చిలుకూరు పూజారి రంగరాజన్‌కు కేటీఆర్ పరామర్శ | BRS KTR Meets Chilkur Balaji Temple head priest Rangarajan | Sakshi
Sakshi News home page

చిలుకూరు పూజారి రంగరాజన్‌కు కేటీఆర్ పరామర్శ

Published Mon, Feb 10 2025 1:14 PM | Last Updated on Mon, Feb 10 2025 3:10 PM

BRS KTR Meets Chilkur Balaji Temple head priest Rangarajan

సాక్షి, హైదరాబాద్‌: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో దాడి ఎవరు చేసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై గత శుక్రవారం దాడి జరిగింది. ఈ నేపథ్యంలో రంగరాజన్‌ను కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పరామర్శించారు. దాడి జరిగిన అంశంపై ఆయనతో మాట్లాడారు.

అనంతరం, కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయి. ఇది అత్యంత దుర్మార్గమైన నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా.. ఏ పేరిట చేసినా.. ఏ ఎజెండాతో చేసినా ఉపేక్షించకూడదు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి ఎవరు చేశారో వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు.. ఈ దాడి ఘటనపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌.. ధర్మ రక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని మండిపడ్డారు. రంగరాజన్‌పై దాడిపై హిందూ ధర్మ పరిరక్షకులు ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని విమర్శించారు. దాడి ఘటనపై వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దాడి ఇలా.. 
సీఐ పవన్‌కుమార్‌ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్‌ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్‌ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement