భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ కోడి పందేలు మూడో రోజూ జోరుగా సాగాయి. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కోడిపందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పందేల బరులు కిటకిటలాడాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు కూడా విచ్చలవిడిగా సాగాయి. కోడిపందేల బరులు వద్ద జూదాలు ఏర్పాటుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించగా, పెద్ద బరుల వద్ద జూదాల నిర్వహణకు అధిక మొత్తంలో పాటలు పాడినట్లు తెలుస్తోంది. కాళ్ల, తణుకు, ఆకివీడు, యలమంచిలి, ఇరగవరం, అత్తిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌లు సాగాయి. నగదు లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం.
పగలు, రాత్రి తేడా లేకుండా..
రాత్రి సమయంలో సైతం కోడి పందేలు, జూదాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఫ్లడ్‌లైట్స్ ఏర్పాటు చేయడమేగాక పందేలను స్పష్టంగా చూడడానికి కొన్ని చోట్ల ఎల్‌ఈడీ టీవీలు సైతం ఏర్పాటు చేశారు. కాళ్ల మండలంలో బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. వీక్షించే వారిని అనుమతించడానికి వారి చేతులకు ప్రత్యేక ట్యాగ్‌లు వేశారు.
బారులు తీరిన కార్లు : కోడి పందేల బరులు వద్ద భారీ సంఖ్యలో చిన్నకార్లు, మోటారు సైకిళ్లు బారులు తీరాయి. పందేల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడే భోజనాలతోపాటు అన్ని రకాల తినిబండారాలు అందుబాటులో ఉండడంతో పందెంరాయుళ్లు, వీక్షకులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోడూరు మండలం కవిటం వద్ద నిర్వహించిన కోడి పందేల శిబిరం వద్ద జూదగాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు.
వ్యక్తికి తీవ్ర గాయం
ఉండి గ్రామంలోని పెదపుల్లేరు రోడ్డులో నిర్వహించిన కోడిపందేల శిబిరం వద్ద పందేలు తిల కిస్తున్న చంటిరాజు అనే వ్యక్తి కాలికి కోడి కత్తి ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయం కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామం వద్ద కోడిపందేల శిబిరం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది.
విజేతలకు ద్విచక్రవాహనాలు
పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం వద్ద నిర్వహించిన కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన శృంగవృక్షం గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి బుల్లెట్ మోటారు సైకిల్ గెలుచుకోగా మరో ఇద్దరు విజేతలకు నిర్వాహకులు స్కూటీలను బహుమతులుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment