Sankranti Godavari Special
-
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా లెక్క తేలింది. -
Kodi Pandalu In AP Photos: సంక్రాంతి సంబరాల్లో జోరుగా సాగిన కోడి పందేలు.. కోలాహలం (ఫొటోలు)
-
సంక్రాంతి కోడిపందేల్లో బుల్లెట్ గెలుచుకున్న కోడిపుంజు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ కోడి పందేలు మూడో రోజూ జోరుగా సాగాయి. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కోడిపందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పందేల బరులు కిటకిటలాడాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు కూడా విచ్చలవిడిగా సాగాయి. కోడిపందేల బరులు వద్ద జూదాలు ఏర్పాటుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించగా, పెద్ద బరుల వద్ద జూదాల నిర్వహణకు అధిక మొత్తంలో పాటలు పాడినట్లు తెలుస్తోంది. కాళ్ల, తణుకు, ఆకివీడు, యలమంచిలి, ఇరగవరం, అత్తిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌లు సాగాయి. నగదు లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా.. రాత్రి సమయంలో సైతం కోడి పందేలు, జూదాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేయడమేగాక పందేలను స్పష్టంగా చూడడానికి కొన్ని చోట్ల ఎల్ఈడీ టీవీలు సైతం ఏర్పాటు చేశారు. కాళ్ల మండలంలో బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. వీక్షించే వారిని అనుమతించడానికి వారి చేతులకు ప్రత్యేక ట్యాగ్లు వేశారు. బారులు తీరిన కార్లు : కోడి పందేల బరులు వద్ద భారీ సంఖ్యలో చిన్నకార్లు, మోటారు సైకిళ్లు బారులు తీరాయి. పందేల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడే భోజనాలతోపాటు అన్ని రకాల తినిబండారాలు అందుబాటులో ఉండడంతో పందెంరాయుళ్లు, వీక్షకులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోడూరు మండలం కవిటం వద్ద నిర్వహించిన కోడి పందేల శిబిరం వద్ద జూదగాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. వ్యక్తికి తీవ్ర గాయం ఉండి గ్రామంలోని పెదపుల్లేరు రోడ్డులో నిర్వహించిన కోడిపందేల శిబిరం వద్ద పందేలు తిల కిస్తున్న చంటిరాజు అనే వ్యక్తి కాలికి కోడి కత్తి ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయం కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామం వద్ద కోడిపందేల శిబిరం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది. విజేతలకు ద్విచక్రవాహనాలు పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం వద్ద నిర్వహించిన కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన శృంగవృక్షం గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి బుల్లెట్ మోటారు సైకిల్ గెలుచుకోగా మరో ఇద్దరు విజేతలకు నిర్వాహకులు స్కూటీలను బహుమతులుగా అందజేశారు. -
మందు, ముక్కతో కనుమ మజా
జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు వారి ముఖ్యమైన పండగల్లో ఒకటైన సంక్రాంతి ఇంటింటా కొత్తకాంతులు తెచ్చింది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇల్లూ సందడిగా మారిండి. సంక్రాంతి మూడు రోజులూ ప్రజలు పెద్ద పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలో స్థిరపడ్డ పలువురు సొంతూళ్లకు చేరుకుని.. అయిన వారి మధ్య వేడుకగా పండగను జరుపుకున్నారు. సింథియా: ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాప్ (ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ శంతను ఝా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శంతను ఝూ తన కెరీర్లో ఆరు ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్‌ను నావిగేట్ చేసి నావిగేషన్ అండ్ స్పెష్టలిస్ట్‌గా అనుభవాన్ని సంపాదించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, భారతీయ నౌకాదళ నౌకలు నిశాంక్, కోరా, సహ్యాద్రిలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయవంతమైన కమాండ్లు చేశారు. ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్, లండన్‌లోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. సాక్షి, విశాఖపట్నం: కనుమ పండగను విశాఖ వాసులు మజా చేశారు. మందు, ముక్కలతో బాగా ఎంజాయ్ చేశారు. భోగి, సంక్రాంతి రెండు రోజులు మాంసాహారాన్ని ముట్టరు. ఆ తర్వాత రోజున వచ్చే కనుమకు మాంసాహార ప్రియులు నాన్‌వెజ్‌ను ఆరగించడం రివాజుగా భావిస్తారు. ఇక మందుబాబులు మామూలు రోజులకంటే కనుమ నాడు మరింతగా మద్యాన్ని సేవిస్తారు. అందుకే అలాంటి కనుమ పండుగ ఎప్పుడు వస్తుందా? అంటూ కళ్లప్పగించి ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కనుమను జనం ఘనంగానే జరుపుకున్నారు. ఉదయం నుంచి మాంసం, మద్యం కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. తెల్లారేసరికే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. కొందరు తెలివిగా సంక్రాంతికి ముందే మందుబాటిళ్లను కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. మద్యం ప్రియులు మరికొంతమంది స్నేహితులతో కలిసి మందు, ముక్కలతో మునిగి తేలారు. కొందరు ఇళ్లకు దూరంగా వెళ్లి పార్టీలు చేసుకున్నారు. ఇక కనుమ అంటే మద్యంతో పాటు మాంసం విక్రయాలదే అగ్రస్థానం. సాధారణ రోజుల్లోకంటే కనుమ పండుగ రోజున వీటి అమ్మకాలు రెండు రెట్లకు పైగానే జరుగుతాయి. బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు కోడి మాంసం రుచిగా ఉంటుందన్న భావనతో కాస్త స్థోమత ఉన్న వారు దీన్ని కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం విశాఖలో బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు (దేశవాళీ) కోడి మాంసం మూడున్నర రెట్లు అధికంగా పలికింది. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.230 ఉంటే నాటు కోడి మాంసం రూ.800కు విక్రయించారు. మూడు రోజుల కిందట కిలో నాటు కోడి మాంసం రూ.600– 650 ఉండగా మంగళవారం అది రూ.800కి పెంచారు. కిలో రూ.190 ఉండే బ్రాయిలర్ చికెన్ రూ.40 పెరిగి రూ.230కి పెరిగింది. ఇక మటన్ కిలో రూ.800 నుంచి 900కి ఎగబాకింది. ఇలా వీటన్నిటిపై కిలోకు రూ.100–150 వరకు పెరిగినా తగ్గేదే లే అంటూ కొనుగోళ్లు చేశారు. విశాఖలో కనుమ నాడు 1,500కు పైగా దుకాణాల ద్వారా సుమారు ఐదు లక్షల కిలోల బ్రాయిలర్ చికెన్, 50 వేల కిలోల నాటు కోడి మాంసం, మరో 50 వేల కిలోల మటన్ అమ్ముడైందని మార్కెట్ వర్గాల అంచనా. మొత్తం మీద కనుమ పండుగ సందర్భంగా విశాఖలో రూ.11 కోట్ల బ్రాయిలర్ చికెన్, రూ.4 కోట్ల నాటు కోడి మాంసం, మరో రూ.4.5 కోట్ల విలువైన మటన్ అమ్మకాలు జరిగాయని అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. సినిమాలు.. షికార్లు.. మందుబాబులు, మాంసాహారులు కనుమను తమదైన రీతిలో ఎంజాయ్ చేయగా ఇతరులు సినిమాలు, షికార్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రేక్షకులతో నగరంలోని సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపించాయి. పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పర్యాటక ప్రదేశాలకు, సాగరతీరంలోని బీచ్‌లకు వెళ్లి చాలాసేపు అక్కడే ఆనందంగా గడిపారు. ఎదురుగా ఎగసి పడుతున్న కెరటాలతో సయ్యాటలాడుతూ పిల్లాపాపలతో కేరింతలు కొట్టారు. భారీగా పోటెత్తిన సందర్శకులతో బీచ్‌లన్నీ కళకళలాడాయి. ఇంకొందరు సాగరతీరంలో పతంగులను ఎగురవేసి సంబరపడ్డారు. ఇలా కనుమ పండుగను నగరవాసులు తనివి తీరా ఆస్వాదించారు. -
కొత్త అల్లుళ్లకు బాహుబలి విందు
కొయ్యలగూడెం/రాజానగరం: సంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం, రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్నకు విజయవాడకు చెందిన చీమకుర్తి శ్రీమన్నారాయణ, దీప్తి కుమారుడు లోకేశ్ సాయితో ఇటీవల వివాహం జరిగింది. సంక్రాంతికి కొత్త అల్లుడిని 225 రకాల తినుబండారాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను ఇంత సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. 150 రకాలతో.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరానికి చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడు రిషీంద్రకు అత్తమామలు సునీతరాణి, శివాజీ 150 రకాలతో ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. -
సంక్రాంతి కోసం ఖండాలు దాటొచ్చారు..
పెద్దపల్లిరూరల్: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బ్రిటన్ నుంచి పెద్దపల్లికి వచ్చారు దరియా–అరుణ్ దంపతులు. ఉద్యోగ నిమిత్తం బ్రిటన్ వెళ్లిన అరుణ్ అక్కడ పోలెండ్ దేశస్తురాలు దరియాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి పెద్దపల్లిలో ఉండే తల్లిదండ్రులు రాంరెడ్డి–రోహిణిల వద్దకు వచ్చాడు. భోగి పండుగ రోజు ఆదివారం అత్త రోహిణి ముగ్గులు వేయగా, కోడలు దరియా వాటిపై గొబ్బెమ్మలను ఉంచింది. అనంతరం స్థానిక కోదండ రామాలయంలో గోదాదేవిరంగనాథులస్వామి కల్యాణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని తెలిపింది. కల్యాణోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఫొటోలు దిగారు. -
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు. -
ఆంధ్ర సంక్రాంతి బరిలో తెలంగాణ పందెం కోడి..
పహాడీషరీఫ్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేల కోసం తెలంగాణ కోడి పుంజులు కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక తర్ఫీదు పొందిన పుంజులు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని కాళ్లు దువ్వుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేలకు.. హైదరాబాద్ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా పందేలు కాసేవారు విజేతగా నిలిచే సత్తా ఉన్న కోడిపుంజుల వైపు మొగ్గు చూపుతున్నారు. కంటికి నచ్చిన మేలుజాతి పుంజుకు రూ.50 వేల వరకు కూడా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. జల్పల్లి మున్సిపల్ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తున్నాయి. అల్లారుముద్దుగా.. ఎర్రకుంట, షాహిన్‌నగర్, కొత్తపేట, సలాల పరిసరాల్లో కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పహిల్వాన్లు మూగ జీవాలను కూడా అంతే మక్కువతో పెంచుతారు. ఈ క్రమంలోనే కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను అదే రీతిలో పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏటా సంక్రాంతి బరిలో దించుతుంటారు. ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేయడం పరిపాటిగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్లకు ఇక్కడి పుంజులు పంట పండించడం విశేషం. వ్యాయామం సైతం సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందు నుంచే ఈ కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. సాధారణంగానే నిత్యం వీటికి పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చేయించే యజమానులు పండుగ బరి కోసం మరింత తర్ఫీదునిస్తారు. పందేనికి అన్ని రకాల సిద్ధమైన కోడి పుంజులను కొనుగోలు చేసేందుకు పందెం రాయుళ్లు పక్షం రోజుల నుంచే పహిల్వాన్లతో టచ్‌లో ఉంటారు. పందెంలో కచ్చితంగా నెగ్గుతామనే నమ్మకంతో వీరి వద్ద నచ్చిన పుంజును కొనుగోలు చేస్తుంటారు. పరిమిత సంఖ్యలో పుంజులను పెంచి ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఇక్కడ విక్రయిస్తుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వీరు పెంచే కోడి పుంజులకు విటమిన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, అక్రోడ్, కీమా, రాగులు, ఉడికించిన గుడ్ల (తెలుపు భాగం)ను ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు నైపుణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. పరిగెత్తించడంతోపాటు ఈత కూడా కొట్టిస్తారు. కోళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల మాదిరిగా చిన్న చిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగ జీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. మూగ జీవాలపై ఉన్న ప్రేమతో మాత్రమే తాము కోళ్లను పెంచుతున్నాము తప్ప తమది వ్యాపార దృక్పథం కాదని పహిల్వాన్లు పేర్కొంటున్నారు. -
పెద్దజాతి కోడిపుంజులకు కేరాఫ్ శివపల్లి
ఎలిగేడు: పందెంకోడి అ‘ధర’హో అనిపిస్తోంది. మేలుజాతి కోడిపుంజులకు భలేగిరాకీ ఉంటోంది. ఒకప్పుడు కోడిపందేలకు కేరాఫ్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామం ఇప్పుడు కోడి పుంజుల పెంపకానికి నిలయంగా మారింది. శివపల్లిలో పెద్దజాతి కోడిపుంజులు ఇంటింటా పెంచుతుండడంతో కొనుగోలు చేసేందుకు జిల్లాతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. దీంతో ఒకప్పుడు కోడి పందేలు నిర్వహించిన గ్రామానికి చెందిన వారు ఇప్పుడు మేలుజాతి కోడిపుంజులు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. మేలుజాతి కోడిపుంజు కిలోకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్నాయి. పెద్దవాటికి రూ.15వేల వరకు వెచ్చిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన కోడిపుంజులు మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాలకు తరలించి కోడిపందేలకు వినియోగిస్తారని చెబుతున్నారు. -
ఆఫ్రికాలో ఉద్యోగం.. ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు
దర్శి: ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు. బంధువులు, స్నేహితులతో కలిసి గడిపే ఆ క్షణాలు ఎన్నటికీ మరువలేని తీపి గురుతులు..!! దర్శి మండలం తూర్పు వీరాయపాలేనికి చెందిన ముప్పరాజు వెంకట రవి ఏడేళ్లుగా ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో లుసాకా కాప్టెల్ సిటీలో ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్ ఆపరేషనల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటా డిసెంబర్ నెలాఖరులో వచ్చి సంక్రాంతి పండగకు బంధువులతో ఆనందంగా గడిపి వెళ్తుంటారు. తాను ఎన్నారై అని మరచిపోయి పిండి దంచడం, పిండి వంటకాల తయారీలో సహాయం చేయడం లాంటి పనుల్లో నిమగ్నమై పండగ వాతావరణాన్ని ఆశ్వాదిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఆఫ్రికా నుంచి బహుమతులు తీసుకువచ్చి ఇస్తుంటారు. అంతే కాదు తమ పొలంలో పంటలను పరిశీలించి సూచనలు సలహాలు ఇస్తుంటారు. ప్రభుత్వ పనితీరు బాగుంది: ముప్పరాజు వెంకటరవి మాది కమ్మ సామాజిక వర్గం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగాయి. మా గ్రామంలో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేశాయి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవు. కక్ష సాధింపులు లేవు. వలంటీర్లు అందరికీ పథకాలు అందిస్తున్నారు. మా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పండగ చేసుకుంటున్నాం. చంద్రబాబు హయాంలో వర్షాలు లేక, పంటలు పండక విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లా. ప్రస్తుతం రైతుల పరిస్ధితి బాగానే ఉంది. నేను ఉద్యోగంలో బాగానే స్ధిరపడ్డాను. ఇక్కడకు వచ్చినప్పుడు వ్యవసాయంపై మక్కువతో మా పొలాలు కూడా చూసుకుంటుంటా. సంక్రాంతి తర్వాత ఆఫ్రికా వెళ్లి మళ్లీ ఏడాదికి వస్తా. -
భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రలో ఈ పండుగ హడవిడి మాములుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో కొత్త కోడళ్లు, అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడి పందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటలు రుచులుతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్న ఈ పండుగ వస్తే ఊళ్లకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు చలిమంటలు ఎందుకు వేస్తారు?. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం!. భోగి అనే పేరు ఎలా వచ్చిందంటే.. 'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే..పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ!. భోగిమంటలు ఎందుకంటే.. అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే..? ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ భోగిమంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణ వాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72 వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే తగిన ఔషధం ఇవ్వోచ్చు. అదే అందరికీ ఇవ్వడం కాస్త కష్టం, పైగా అసాధ్యం కూడా. వైద్యం చేయించుకోలేని పేదవాళ్లు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించే మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి ఐక్యమత్యానికి శ్రీకారం చుడుతుంది. అంత మహిమాన్వితమైన ఈ భోగి పండుగ రోజును మీ లోగిళ్లో భోగిమంటలు వేసుకుని పెద్దచిన్న అంతా పాల్గొని ఆయురారోగ్యాల పొందడమే గాక భోగభాగ్యాలు కలిగేలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!) -
కోళ్లకూ ఉందో పంచాంగం
తాడేపల్లిగూడెం: మా నవులకు శాస్త్రాలు, పంచాంగాలు, ఉన్నట్టే కోళ్లకు ప్రత్యే క పంచాంగం ఉంది. బరిలో ఏ రంగు కోడి గెలుస్తుంది? ఏ రంగు కోడి ఓడిపోతుంది? ఇవన్నీ కుక్కుట శాస్త్రంలో ఉంటాయి. పందేలు వేసే వారికి కుక్కుట శాస్త్రం ఒక ఆయుధమని పందేల ఔత్సాహికులు చెబుతూ ఉంటారు. కాబట్టి కుక్కుట శాస్త్రం ప్రకారం ఈ సంక్రాంతి ఏయే రకాల కోడి పుంజులు బరిలో గెలుస్తాయనే అంచనాలు వేస్తున్నారు. కోడిపుంజును సంస్కృతంలో కుక్కుటం అంటారు. రాచరికాల కాలంలో పౌరుషాలకు చిహ్నంగా కోడి పందేలు సాగేవి. ప్రస్తుత రోజుల్లో సంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతికి కోడిపందేలు జరగడం ఆనవాయితీగా మారింది. పందేల మోజు నేపథ్యంలో పుంజుల పెంపకం దగ్గర నుంచి పందేల వరకూ ప్రజల విశ్వాసాల మాదిరిగానే కోడి పందేలలో పంచాంగం, నక్షత్రాల ప్రభావం పడింది. దీన్ని నుంచి వచ్చిందే కుక్కుట శాస్త్రం. ఈ శాస్త్రంలో కోడి ఈకల రంగును కొట్టి పుంజుల పేర్లను వర్గీకరించారు. నక్షత్రాలకు అనుగుణంగా గెలుపోటములు ఈ ఏడాది సంక్రాంతిలో ముఖ్యంగా మూడు రోజుల నక్షత్రాలను పరిశీలిస్తే భోగి రోజున ధనిష్ట నక్షత్రానికి పసుపు రంగు డేగ, సంక్రాతికి శతభిషం కాకి, కనుమ పూర్వాభాద్ర నెమలి రంగు కోళ్లు విజయం సాధించే అవకాశం ఉందని పందెంరాయుళ్లు చెబుతున్నారు. దిశలకు అనుగుణంగా పందేలు ఆదివారం ఉత్తర దిశ, సోమవారం దక్షిణ దిశ, మంగళవారం తూర్పు ముఖంగా పందేలు వేస్తే విజయం సాధిస్తాయని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బరిలోకి పెరూ పుంజులు దేశవాళీ పందేలకు ఈసారి బరిలో పెరూ జాతి పుంజులు దింపుతున్నారు. భారతీయ పుంజులతో పెరూ పెట్టలను సంకరపర్చి ఓ జాతిని అభివృద్ధి చేశారు. ఇవే పెరూ పుంజులుగా ప్రాచుర్యం పొందాయి. పుంజులకు ఈ సారి నాస్తా లడ్డు పేరిట ఆయుర్వేద గుళికలు ఇస్తున్నారు. -
సంప్రదాయ ఘుమఘుమలు
సాక్షి, భీమవరం: స్వీట్లలో వైరెటీలు ఎన్నొచ్చినా సంక్రాంతి వస్తోందంటే తెలుగునాట ప్రతి ఇల్లు సంప్రదాయ పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంటుంది. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో గృహిణులంతా సున్నుండలు, పోకుండలు, అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చల్లగుత్తులు వంటి పిండి వంటల తయారీలో బిజీ అయిపోయారు. కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్ పోకుండలు, కజ్జికాయలు వంటి ఆధునిక పిండి వంటలు సైతం సంక్రాంతి వంటకాల్లో చేరి మరింత మాధుర్యాన్ని అందిస్తున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా పల్లెల్లో ప్రతి ఇంటా పిండివంటల తయారీకి ప్రాధాన్యమిస్తారు. స్థోమత మేరకు జంతికలు, సున్నండలు, బెల్లం ఉండలు, చల్లగుత్తులు, పోకుండలు, రవ్వ లడ్డూలు, పొంగడాలు, అరిసెలు, మైసూర్‌పాక్, కారపు బూందీ తదితర వైరెటీలు చేస్తుంటారు. కొత్తగా వివాహం జరిగిన ఇళ్లలో పిండి వంటల తయారీ మరింత సందడిగా ఉంటుంది. పండుగకు వచ్చే కొత్త అల్లుళ్ల కోసం ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తుంటారు. దూరప్రాంతాల నుంచి పండుగకు వచ్చిన తమ కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి వెళ్లే సమయంలో వాటిని అందిస్తుంటారు. కొందరు దేశ విదేశాల్లో ఉన్న తమ వారికి ప్రత్యేకంగా పిండి వంటలు తయారుచేసి పంపుతుంటారు. ఆర్డర్లే.. ఆర్డర్లు : ఇళ్ల వద్ద పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేక స్వీట్స్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పట్టణాల్లో పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాలీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ తదితర వైరెటీ స్వీట్స్ తయారుచేసే స్వీట్స్షాపుల నిర్వాహకులు సంక్రాంతి పండుగల్లో సంప్రదాయ పిండి వంటల తయారీకి ప్రాధాన్యమిస్తున్నారు. పోకుండలు, కజ్జికాయలు, కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్ బూరెలతో సంప్రదాయ పిండి వంటల్లో ఆధునికతను జోడిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పేరొందిన స్వీట్స్ షాపులతోపాటు చిన్న షాపుల్లోనూ సంక్రాంతి పిండి వంటల తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో కేటరింగ్ నిర్వాహకులు, స్వీట్స్ తయారీదారులకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. భీమవరం మండలం చినఅమిరం, కాళ్ల మండలం కోపల్లె, ఆకివీడు మండలం ఐ.భీమవరం, సిద్ధాపురం, యలమంచిలి మండలం కలగంపూడి తదితర చోట్ల ఇళ్ల వద్ద మహిళలు సంక్రాంతి పిండి వంటల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. చెరువులు, హేచరీలు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పండుగ కానుకగా ఇచ్చేందుకు స్వీట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని తయారీదారులు అంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని, సంక్రాంతి రోజుల్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంక్రాంతి పిండి వంటల వ్యాపారం జరుగుతోందంటున్నారు. జిల్లాలో రూ.12 కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి సంక్రాంతి పండుగలకు గతంతో పోలిస్తే ఇళ్ల వద్ద తయారీ తగ్గింది. ఈ ఏడాది ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. స్థానికంగానే కాకుండా దూరప్రాంతాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. – ఉద్దర్రాజు సీతాదేవి, ఐ.భీమవరం, ఆకివీడు మండలం సంప్రదాయ పిండి వంటలకు డిమాండ్ సంక్రాంతి సీజన్ కావడంతో జంతికలు, సున్నుండలు, అరిసెలు తదితర సంప్రదాయ పిండి వంటల్ని అధికంగా అడుగుతున్నారు. అందుకే వాటి తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. – వత్సవాయి ఆశ, కలగంపూడి, యలమంచిలి మండలం -
ఊరూరా.. నోరూరేలా..
సాక్షి అమలాపురం: ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవ.. తాపేశ్వరం కాజా.. పెరుమలాపురం పాకం గారెలు.. కాకినాడ గొట్టం కాజా... అల్లవరం చెకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాలో పిండి వంటలకు, స్వీట్ షాపులకు జాతీయ స్థాయిలో పేరుంది. అతిథి మర్యాదలకు చిరునామాగా నిలిచే తూర్పున సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ ప్రత్యేక స్వీట్, హాట్లకు అదనంగా సంప్రదాయ పిండి వంటలు తోడవుతాయి. కరకరలాడే జంతికలు, నోటిలో కరిగిపోయే వెన్నప్పాలు, నమిలే కొద్దీ మాధుర్యాన్నిచ్చే పొంగడాలు, పంటికి పనిచెప్పే చక్కిడాలు, నోటిని తీపిచేసే కజ్జికాయలు, నేతి సువాసనలతో నోరూరించే సున్నుండలు, కమ్మనైన అరిసెలు తదితర సంప్రదాయ వంటలతో ఉమ్మడి జిల్లా ఘుమఘుమలాడాల్సిందే. పిండి వంటలకు ప్రత్యేకత సంక్రాంతి పండగ అంటేనే ఎన్నో సందడులు. వాటిలో పిండి వంటలు ప్రత్యేకం. విద్య, ఉద్యోగం, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన సొంతవారు.. కొత్త అల్లుళ్లు.. వారితో పాటు అతిథులు వచ్చే సమయం ఆసన్నం కావడంతో ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా సందడే సందడే. ప్రతి ఇంటి వద్ద సంప్రదాయ పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఇంట పిండివంటల తయారీ మొదలైంది. అరిసెలు, మినప సున్నుండలు, గోధుమ సున్నండలు, బెల్లం మిఠాయి, పానీలు, గోరుమిఠాయి, జంతికలు, చల్ల గుత్తులు, పోకుండలు, రవ్వ లడ్డూలు, మైసూర్ పాకం, కారబూందీ, మురుకులు, అప్పడాలు, తదితర పిండివంటలు అన్నిచోట్ల చేయడం కనిపిస్తోంది. వీటితో పాటు కోనసీమ ప్రాంతంలో పానీలు, ఇలంబికాయలు, కొబ్బరి నౌజు, కొబ్బరి గారెలు, ఉండలు, మెట్ట ప్రాంతంలో వెన్నప్పాలు, గోరుమిటీలు ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువ పిండి వంటలు చేసి పండగ కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన తమ కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లే సమయంలో వాటినందిస్తుంటారు. ఇరుగు పొరుగు వారు పిండివంటలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆప్యాయతలను పంచుకుంటారు. స్వీట్స్ షాపుల్లోనూ.. పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేక వాటి కోసం స్వీట్ షాపులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాళీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ స్వీట్స్, ఆగ్రా మిక్చర్ తదితర హాట్ రకాలను తయారు చేసే స్వీట్‌షాపుల నిర్వాహకులు పెద్ద పండగ కోసం సంప్రదాయ పిండివంటలను సిద్ధం చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, తాపేశ్వరం, కొత్తపేట, తుని వంటి ప్రాంతాల్లో స్వీట్ల తయారీలో పేరొందిన పెద్ద సంస్థలతో పాటు చిన్న దుకాణాల్లో వీటి తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా తయారీ సంస్థల వద్ద సంక్రాంతి సమయంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో సంక్రాంతి పిండి వంటలు విక్రయాలు ఆన్‌లైన్‌లోనూ జోరుగా సాగుతున్నాయి.