సంక్రాంతి పిండి వంటల తయారీలో మహిళలు
సాక్షి, భీమవరం: స్వీట్లలో వైరెటీలు ఎన్నొచ్చినా సంక్రాంతి వస్తోందంటే తెలుగునాట ప్రతి ఇల్లు సంప్రదాయ పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంటుంది. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో గృహిణులంతా సున్నుండలు, పోకుండలు, అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చల్లగుత్తులు వంటి పిండి వంటల తయారీలో బిజీ అయిపోయారు. కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్ పోకుండలు, కజ్జికాయలు వంటి ఆధునిక పిండి వంటలు సైతం సంక్రాంతి వంటకాల్లో చేరి మరింత మాధుర్యాన్ని అందిస్తున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా పల్లెల్లో ప్రతి ఇంటా పిండివంటల తయారీకి ప్రాధాన్యమిస్తారు.
స్థోమత మేరకు జంతికలు, సున్నండలు, బెల్లం ఉండలు, చల్లగుత్తులు, పోకుండలు, రవ్వ లడ్డూలు, పొంగడాలు, అరిసెలు, మైసూర్‌పాక్, కారపు బూందీ తదితర వైరెటీలు చేస్తుంటారు. కొత్తగా వివాహం జరిగిన ఇళ్లలో పిండి వంటల తయారీ మరింత సందడిగా ఉంటుంది. పండుగకు వచ్చే కొత్త అల్లుళ్ల కోసం ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తుంటారు. దూరప్రాంతాల నుంచి పండుగకు వచ్చిన తమ కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి వెళ్లే సమయంలో వాటిని అందిస్తుంటారు. కొందరు దేశ విదేశాల్లో ఉన్న తమ వారికి ప్రత్యేకంగా పిండి వంటలు తయారుచేసి పంపుతుంటారు.
ఆర్డర్లే.. ఆర్డర్లు : ఇళ్ల వద్ద పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేక స్వీట్స్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పట్టణాల్లో పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాలీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ తదితర వైరెటీ స్వీట్స్ తయారుచేసే స్వీట్స్‌షాపుల నిర్వాహకులు సంక్రాంతి పండుగల్లో సంప్రదాయ పిండి వంటల తయారీకి ప్రాధాన్యమిస్తున్నారు. పోకుండలు, కజ్జికాయలు, కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్ బూరెలతో సంప్రదాయ పిండి వంటల్లో ఆధునికతను జోడిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పేరొందిన స్వీట్స్ షాపులతోపాటు చిన్న షాపుల్లోనూ సంక్రాంతి పిండి వంటల తయారీ ఎక్కువగా కనిపిస్తోంది.
గ్రామాల్లో కేటరింగ్ నిర్వాహకులు, స్వీట్స్ తయారీదారులకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. భీమవరం మండలం చినఅమిరం, కాళ్ల మండలం కోపల్లె, ఆకివీడు మండలం ఐ.భీమవరం, సిద్ధాపురం, యలమంచిలి మండలం కలగంపూడి తదితర చోట్ల ఇళ్ల వద్ద మహిళలు సంక్రాంతి పిండి వంటల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. చెరువులు, హేచరీలు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పండుగ కానుకగా ఇచ్చేందుకు స్వీట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని తయారీదారులు అంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని, సంక్రాంతి రోజుల్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంక్రాంతి పిండి వంటల వ్యాపారం జరుగుతోందంటున్నారు. జిల్లాలో రూ.12 కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా.
ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి
సంక్రాంతి పండుగలకు గతంతో పోలిస్తే ఇళ్ల వద్ద తయారీ తగ్గింది. ఈ ఏడాది ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. స్థానికంగానే కాకుండా దూరప్రాంతాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి.
– ఉద్దర్రాజు సీతాదేవి, ఐ.భీమవరం, ఆకివీడు మండలం
సంప్రదాయ పిండి వంటలకు డిమాండ్
సంక్రాంతి సీజన్ కావడంతో జంతికలు, సున్నుండలు, అరిసెలు తదితర సంప్రదాయ పిండి వంటల్ని అధికంగా అడుగుతున్నారు. అందుకే వాటి తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నాం.
– వత్సవాయి ఆశ, కలగంపూడి, యలమంచిలి మండలం
Comments
Please login to add a commentAdd a comment