నిజంగానే ఆ ఫొటోలు బయటపెడితే తన పరిస్థితి ఏంటి?! ఈ కష్టం నుంచి బయటపడటం ఎలా?’ అని ఆలోచించింది. ఒంట్లో బాగోలేదని ఆ రోజు ఇంట్లోనే ఉంది. అమ్మానాన్నలు ఆఫీస్‌లకెళ్లిపోయారు. బీరువా తాళాలు తీసి చూసింది. బంగారం, ఆ పక్కనే డబ్బు కనిపించాయి. నాన్నకు తెలియకండా ఆయన పర్సులోంచి ఎ.టి.ఎమ్ కార్డు కూడా తీసింది. అరుణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది.
వచ్చాక దాదాపు 30 తులాల బంగారం, 3 లక్షలకు పైగా నగదు ఇచ్చింది. ఎ.టి.ఎమ్ కార్డ్ తీసుకెళ్లి మరికొంత డబ్బు తీసి ఇచ్చింది. డబ్బు తీసుకుని అరుణ్ ఉడాయించాడు. సౌమ్య మళ్లీ ఆలోచనలో పడింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఊరుకోరు.. ఎలా? తనను తానే కట్టేసుకుని, దొంగలు పడి, దోచుకెళ్లినట్టుగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఈ సంఘటనను పోలీసులు దర్యాప్తు చేసి ఈ నెల 9న అరుణ్‌ని అరెస్ట్ చేసి, అసలు విషయం బయటపెట్టారు.
ఇప్పుడీ విషయం గురించి మనమెందుకు మాట్లాడుకోవాలంటే.. మన ఇంట్లోనూ ఈ వయసు పిల్లలుంటారు. ఏది తప్పో, ఏది ఓప్పో తెలియని స్థితిలో కష్టాల ఊబిలో వారు పడిపోకూడదు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వంచకుల చేతికి చిక్కకూడదు.
అందుకు మనమేం చేయాలి?
► కుటుంబసభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు మాత్రమే అసలైన ప్రేమ అని అమ్మాయికి తెలియజెప్పాలి.
► ఎంతసేపూ పుస్తకాలు, మార్కులు, ర్యాంకుల గొడవలతో కాకుండా అమ్మాయి మానసిక వికాసానికి కావల్సిన పెద్దల అనుభవాలను జాగ్రత్తలుగా షేర్ చేసుకోవాలి.
► ఏ బాధ్యతా లేకుండా రోడ్లమీద తిరిగేవారే అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. అదికూడా అమాయకమైన అమ్మాయిలనే టార్గెట్ చేస్తుంటారు. తమ ట్రాప్‌లో పడేందుకు కావల్సిన అన్ని శక్తులనూ ఉపయోగిస్తుంటారు. ఆ విషయాన్ని అమ్మాయిలకి అర్థమయ్యేలా చెప్పాలి.
► పిల్లల చిన్న చిన్న సమస్యలను, అవసరాలను వాయిదా వేయకూడదు. చిన్న అవసరాలే కదా అని కొట్టిపారేయకుండా సాధ్యమైనంతవరకు తీర్చాలి. సమస్యను పూర్తిగా విని సానుకూలంగా స్పందించాలి.
► పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి.
► సమాచారం వేగవంతంగా మారిన ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరిగే మోసాలు కూడా రెట్టింపు వేగంతో జరిగిపోతున్నాయి. అందుకని, పిల్లల స్నేహాలు, వారి ప్రవర్తనవైపు గమనింపు తప్పనిసరి.
► బోర్ కొడుతోందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. కాబట్టి పిల్లలకి బోర్ అనిపించకుండా చదువుతో పాటు నృత్యం, సంగీతం, క్రీడలు, పుస్తకపఠనం... హాబీస్‌వైపుగా వారి దృష్టి మళ్లేలా చూడాలి.
► ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సెలింగ్‌కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం’ అని కౌన్సెలర్లు చెబుతున్నారు. జాగ్రత్త అవసరం.
- నిర్మలారెడ్డి
ఇన్‌పుట్స్: యాదగిరి, సాక్షి, తుర్కయంజాల్
ఆకర్షణలు... లక్ష్యాలు
ఒక బకెట్‌ను ముందు ఇసుకతో నింపాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు రాళ్లు వేసి, తర్వాత అంతే ఇసుకతో అదే బకెట్ నింపవచ్చు. పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు ఇసుకతో సమానం అని, ఆ ఆకర్షణలో పడితే లక్ష్యాలను సాధించలేమని పిల్లలకు తెలియ చెప్పాలి.
- డా. గీతాచల్లా, సైకాలజిస్ట్
మోసాలు పెరుగుతున్నాయి
ప్రేమ పేరుతో నమ్మించి మోసాలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్మీడియెట్ అమ్మాయిలే ప్రేమ అనే ఆకర్షణలో పడుతున్నారు. తర్వాత మోసపోయి, బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టి వారిని సరిదిద్దాలి.
- భాస్కర్‌గౌడ్, ఏసీపీ, వనస్థలిపురం