అమలాపురం టౌన్/సాక్షి నెట్‌వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు.
►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు.
►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు.
►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment