టూర్ ఏదైనా! జైత్రయాత్ర | Jaitra trip jaibharati her own words | Sakshi
Sakshi News home page

టూర్ ఏదైనా! జైత్రయాత్ర

Published Thu, Aug 7 2014 11:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Jaitra trip jaibharati her own words

‘గో యునెస్కో’  పోటీలో విజేతగా నిలిచిన జైభారతికి పర్యటనలంటే ప్రాణం. ‘సోలో ట్రావెలర్’గా గుర్తింపు పొందిన జైభారతి హైదరాబాద్‌లో ఆర్కిటెక్చర్ వృత్తిలో రాణిస్తున్నారు. మూడు పదుల వయసున్న ఆమె జైత్ర యాత్ర ఆమె మాటల్లోనే...
 
‘‘నా కూతురు నీలా డేరింగ్‌గా ఉండాలి. ప్రపంచమంతా చుట్టి రావాలి’ అంటుంటాడు మా అన్నయ్య. ఇంట్లో అమ్మానాన్నలదీ ఇదేమాట. వారి ప్రోత్సాహమే నన్ను ‘గో యునెస్కో’ ట్రావెలర్‌ని చేసింది.

 విహారయాత్ర నుంచి... ఆడపిల్లని అయినా పెంపకంలో ఎక్కడా తేడా చూపించలేదు మా పేరెంట్స్. అన్నయ్య, తమ్ముడితో పాటు నాకూ సైకిల్, బైక్ నేర్పించారు. ఆ విధంగా ఇప్పుడు బైక్‌రైడింగ్‌లోనూ ముందంజలో ఉన్నాను. కాలేజీ రోజుల్లో అయితే ఫ్రెండ్స్ తో కలిసి బైక్ మీదే ట్రావెల్ చేసేవాళ్లం. అప్పుడే గ్రూప్ టూర్స్‌ను ఆర్గనైజ్ చేయడంలో పట్టు పెరిగింది. వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్ కావడంతో కేరళలోని వాయనాడులో ఒక ఇంటిని డిజైన్ చేయడానికి వెళ్లాను. అటు నుంచి కేరళ అంతా తిరిగాను. ఎక్కడికెళ్లినా వృత్తితో పాటు పర్యటన కూడా ఒక భాగంగా ఉంటుంది. ఒక చోటకి వెళితే అక్కడే ఉండకుండా చుట్టుపక్కల ప్రాంతాలు, కట్టడాలు, అక్కడి ప్రజల జీవనవిధానం తెలుసుకుంటూ ఉంటాను.
 
విజేతగా నిలిపిన ‘గో యునెస్కో...’ రెండేళ్ల క్రితం ఒక రోజు పేపర్‌లో ‘గో యునెస్కో’కు సంబంధించిన ప్రకటన చూశాను. 2012 వరకు ఉన్న ప్రపంచవారసత్వ జాబితాలో ఉన్న ప్రదేశాలు, కట్టడాలను చూసి రావాలనేది ఒక సవాల్‌తో కూడిన యాడ్ అది. నాకు చాలా ఆసక్తి కలిగింది. అమ్మానాన్నలకు చెప్పాను. వారు ‘సరే’ అన్నారు. యునెస్కో ట్రావెల్ గ్రూప్ గురించి అప్పుడే తెలియడంతో అందులో నేనూ జాయిన్ అయ్యాను. ఈ గ్రూప్‌లో చేరినప్పటికీ నా వీలును బట్టి వారాంతంలో ఒక ప్రాంతానికి మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాను. కానీ, నెల రోజులకు ఒక ప్లేస్ చూడటమే వీలయ్యేది. అనుకోకుండా ఆఫీస్ మారాల్సి వచ్చింది. కొత్త ఆఫీస్‌లో చేర డానికి 12 రోజుల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ను ట్రావెల్‌కు ఉపయోగించుకున్నాను. ఆ విధంగా సెప్టెంబర్‌లో ఢిల్లీ నుంచి ట్రిప్ మొదలు పెట్టి ఆగ్రా, రిషీకేష్, రాజస్థాన్‌ల మీదుగా మొత్తం మన దేశంలోని 12 హెరిటేజ్ సైట్స్‌ను చూసొచ్చాను. అదీ ఒక్కదాన్ని. ఆ విధంగా ‘గో యునెస్కో ట్రావెలర్’ అవార్డు తీసుకున్నాను.
 
రైలు..బస్సు.. ఏదైనా..! ఎక్కడికెళ్లినా ఒక చోట విశ్రాంతి తీసుకోవాలి, మరో చోట ఫ్లైట్‌లో అయితేనే చేరుకోగలం.. ఇలాంటివేవీ పట్టించుకోను. రైలు, బస్సు, ఆటో.. ఏదుంటే అది పట్టుకొని ప్రయాణించడమే! ఎక్కువగా రాత్రి సమయాలను ప్రయాణానికి ఎంచుకుంటాను. ఆ విధంగా హోటల్ రూమ్‌లలో ఉండాల్సిన అవసరం తప్పుతుంది. దసరా సెలవుల్లో చెన్నై, దీపావళి సెలవులో ఉత్తర భారతదేశం.. ఇలా దేశంలోని అన్ని ప్రదేశాలను సందర్శించి వచ్చాను.
 
టర్కీకి ఒంటరిగా! ఆ తర్వాత టర్కీ, మలేషియా, హాంగ్‌కాంగ్‌లనూ సందర్శించాను. కిందటేడాది టర్కీలో 15 కిలోమీటర్ల రన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. రన్‌లో పాల్గొనడానికి ఎలాగూ వెళుతున్నాను కాబట్టి యునెస్కో జాబితాలో ఉన్న అక్కడి వారసత్వ ప్రదేశాలన్నీ చూసి రావాలనుకున్నాను. అందుకే మిగతా అందరికంటే 10 రోజుల మందుగానే ఒంటరిగా బయల్దేరాను. ఢిల్లీ నుంచి టర్కీకి ఎక్కువ దూరం ప్రయాణించే విమానాన్ని ఎంచుకున్నాను. ఆ విధంగా ఖర్చు తగ్గింది. టర్కీ చేరుకున్నాక 11 రోజుల్లో ఆ అక్కడి అన్ని వారసత్వ ప్రదేశాలను చుట్టి వచ్చాను. టర్కీలో మన దగ్గర ఉన్నంతగా రైల్వే వ్యవస్థ లేదు. అందుకే అన్ని చోట్లకూ బస్సులలోనే ప్రయాణించాను. టర్కీలో పెద్ద పెద్ద బస్ స్టేషన్‌లు ఉన్నాయి. అక్కడే రిఫ్రెష్ అయ్యి, తిరిగి ప్రయాణించేదాన్ని. టికెట్లు కూడా అప్పటికప్పుడే కొనేదాన్ని.
 
సురక్షితంగా ప్రయాణం... అమ్మాయి ఒంటరిగా ప్రయాణించడమా అనేది ఇప్పటికీ మనవాళ్లు విడ్డూరంగా చెప్పుకుంటారు. కానీ ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆలోచనకు ఆడ-మగ తేడాలేదు. ఎక్కడికెళ్లినా ఒక్కదాన్నే! అయితే నేను ఏ ప్రదేశంలో, ఎలా ఉన్నదీ ఎప్పటికప్పుడు ఇంటికి చేరవేస్తుంటాను. ఆ విధంగా ఇంట్లో వారికి ఆందోళన ఉండేది కాదు. వచ్చే నెలలో సతారాలోని కాస్‌వ్యాలీకి వెళు తున్నాను. పర్యటన ఎప్పటికప్పుడు మనల్ని రీఛార్జ్ చేస్తూనే ఉంటుంది.’
 
- నిర్మలారెడ్డి
 
ప్లానింగ్ ఉంటే ఖర్చు తక్కువే!
 
ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే లక్షల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు. అవగాహన ఉండి, ఇతరులతో పరిచయాలు పెంచుకుంటే చాలు... ఎంత దూరమైనా హ్యాపీగా ప్రయాణించవచ్చు. దూరప్రాంతాలకు ప్రయాణం అనగానే చాలా మంది ముందుగానే హోటల్స్, ట్రైయిన్స్ బుక్ చేసుకుంటారు. కుటుంబంతో వెళితే అలాంటివి తప్పవు. కానీ ఒంటరిగా వెళితే ఇలాంటివేవీ అవసరం లేదు. నేను ఎక్కడకు వెళ్లినా రాత్రిపూట ప్రయాణాన్ని ఎంచుకునేదాన్ని. దాంట్లో భాగంగా హోటల్స్‌లో ఉండాల్సిన అవసరమే రాలేదు. తప్పదు అనుకున్న చోట మహిళల హాస్టల్స్ గురించి వాకబు చేసి వె ళ్లేదాన్ని. అలాంటి చోట అయితే రోజుకు రూ.500 చెల్లిస్తే సరిపోయేది. అవకాశం ఉన్నంత వరకు ఇక్కడకు వచ్చిన విదేశీయులకు మనం వసతి కల్పించవచ్చు. ఆ విధంగా జపాన్ నుంచి, చైనా నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు 15 రోజుల పాటు నా వద్ద ఉండి, ఇక్కడి ప్రదేశాలను చూసి వెళ్లారు. నేనూ వారి దేశాల సందర్శనకు వెళ్లినప్పుడు వారి స్నేహితుల ఇళ్లలో ఉన్నాను. దీనివల్ల డబ్బుకే కాదు, భద్రతకూ బెంగ ఉండదు. ప్రపంచాన్ని కొత్త కోణంలో దర్శించడం మొదలుపెడతాం. ఈ విధానం వల్ల మన చుట్టుపక్కలే కాకుండా ప్రపంచంలో ఎంతోమందితో స్నేహసంబంధాలు పెరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement