
పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది
డీఎంకే సమావేశానికి హాజరై తెలంగాణ వాదన వినిపిస్తాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
డీఎంకే ప్రతినిధి బృందంతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్వహించబోయే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్వి భజన (డీ లిమిటేషన్) చేపడితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని విమర్శించారు.
ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరై బీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ వాదనను వినిపిస్తామని తెలిపారు. తమిళ నాడు పురపాలక శాఖ మంత్రి కె.ఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్.ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ గురువారం సాయంత్రం సమావేశమయ్యా రు. డీలిమిటేషన్‌కు వ్య తిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా డీఎంకే బృందం బీఆర్‌ఎస్ పార్టీకి ఆహ్వానం అందజేసింది.
ఈ సందర్భంగా ఇరుపక్షాలు మీడియాతో మాట్లాడాయి. ‘డీ లిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970–80 దశకంలో కుటుంబ నియంత్రణ సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాల సంఖ్యను కొత్తగా చేసే జనగణన ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్రం చెప్పడం అన్యాయం.
ఇదే జరిగితే పార్లమెంట్‌లో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్ తరపున హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరై బీఆర్‌ఎస్‌తోపాటు తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని డీఎంకే నేతలు ప్రకటించారు. అంతకుముందు డీఎంకే నేతలను కేటీఆర్ సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment