ద్వారకాతిరుమల: రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో సుమారు 6వేల మంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియడం లేదని, ప్రస్తుతం వారిని వెదికే పనిలో ఉన్నామని రాష్ట్ర ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 14 వేల మంది ఉద్యోగులు సరైన పనిలేకుండా ఉన్నారని, ముందు వారికి పనికల్పించే పనిలో పడ్డామని చెప్పారు. జీతాలు తీసుకుంటూ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియని 6 వేల మంది సిబ్బందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆలయాల్లో ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రముఖ ఆలయూలున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఆలయాల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సి ఉందని, అంతకుముందే పదోన్నతులు పొంది అక్కడే పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.