రోడీస్‌..లేడీస్‌ | Hyderabad City Woman Dare Tour Plans Special Story | Sakshi
Sakshi News home page

రోడీస్‌..లేడీస్‌

Published Sat, Jul 28 2018 11:59 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Hyderabad City Woman Dare Tour Plans Special Story - Sakshi

సిటీ లేడీస్‌ ఓ డేర్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారు. రోడ్డు మార్గంలో థాయ్‌లాండ్‌కు సాహస యాత్ర చేపడుతున్నారు. అటు బైక్స్, ఇటు కార్లు రెండింటినీ మేళవించి అక్టోబర్‌ 20న దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ట్రిప్‌కు ఎంబార్క్‌ సంస్థ ముందుకొచ్చింది.

సాక్షి, సిటీబ్యూరో :‘రోడ్డు మార్గంలో దేశాలు చుట్టేయాలి. అదీ మహిళలు.. స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించాలి’ అంటే సాధారణ విషయం కాదు. అయితే అలాంటి సాహసయాత్రలను వ్యక్తిగతంగా సుసాధ్యం చేసిన ఇద్దరు స్నేహితురాళ్లు... ఇప్పుడు ఆల్‌ ఉమన్‌ ట్రిప్‌నకు శ్రీకారం చుట్టారు. ఇందులో అందరూ మహిళలే ఉండడంతో పాటు అటు బైక్స్, ఇటు కార్లు రెండింటినీ మేళవించి దేశంలోనే తొలిసారి ఈ తరహా ట్రిప్‌ నిర్వహిస్తోంది ఎంబార్క్‌ సంస్థ. దీని వ్యవస్థాపకులుమేధా జోసెఫ్‌ నగరవాసి కావడం విశేషం. 

రోడ్డు మార్గంలో ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లాలంటే, అబ్బా... అలసిపోతామేమో అనుకుంటాం. అలాంటిది ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే... ‘రోడ్‌ జర్నీ మీద ప్యాషన్‌ ఉంటేనే అది సాధ్యం’ అంటున్నారు మేధా జోసెఫ్‌. కొండాపూర్‌లో నివసించే మేధాకు చిన్నప్పటి నుంచి బైక్‌ రైడింగ్, కార్‌డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. వీలున్నంత వరకు ఎంత దూరమైనా రోడ్‌ మార్గంలోనే ప్రయాణించేది. ఆ ఇష్టం ఆమెతో పాటే పెరిగింది. తనలాంటి సరదా ఉన్న సుజల్‌ను ఫ్రెండ్‌ను చేసింది. ముంబైకి చెందిన సుజల్‌ వివిధ కంపెనీల్లో హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేశారు. డ్రైవింగ్‌పై అభిరుచితో అమెరికా, యూకే, యూరప్, టర్కీ, థాయ్‌లాండ్‌ తదితర దేశాలు చుట్టేశారు. ‘సుజల్‌ పరిచయం తర్వాత మా రూటే మారిపోయింది’ అంటూ నవ్వేసిన మేధా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...  

ప్యాషన్‌ టు ప్రొఫెషన్‌  
మాది పుణె. పదేళ్లుగా నగరంలో ఉంటున్నాను. జీఈ, ఇన్ఫోసిస్‌ తదితర ప్రముఖ కంపెనీల్లో ఫైనాన్స్‌ ప్రొఫెషనల్‌గా పనిచేశాను. రోడ్‌ టూర్స్‌పై ఇష్టంతో రికార్డ్‌ స్థాయి జర్నీ చేయాలని నా ఫ్రెండ్‌ సుజల్‌తో కలిసి ఇండియా నుంచి మొరాకో వరకు 57 రోజుల్లో 16 దేశాలు చుట్టేసి వచ్చాం. ఈ ట్రిప్‌లో మొత్తం 23వేల కి.మీ ప్రయాణం చేశాం. ఈ రోడ్‌ ట్రిప్‌ మా ఆలోచనల్ని మార్చేసింది. చాలామంది భారతీయులకు లాంగ్‌ రోడ్‌ ట్రిప్స్‌ అంటే ఇష్టం ఉన్నప్పటికీ... అనుమతులు ఎలా పొందాలి? రూట్స్‌ ఎలా ప్లాన్‌ చేయాలి? ఇంకా ఎన్నో విషయాలపై అవగాహన లేకపోవడంతో ఆగిపోతున్నారని అర్థమైంది. దీంతో మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. జాబ్స్‌ వదిలేశాం. మూడేళ్ల క్రితం ఎంబార్క్‌ సంస్థను స్థాపించాం. దేశంలోనే బహుశా మహిళల ఆధ్వర్యంలో రోడ్‌ ట్రిప్స్‌ నిర్వహించే తొలి సంస్థ మాది.  

అద్భుతమైన అనుభవాలు..
దేశవిదేశాల్లోని రహదారులు... అనుభవాల వేదికలు. విభిన్న రకాల వంతెనలు, నిర్మాణాలు వాటి పైనుంచి ప్రయాణాలు మరచిపోలేని అనుభూతులు అందిస్తాయి. ఇవి మనకు మరే రకమైన ప్రయాణంలో రావనేది నిస్సందేహం. సంస్థ స్థాపించాక, ఇప్పటి వరకు దాదాపు 10 ట్రిప్స్‌ నిర్వహించాం. అన్నీ మన దేశం నుంచి విదేశాలకే. ఓవర్లాండ్‌ ట్రిప్‌ పేరుతో ఇండియా నుంచి స్పెయిన్‌కి 15 దేశాలను చుట్టేస్తూ 2017లో నిర్వహించిన  వైవిధ్యభరితమైన ట్రిప్‌నకు చాలా పేరొచ్చింది. మేం నిర్వహించే ప్రతి ట్రిప్‌లో కనీసం 10 –12 మంది పాల్గొంటారు.  

ఆల్‌ ఉమన్‌..అందుకే
ఇప్పటి వరకు అందరికీ (పురుషులు, మహిళలు) ట్రిప్స్‌ నిర్వహించినా... ఇప్పుడు నిర్వహించనున్న ఇండియా టు థాయ్‌లాండ్‌ ట్రిప్‌లో మహిళలకే అవకాశం కల్పించాం. కనీసం 25 మంది ఇందులో పాల్గొంటారు. సాధారణంగా మహిళల ట్రిప్స్‌కి సంబంధించి వ్యక్తిగత భద్రత, వాహనాలు బ్రేక్‌డౌన్‌ అయి మొరాయించడం తదితర సమస్యలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మేం ఒక పూర్తిస్థాయి కాన్వాయ్‌తో ప్రయాణిస్తాం. ముగ్గురో నలుగురో కలిసి వెళ్లడం కన్నా ఇలా సమూహంలా వెళ్లడం.. అదే సమయంలో అందరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉండడం.. విభిన్న నైపుణ్యాలున్న వారితో ప్రయాణించడం... ఇవన్నీ సమస్యలను కొంతవరకు సులభతరం చేస్తాయి.  

ఫుల్‌ రెస్పాన్స్‌...  
డ్రైవ్‌కు సంబంధించి ముందస్తుగా మరమ్మతులు, ఫిక్సర్స్‌ గురించిన అవగాహన కూడా కల్పిస్తాం.మా ట్రిప్స్‌కి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్‌ నగరం నుంచి ఊహించని సంఖ్యలో సంప్రదిస్తున్నారు. రోడ్‌ ట్రిప్స్‌పై మహిళల్లో చాలా ఆసక్తి ఉంది. కొత్త ప్రాంతాలు, వినూత్న తరహా ప్రయాణ అనుభవాలను చాలామంది కోరుకుంటున్నారు. భవిష్యత్తులో సెంట్రల్‌ ఆసియా, సౌత్‌ అమెరికా, ఆఫ్రికా తదితర ఉత్తేజభరితమైన ట్రిప్స్‌తో రాబోతున్నాం. ఇంకా వరల్డ్‌ మ్యాప్‌లోని చాలా మార్గాలను ప్లాన్‌ చేయబోతున్నాం.   

ట్రిప్‌ విశేషాలివీ...
ఆలిండియా ఉమన్స్‌ డ్రైవ్‌ ఇండియా టు థాయ్‌లాండ్‌ (కార్‌ అండ్‌ మోటార్‌సైకిల్‌) ట్రిప్‌ను మహిళాదినోత్సవం రోజునప్రకటించారు.  
ఇది అక్టోబర్‌ 20న గౌహతిలో ప్రారంభమై, నవంబర్‌ 4న బ్యాంకాక్‌లో ముగుస్తుంది.  
మొత్తం 2,800 కి.మీ కొనసాగుతుంది.  
వీసాలు, కార్, వ్యక్తిగత అనుమతులు, కార్‌ కస్టమ్‌ పేపర్‌ వర్క్, బోర్డర్‌ క్రాసింగ్, ఎంట్రన్స్‌ ఫీ, వెహికల్‌ ఇన్సూరెన్స్, టోల్, వెహికల్‌ కార్నెట్, బస, ఆహార వసతి తదితరాలన్నీ సంస్థ చూసుకుంటుంది. లీడ్, బ్యాకప్‌ వెహికల్స్‌ను సమకూరుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement