ముద్దబంతులు, రంగవల్లులు, నేతి అరిశలు, గారెలు, బూరెల వంటి పిండి వంటల ఘుమఘుమలు, హరిదాసుల మేలుకొలుపులు, పశువుల మువ్వల పట్టెడల ధ్వనులు, గుంపులు గుంపులుగా జరుపుకునే కోడిపందాలు, ఆకాశంలో చుక్కలతో పోటీపడే రంగు రంగుల గాలి పటాలు మనకు కనువిందు చేస్తున్నాయంటే అది కచ్చితంగా సంక్రాంతి నెలే అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి.పెద్ద పండగ అని పిలిచే ఈ పండగ హడావుడి డిసెంబర్ 17 నుంచి జనవరి 16 వరకు ఉంటుంది. అసలు సంక్రాంతి పండగ అంటేనే ప్రకృతి పండగ. ప్రకృతితో మనిషి సహజీవనం చేస్తున్నాడని స్పష్టమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది.
ముచ్చట గొలిపే గొబ్బిళ్లు
సంక్రాంతి నెల పట్టగానే ఇంటిముందు వేసిన ముగ్గులో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్ని పెట్టి వాటికి పసుపు కుంకుమతో అలంకారం చేస్తారు. ఆ గొబ్బెమ్మ మధ్యలో ముళ్లగోరింట, గుమ్మడి, ముద్దబంతి పూలను ఉంచుతారు. ఇంటిముందు తెల్లవారు జామున పెట్టిన ఈ గొబ్బెమ్మల్ని అసుర సంధ్య వేళ తీసి పిడకలాగా చేస్తారు. నెలరోజుల పాటు పెట్టిన ఈ గొబ్బెమ్మల పిడకలను భోగిపండగ రోజు పొయ్యి కింద పెట్టి ఆ మంటతో పాయసం చేస్తారు.
తీర్చిదిద్దే ముత్యాల ముగ్గులు
మామూలు రోజుల్లో ఇంటి ముందు ముగ్గు ఎన్ని గంటలకు వేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే పండగ నెలలో మాత్రం మా ఇంటి ముందే ముందు ముగ్గు ఉండాలని మహిళలు పోటీ పడి మరీ వేస్తారు. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఆ ముగ్గులకు అందమైన రంగులు అద్దడం ముచ్చట గొలుపుతుంది. సంక్రాంతి సందర్భంగా రథం ముగ్గులు, చుక్కల ముగ్గులు వేస్తారు. శ్రీమద్రారమణ గోవిందో హరి అంటూ ఈ నెలలో మాత్రమే మన ఇంటిముందుకు వస్తారు హరిదాసులు. మెడలో పూలమాల, పట్టుపంచె, తలపైన పూల సజ్జ, చేతిలో చిడతలతో శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ, ఇల్లిల్లూ తిరుగుతూ సందడి చేస్తారు హరిదాసులు. సంక్రాంతినెల మొత్తం హరిదాసులకు బియ్యం పోసి, పండగరోజు మాత్రం ప్రత్యేకంగా పిండివంటలు, ధాన్యాలు ఇస్తారు.
గంగిరెద్దుల విన్యాసాలు
అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టమని అంటుంటే, గంగిరెద్దులు చేసే విన్యాసాలు చూడాలంటే సంక్రాంతి నెలలోనే సాధ్యం. పెద్ద మూపురం ఉన్న ఎద్దుల కాళ్ళకి గజ్జెలు కట్టి, కొమ్ములకు పూలను చుట్టి, వీపుపైన అద్దాలతో కుట్టిన రంగురంగుల వస్త్రంతో ముస్తాబు చేసి ఊర్లోకి తీసుకు వస్తారు గంగిరెద్దుల వాళ్లు. అవి ఊళ్లోకి అడుగు పెట్టగానే అందరికీ దండాలు పెట్టి రకరకాల విన్యాసాలు చేస్తాయి. వీటిని చూసి ఆనందించిన వారు కానుకలు కురిపిస్తారు.
భోగ భాగ్యాలనిచ్చే భోగిమంటలు... భోగిపండ్లు
మూడు రోజుల ముఖ్య పండగలో మొదటి రోజు భోగి. ఇంట్లో ఉన్న పాత, పనికిరాని వస్తువుల్ని తీసుకు వచ్చి వాకిలి ముందు మంటల్లో వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. ఈ మంటలతో శీతాకాలం చలి బారి నుంచి తప్పించుకోవడంతో పాటు ఇంట్లోని చెత్తాచెదారం కూడా వదిలిపోతుంది. భోగి రోజు సాయంత్రం చిన్నారులకు రేగుపండ్లతో భోగిపండ్లను పోస్తారు. చిన్నారులకు ఏదైనా బాలారిష్టాలు ఉంటే తొలగి పోవాలని ఆశీర్వదిస్తూ, పెద్దలు భోగిపండ్లు పోస్తారు.
మహా పర్వదినం మకర సంక్రాంతి
సూర్యుడు మకర రాశిలోకి తన దిశ మార్చుకునే రోజును మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకు ప్రయాణిస్తాడు. ఈ రోజునే పెద్దల పండగ చేస్తారు. చనిపోయిన పెద్దలకు బట్టలు పెట్టి తమ గౌరవ మర్యాదలు చాటుకుంటారు.
పతంగుల సంబరాలు
పశువుల పండగ రోజునే చిన్నా పెద్దా అందరూ కలిసి ఉత్సాహంగా గాలి పటాలు ఎగరేస్తారు. అందమైన, విభిన్నమైన గాలిపటాలను ఎగరేసి సంబరాలు చేసుకుంటారు. గాలిపటాన్ని ఎగురవేసే దారాన్ని మనం ఎలా పట్టుకుని సమతులనం చేస్తామో, అదేవిధంగా జీవితాన్ని కూడా సమతూకంలో చూడాలని దీని అంతరార్థం.
ఎనుములకు సింగారం...
చేలల్లో ఉన్న కొత్త పంటను ఈరోజే ఇళ్లకు తీసుకు వస్తారు. పశువులకు పూజ చేసి, బండ్లను సింగారించి రైతులు భార్యా పిల్లలతో కలిసి పొలాలకు వెళ్లి ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకు వస్తారు.
కనుమ రోజునే కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. మరికొన్ని చోట్ల ఎద్దుల పందాలు నిర్వహిస్తారు. మాంసాహారులు ఈ వేళ తప్పనిసరిగా మాంసాన్ని స్వీకరిస్తే, శాకాహారులు మినుములతో తయారు చేసిన గారెలు తినడం వాడుకలో ఉన్న సంప్రదాయం.
– డి.వి.ఆర్.
మూడు రోజుల మహాపర్వం
Published Sun, Jan 13 2019 1:15 AM | Last Updated on Sun, Jan 13 2019 1:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment