పహాడీషరీఫ్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేల కోసం తెలంగాణ కోడి పుంజులు కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక తర్ఫీదు పొందిన పుంజులు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని కాళ్లు దువ్వుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేలకు.. హైదరాబాద్ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా పందేలు కాసేవారు విజేతగా నిలిచే సత్తా ఉన్న కోడిపుంజుల వైపు మొగ్గు చూపుతున్నారు. కంటికి నచ్చిన మేలుజాతి పుంజుకు రూ.50 వేల వరకు కూడా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. జల్‌పల్లి మున్సిపల్ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తున్నాయి.
అల్లారుముద్దుగా..
ఎర్రకుంట, షాహిన్‌నగర్, కొత్తపేట, సలాల పరిసరాల్లో కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పహిల్వాన్లు మూగ జీవాలను కూడా అంతే మక్కువతో పెంచుతారు. ఈ క్రమంలోనే కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను అదే రీతిలో పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏటా సంక్రాంతి బరిలో దించుతుంటారు. ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేయడం పరిపాటిగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్లకు ఇక్కడి పుంజులు పంట పండించడం విశేషం.
వ్యాయామం సైతం
సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందు నుంచే ఈ కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. సాధారణంగానే నిత్యం వీటికి పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చేయించే యజమానులు పండుగ బరి కోసం మరింత తర్ఫీదునిస్తారు. పందేనికి అన్ని రకాల సిద్ధమైన కోడి పుంజులను కొనుగోలు చేసేందుకు పందెం రాయుళ్లు పక్షం రోజుల నుంచే పహిల్వాన్లతో టచ్‌లో ఉంటారు. పందెంలో కచ్చితంగా నెగ్గుతామనే నమ్మకంతో వీరి వద్ద నచ్చిన పుంజును కొనుగోలు చేస్తుంటారు. పరిమిత సంఖ్యలో పుంజులను పెంచి ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఇక్కడ విక్రయిస్తుంటారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
వీరు పెంచే కోడి పుంజులకు విటమిన్‌లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, అక్రోడ్, కీమా, రాగులు, ఉడికించిన గుడ్ల (తెలుపు భాగం)ను ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు నైపుణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. పరిగెత్తించడంతోపాటు ఈత కూడా కొట్టిస్తారు. కోళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్ల మాదిరిగా చిన్న చిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగ జీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. మూగ జీవాలపై ఉన్న ప్రేమతో మాత్రమే తాము కోళ్లను పెంచుతున్నాము తప్ప తమది వ్యాపార దృక్పథం కాదని పహిల్వాన్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment