kodipandalu
-
Kodi Pandalu In AP Photos: సంక్రాంతి సంబరాల్లో జోరుగా సాగిన కోడి పందేలు.. కోలాహలం (ఫొటోలు)
-
సంక్రాంతి కోడిపందేల్లో బుల్లెట్ గెలుచుకున్న కోడిపుంజు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ కోడి పందేలు మూడో రోజూ జోరుగా సాగాయి. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కోడిపందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పందేల బరులు కిటకిటలాడాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు కూడా విచ్చలవిడిగా సాగాయి. కోడిపందేల బరులు వద్ద జూదాలు ఏర్పాటుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించగా, పెద్ద బరుల వద్ద జూదాల నిర్వహణకు అధిక మొత్తంలో పాటలు పాడినట్లు తెలుస్తోంది. కాళ్ల, తణుకు, ఆకివీడు, యలమంచిలి, ఇరగవరం, అత్తిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌లు సాగాయి. నగదు లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా.. రాత్రి సమయంలో సైతం కోడి పందేలు, జూదాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేయడమేగాక పందేలను స్పష్టంగా చూడడానికి కొన్ని చోట్ల ఎల్ఈడీ టీవీలు సైతం ఏర్పాటు చేశారు. కాళ్ల మండలంలో బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. వీక్షించే వారిని అనుమతించడానికి వారి చేతులకు ప్రత్యేక ట్యాగ్లు వేశారు. బారులు తీరిన కార్లు : కోడి పందేల బరులు వద్ద భారీ సంఖ్యలో చిన్నకార్లు, మోటారు సైకిళ్లు బారులు తీరాయి. పందేల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడే భోజనాలతోపాటు అన్ని రకాల తినిబండారాలు అందుబాటులో ఉండడంతో పందెంరాయుళ్లు, వీక్షకులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోడూరు మండలం కవిటం వద్ద నిర్వహించిన కోడి పందేల శిబిరం వద్ద జూదగాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. వ్యక్తికి తీవ్ర గాయం ఉండి గ్రామంలోని పెదపుల్లేరు రోడ్డులో నిర్వహించిన కోడిపందేల శిబిరం వద్ద పందేలు తిల కిస్తున్న చంటిరాజు అనే వ్యక్తి కాలికి కోడి కత్తి ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయం కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామం వద్ద కోడిపందేల శిబిరం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది. విజేతలకు ద్విచక్రవాహనాలు పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం వద్ద నిర్వహించిన కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన శృంగవృక్షం గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి బుల్లెట్ మోటారు సైకిల్ గెలుచుకోగా మరో ఇద్దరు విజేతలకు నిర్వాహకులు స్కూటీలను బహుమతులుగా అందజేశారు. -
నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది. సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు. సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు. మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘. పెద్ద పండగ ఎలా అయింది? సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ ఎమ్మెల్సీ
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నాంటాయి. రంగురంగుల ముగ్గులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జన జాతరతో బుధవారం ఈడుపు గళ్లు కోలాహలంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన కోడిపందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కాగా తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మల్లేష్ ఈ సంబరాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. -
కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం:తలసాని
సాక్షి, ఉండి: సంక్రాంతి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటుచేసిన కోడిపందాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమని అన్నారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని కొనియాడారు. కోడిపందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని ప్రశంసించారు. -
మూడు రోజుల మహాపర్వం
ముద్దబంతులు, రంగవల్లులు, నేతి అరిశలు, గారెలు, బూరెల వంటి పిండి వంటల ఘుమఘుమలు, హరిదాసుల మేలుకొలుపులు, పశువుల మువ్వల పట్టెడల ధ్వనులు, గుంపులు గుంపులుగా జరుపుకునే కోడిపందాలు, ఆకాశంలో చుక్కలతో పోటీపడే రంగు రంగుల గాలి పటాలు మనకు కనువిందు చేస్తున్నాయంటే అది కచ్చితంగా సంక్రాంతి నెలే అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి.పెద్ద పండగ అని పిలిచే ఈ పండగ హడావుడి డిసెంబర్ 17 నుంచి జనవరి 16 వరకు ఉంటుంది. అసలు సంక్రాంతి పండగ అంటేనే ప్రకృతి పండగ. ప్రకృతితో మనిషి సహజీవనం చేస్తున్నాడని స్పష్టమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. ముచ్చట గొలిపే గొబ్బిళ్లు సంక్రాంతి నెల పట్టగానే ఇంటిముందు వేసిన ముగ్గులో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్ని పెట్టి వాటికి పసుపు కుంకుమతో అలంకారం చేస్తారు. ఆ గొబ్బెమ్మ మధ్యలో ముళ్లగోరింట, గుమ్మడి, ముద్దబంతి పూలను ఉంచుతారు. ఇంటిముందు తెల్లవారు జామున పెట్టిన ఈ గొబ్బెమ్మల్ని అసుర సంధ్య వేళ తీసి పిడకలాగా చేస్తారు. నెలరోజుల పాటు పెట్టిన ఈ గొబ్బెమ్మల పిడకలను భోగిపండగ రోజు పొయ్యి కింద పెట్టి ఆ మంటతో పాయసం చేస్తారు. తీర్చిదిద్దే ముత్యాల ముగ్గులు మామూలు రోజుల్లో ఇంటి ముందు ముగ్గు ఎన్ని గంటలకు వేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే పండగ నెలలో మాత్రం మా ఇంటి ముందే ముందు ముగ్గు ఉండాలని మహిళలు పోటీ పడి మరీ వేస్తారు. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఆ ముగ్గులకు అందమైన రంగులు అద్దడం ముచ్చట గొలుపుతుంది. సంక్రాంతి సందర్భంగా రథం ముగ్గులు, చుక్కల ముగ్గులు వేస్తారు. శ్రీమద్రారమణ గోవిందో హరి అంటూ ఈ నెలలో మాత్రమే మన ఇంటిముందుకు వస్తారు హరిదాసులు. మెడలో పూలమాల, పట్టుపంచె, తలపైన పూల సజ్జ, చేతిలో చిడతలతో శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ, ఇల్లిల్లూ తిరుగుతూ సందడి చేస్తారు హరిదాసులు. సంక్రాంతినెల మొత్తం హరిదాసులకు బియ్యం పోసి, పండగరోజు మాత్రం ప్రత్యేకంగా పిండివంటలు, ధాన్యాలు ఇస్తారు. గంగిరెద్దుల విన్యాసాలు అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టమని అంటుంటే, గంగిరెద్దులు చేసే విన్యాసాలు చూడాలంటే సంక్రాంతి నెలలోనే సాధ్యం. పెద్ద మూపురం ఉన్న ఎద్దుల కాళ్ళకి గజ్జెలు కట్టి, కొమ్ములకు పూలను చుట్టి, వీపుపైన అద్దాలతో కుట్టిన రంగురంగుల వస్త్రంతో ముస్తాబు చేసి ఊర్లోకి తీసుకు వస్తారు గంగిరెద్దుల వాళ్లు. అవి ఊళ్లోకి అడుగు పెట్టగానే అందరికీ దండాలు పెట్టి రకరకాల విన్యాసాలు చేస్తాయి. వీటిని చూసి ఆనందించిన వారు కానుకలు కురిపిస్తారు. భోగ భాగ్యాలనిచ్చే భోగిమంటలు... భోగిపండ్లు మూడు రోజుల ముఖ్య పండగలో మొదటి రోజు భోగి. ఇంట్లో ఉన్న పాత, పనికిరాని వస్తువుల్ని తీసుకు వచ్చి వాకిలి ముందు మంటల్లో వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. ఈ మంటలతో శీతాకాలం చలి బారి నుంచి తప్పించుకోవడంతో పాటు ఇంట్లోని చెత్తాచెదారం కూడా వదిలిపోతుంది. భోగి రోజు సాయంత్రం చిన్నారులకు రేగుపండ్లతో భోగిపండ్లను పోస్తారు. చిన్నారులకు ఏదైనా బాలారిష్టాలు ఉంటే తొలగి పోవాలని ఆశీర్వదిస్తూ, పెద్దలు భోగిపండ్లు పోస్తారు. మహా పర్వదినం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి తన దిశ మార్చుకునే రోజును మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకు ప్రయాణిస్తాడు. ఈ రోజునే పెద్దల పండగ చేస్తారు. చనిపోయిన పెద్దలకు బట్టలు పెట్టి తమ గౌరవ మర్యాదలు చాటుకుంటారు. పతంగుల సంబరాలు పశువుల పండగ రోజునే చిన్నా పెద్దా అందరూ కలిసి ఉత్సాహంగా గాలి పటాలు ఎగరేస్తారు. అందమైన, విభిన్నమైన గాలిపటాలను ఎగరేసి సంబరాలు చేసుకుంటారు. గాలిపటాన్ని ఎగురవేసే దారాన్ని మనం ఎలా పట్టుకుని సమతులనం చేస్తామో, అదేవిధంగా జీవితాన్ని కూడా సమతూకంలో చూడాలని దీని అంతరార్థం. ఎనుములకు సింగారం... చేలల్లో ఉన్న కొత్త పంటను ఈరోజే ఇళ్లకు తీసుకు వస్తారు. పశువులకు పూజ చేసి, బండ్లను సింగారించి రైతులు భార్యా పిల్లలతో కలిసి పొలాలకు వెళ్లి ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకు వస్తారు. కనుమ రోజునే కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. మరికొన్ని చోట్ల ఎద్దుల పందాలు నిర్వహిస్తారు. మాంసాహారులు ఈ వేళ తప్పనిసరిగా మాంసాన్ని స్వీకరిస్తే, శాకాహారులు మినుములతో తయారు చేసిన గారెలు తినడం వాడుకలో ఉన్న సంప్రదాయం. – డి.వి.ఆర్. -
కత్తులతో కో‘ఢీ’
నిబంధనలకు నీళ్లు.. యథేచ్ఛగా పందాలు జిల్లాలో జోరుగా కోడి పందాలు చేతులు మారుతున్న లక్షల రూపాయలు ప్రజాప్రతినిధులే ప్రత్యక్ష సాక్షులు పోలీసులు మౌన ప్రేక్షకులు పందెం కోడి కాలు దువ్వింది.. కత్తులు కట్టుకొని మరీ కదం తొక్కింది.. సంప్రదాయానికి సరే.. కత్తులు మాత్రం కూడదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ కాలదన్నింది.. భోగి పండుగ అయిన శుక్రవారం నుంచే పందెం కోళ్లు ఢీ అంటే ఢీ అన్నాయి.. వాటి మధ్య లక్షల రూపాయలు చేతులు మారాయి.. విశాఖ నగర శివారులోని ముడసర్లోవతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. వీటితోపాటు గుర్రపు పందాలు, ఎడ్లపందాలకు గ్రామీణ ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. విశాఖపట్నం: సంక్రాంతి అంటే కోడిపందాల కోలాహలం తప్పనిసరి. అయితే ఈసారి కత్తులు లేకుండా కోడిపందాలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కత్తులతోనే కోడిపందాలు జరిగాయి. నగర శివార్లలో భారీ బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలి, కోటఉరట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, చోడవరం, మాడుగుల, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాల్లో పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణలు దగ్గరుండి ముడసర్లోవ ప్రాంతంలో కోడి పందాలు జరిపించారు. దీంతోపోలీసులు ప్రేక్షకపాత్ర వహించి, శాంతి భద్రతలు పర్యవేక్షణతో సరిపెట్టారు.పక్క జిల్లాల నుంచి పందెం రాయుళ్లు నగరంలో జరిగిన కోడి పందాలకు పక్క జిల్లాలైన తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పందెం రాయుళ్లు వచ్చారు. నిజానికి ఉభయగోదావరి జిల్లాల్లోనే కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈసారి అక్కడి పోలీసులు నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు సొంత ప్రాంతంలో పందాలు కాయడానికి కొందరు సంశయించడం వంటి కారణాలతో విశాఖ జిల్లాకు తాకిడి పెరిగింది. వీరంతా తమ వెంట కోళ్లను తీసుకువచ్చి మరీ పందాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు: కోడిపందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశారు. నగదు కొరత ప్రభావం కోడి పందాలపై పెద్దగా కనిపించలేదు. నగదు రహిత పందాలకూ సై అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. స్మార్ట్ఫోన్లు, స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకున్నారు. దీంతో పందెంరాయుళ్లతోపాటు.. మందుబాబులతో శివారు ప్రాంతాలు కోలాహలంగా మారాయి. షామియానా సప్లయర్లు, భోజన విక్రేతలకు, చిరుతిళ్ల వ్యాపారులకు మంచి వ్యాపారం జరిగింది. ముఖ్యంగా మాంసం అమ్మకాలు విపరీతంగా జరిగాయి. బారులు తీరిన వాహనాలు: కోడి పందాలకు వచ్చిన వారితో నగరంలోని బరులు, రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ఒక్క ముడసర్లోవ ప్రాంతంలోనే ఐదొందల కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు కష్టంగా మారింది. వందలాది మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డులను నియమించారు. రేపటి నుంచి ఎడ్లు, గుర్రం పందాలు కనుమ రోజు నుంచి జిల్లాలో ఎడ్లపందాలు కూడా భారీ నిర్వహిస్తారు. కనుమ తర్వాత మాడుగుల, చోడవరం, సబ్బవరం, పెందుర్తి, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చియ్యపేట తదితర మండలాల్లో నెలరోజుల పాటు తీర్థాలు (తిరునాళ్లు) మొదలవుతాయి. ఈ తిరునాళ్లతో పాటు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు కూడా ఏర్పాటు చేసి విజేతలకు నగదు బహుమతులిస్తారు. జిల్లాలోని దాదాపు 200 గ్రామాల్లో ఏటా ఇవి జరుగుతుంటాయి. ఎడ్ల పందాల్లో మైసూరు జాతి ఎడ్లనే ఎంపిక చేస్తారు. వీటి ఖరీదు రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంటాయి. ఎడ్ల పందాల ఎద్దులను వ్యవసాయ పనులకు ఉపయోగించరు. ఏడాది పొడవునా వీటికి ప్రత్యేక దాణా పెడతారు. అదే విధంగా గుర్రం పందాలు కూడా నిర్వహిస్తారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఈ గుర్రపు పందాలు ఎక్కువగా జరుగుతాయి. -
ఫ్లెడ్లైట్ల వెలుగులో కోడి పందాలు
ఆకస్మాత్తు దాడుల్లో పట్టుబడిన 17 మంది పందెగాళ్లు సమాచారమిస్తే జూదాలను అడ్డుకుంటామన్న పోలీసులు రాజానగరం : కోర్టులు ఆదేశించినా, పోలీసులు చర్యలు చేపట్టినా సంక్రాంతి ప్రత్యేక సంబరం కోడి పందేలు నిరాటంకంగా సాగుతున్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రాజానగరం మండలం, దివా¯ŒSచెరువు శివారు శ్రీరామపురంలో కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు ఆకస్మికదాడులు చేశారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్, ఏజీఎస్ పార్టీలు స్థానిక పోలీసులతో కలిసి శనివారం అర్థరాత్రి నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పి.నారాయణరావు ఆదివారం ఇక్కడ విలేకరులకు వివరించారు. 17 మంది అరెస్టు.. కోర్టు తీర్పును అతిక్రమిస్తూ, జీవహింసను ప్రేరేపించేలా శ్రీరామపురంలోని సంగిశెట్టి బుజ్జికి చెందిన తోటలో కోడి పందేలు ఆడుతున్న 17 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి ఏడు కోడిపుంజులు, 22 కోడి కత్తులు, 14 సెల్ఫోన్లు, రూ. 84,150 లు నగదు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనపర్చుకున్నామన్నారు. దొరికిన ఏడు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టిఉన్నాయన్నారు. అరెస్టయిన కొత్తపల్లి సుజనారావు, పామర్తి రాంబాబు, అంకం వీరబాబు, రాగల ప్రసాద్, రౌతుల వెంకటేష్, ఒగ్గేస లోవరాజు, ఉర్రింకల కృష్ణ, కస్తూరి మణికంఠ, అడపా ప్రకాష్, సంగుల సత్తిబాబు, మారిశెట్టి వెంకటేశ్వర్రావు, వల్లూరి పోతురాజు, ఎం. లోవరాజు, సంగిశెట్టి బుజ్జి, సీహెచ్. శ్రీనివాస్, అసర నానిరత్నం, నల్లమోలు దుర్గారావు శ్రీరామపురం, దివా¯ŒSచెరువు, పిండింగొయ్యిలకు చెందిన వారన్నారు. ఏపీజీ యాక్ట్ సెక్ష¯ŒS11, ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూయాల్టీ యాక్ట్ 1960 ప్రకారం అరెస్టు చేసిన వీరిని కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. వీరిపై హిస్టరీ షీట్ ఓపె¯ŒS చేస్తామన్నారు. కాగా వీరి పందాల వల్ల గాయాలై రక్తం కారుతున్న కోళ్లకు పశువైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తామన్నారు. సమాచారమిస్తే గోప్యంగా ఉంచుతాం సంక్రాంతి సంబరాలలో కోడి పందాలను నిర్మూలించడంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నారాయణరావు విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్తో కోడి పందాలు ఆడుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వీటితోపాటు పేకాట, గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేయవచ్చన్నారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ ఫో¯ŒS నంబరు 9440796502, స్పెషల్ బ్రాంచ్ ఫో¯ŒS నంబర్లు 0883–2427166, 0883–2427155లకు తెలియజేయవచ్చన్నారు. -
కోడిపందేలు... గుండెపోటుతో వ్యక్తి మృతి
భయంతో గుండెపోటుకు గురై వ్యక్తి మృతి గోవిందరావుపేట(వరంగల్): కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడిచేయగా పారిపోయే క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం రాంనగర్ శివారులోని మామిడితోటలో కొంతమంది ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం కోడిపందాలు వేస్తున్నారు. గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన కొమ్మరాజు రాంబాబు (45) అక్కడకు చూసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులకు ఈ విషయమై సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకోగానే జనం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారి వెంట పడ్డారు. ఒకవైపు వెళ్లిన రాంబాబు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి కదలకుండా ఉండిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఎస్సై యాసిన్ స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు రాంబాబును చెట్టుపై నుంచి కిందికి దింపి గోవిందరావుపేటలోని ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.