సాక్షి అమలాపురం: ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవ.. తాపేశ్వరం కాజా.. పెరుమలాపురం పాకం గారెలు.. కాకినాడ గొట్టం కాజా... అల్లవరం చెకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాలో పిండి వంటలకు, స్వీట్ షాపులకు జాతీయ స్థాయిలో పేరుంది. అతిథి మర్యాదలకు చిరునామాగా నిలిచే తూర్పున సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ ప్రత్యేక స్వీట్, హాట్‌లకు అదనంగా సంప్రదాయ పిండి వంటలు తోడవుతాయి. కరకరలాడే జంతికలు, నోటిలో కరిగిపోయే వెన్నప్పాలు, నమిలే కొద్దీ మాధుర్యాన్నిచ్చే పొంగడాలు, పంటికి పనిచెప్పే చక్కిడాలు, నోటిని తీపిచేసే కజ్జికాయలు, నేతి సువాసనలతో నోరూరించే సున్నుండలు, కమ్మనైన అరిసెలు తదితర సంప్రదాయ వంటలతో ఉమ్మడి జిల్లా ఘుమఘుమలాడాల్సిందే.
పిండి వంటలకు ప్రత్యేకత
సంక్రాంతి పండగ అంటేనే ఎన్నో సందడులు. వాటిలో పిండి వంటలు ప్రత్యేకం. విద్య, ఉద్యోగం, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన సొంతవారు.. కొత్త అల్లుళ్లు.. వారితో పాటు అతిథులు వచ్చే సమయం ఆసన్నం కావడంతో ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా సందడే సందడే. ప్రతి ఇంటి వద్ద సంప్రదాయ పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఇంట పిండివంటల తయారీ మొదలైంది. అరిసెలు, మినప సున్నుండలు, గోధుమ సున్నండలు, బెల్లం మిఠాయి, పానీలు, గోరుమిఠాయి, జంతికలు, చల్ల గుత్తులు, పోకుండలు, రవ్వ లడ్డూలు, మైసూర్ పాకం, కారబూందీ, మురుకులు, అప్పడాలు, తదితర పిండివంటలు అన్నిచోట్ల చేయడం కనిపిస్తోంది. వీటితో పాటు కోనసీమ ప్రాంతంలో పానీలు, ఇలంబికాయలు, కొబ్బరి నౌజు, కొబ్బరి గారెలు, ఉండలు, మెట్ట ప్రాంతంలో వెన్నప్పాలు, గోరుమిటీలు ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువ పిండి వంటలు చేసి పండగ కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన తమ కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లే సమయంలో వాటినందిస్తుంటారు. ఇరుగు పొరుగు వారు పిండివంటలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆప్యాయతలను పంచుకుంటారు.
స్వీట్స్ షాపుల్లోనూ..
పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేక వాటి కోసం స్వీట్ షాపులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాళీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ స్వీట్స్, ఆగ్రా మిక్చర్ తదితర హాట్ రకాలను తయారు చేసే స్వీట్‌షాపుల నిర్వాహకులు పెద్ద పండగ కోసం సంప్రదాయ పిండివంటలను సిద్ధం చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, తాపేశ్వరం, కొత్తపేట, తుని వంటి ప్రాంతాల్లో స్వీట్ల తయారీలో పేరొందిన పెద్ద సంస్థలతో పాటు చిన్న దుకాణాల్లో వీటి తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా తయారీ సంస్థల వద్ద సంక్రాంతి సమయంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో సంక్రాంతి పిండి వంటలు విక్రయాలు ఆన్‌లైన్‌లోనూ జోరుగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment