హేమంత రుతువులో వచ్చే మకర సంక్రాంతి తెలుగువాళ్ల పెద్ద పండుగ. ముఖ్యంగా ఇది కృషీవలుౖరైన రైతుల పండుగ. పంటలు చేతికంది, ధాన్యరాశులు ముంగిళ్లలో పోగుపడే వేళ జరుపుకొనే అచ్చమైన అన్నదాతల పండుగ. అలాగని ఇది తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగను వీలైనంత సంబరంగా జరుపుకొంటారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీనులు మొదలుకొని ఆధునికుల వరకు ఎందరో కవులు తమ కావ్యాల్లో సంక్రాంతి హేలను, హేమంత రుతులీలను అత్యంత హృద్యంగా వర్ణించారు.
వర్షరుతువు ప్రారంభంలో వేసిన పంటలు చేతికందే నాటికి హేమంత ప్రభావం తారస్థాయికి చేరుకుంటుంది. పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. చలి వణికిస్తుంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా వీధుల్లో మంచు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం.
‘అహములు సన్నములయ్యెను/ దహనము హితమయ్యె దీర్ఘదశలయ్యె నిశల్;/ బహు శీతోపేతంబై/ యుహుహూ మని వడకె లోకముర్వీనాథా!’ అని పోతనామాత్యుడు తన భాగవత కావ్యంలో హేమంత శీతలతను కళ్లకు కట్టాడు. అలాగని, అంతటితోనే ఆగలేదు. ‘పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా/ బరువు లెట్టి యినుడు పశ్చిమాద్రి/ మరుగు జొచ్చెగాక మసలిన చలిచేత/ జిక్కె జిక్కెననగ జిక్కకున్నె?’ అంటూ, చలి తాకిడి నుంచి తప్పించుకోవడానికే సూర్యుడు ఉరుకులు పరుగులు పెట్టి పడమటి కొండల్లో దాక్కున్నాడని తీర్మానించాడు. హేమంతపు చలిధాటి సూర్యుడినే భయపెట్టిందంటే, ఇక మానవమాత్రుల సంగతి చెప్పేదేముంటుంది? ఇలాంటి హేమంత శీతవేళ వచ్చే పండుగ మకర సంక్రాంతి. చలి తీవ్రతను తట్టుకోవడానికి జనాలు చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు వీధివీధినా ఊరుమ్మడి చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీ.
పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి వేళ ధాన్యరాశులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఒకవైపు గడగడ వణికించే చలి ఉన్నా, స్థూలంగా ప్రకృతి ఆహ్లాదభరితంగా ఉంటుంది. సంక్రాంతి శోభను ఎందరో ఆధునిక కవులు సైతం అత్యద్భుతంగా వర్ణించారు. ‘కళ్యాణకంఠి ఈ కన్నెసంక్రాంతి/ భోగాలబాల ఈ భోగి సంక్రాంతి/ వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ రాయప్రోలువారు సంక్రాంతి రాకడపై హర్షాతిరేకాలు ప్రకటించారు. సంక్రాంతికి కొత్త అల్లుళ్లను ఆహ్వానించడం, బంధుమిత్రులతో విందుభోజనాలు ఆరగించడం ఆనవాయితీ. ‘జిడ్డుదేఱిన వెన్నెలగడ్డ పెరుగు/ గరగిరకజాటు ముంగారు చెఱకురసము/ సంతరించితి విందుభోజనము సేయ/ రండురండని పిలిచె సంక్రమణ లక్ష్మి’ అని చవులూరించేలా వర్ణించారు ‘తెనుగు లెంక’ తుమ్మలవారు. సాహితీ ఉపాధ్యాయుడే కాక, స్వయంగా కృషీవలుడైన ఆయన సంక్రాంతిపై విరివిగా పద్యాలను అల్లారు.
ఆధునికుల్లో జంటకవులైన పింగళి–కాటూరి ‘దినకరుడు శాంతుడై తోచె దినములింత/ కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చె/... మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి/ సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె’ అంటూ ‘తొలకరి’ కావ్యంలో పుష్య సౌభాగ్యాన్ని వర్ణించారు. వీరు ఇదే కావ్యంలో సంక్రాంతి వేడుకలను వర్ణిస్తూ, ‘రండు మాయింటి కీరు పేరంటమునకు/ బొమ్మలెత్తును మా పిల్లయమ్మలార’ అంటూ సంక్రాంతి బొమ్మల కొలువుల వేడుకను ప్రస్తావించారు. దసరాకే కాదు, కొన్నిప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టడమూ ఆనవాయితీ. సంక్రాంతి బొమ్మల కొలువుల్లో ప్రధాన దైవం సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అని పిలుచుకుంటారు. కాలపురుషుడే సంక్రాంతి పురుషుడిగా మకర సంక్రాంతినాడు భూమిపైకి దిగివచ్చి, భూలోక వాసులను పరిపాలిస్తాడని ఒక నమ్మకం.
సంక్రాంతి రైతుల పండుగే కాదు, ముదితల పండుగ, ముగ్గుల పండుగ కూడా! ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వీధుల్లో ప్రతి ముంగిటా ముగ్గులు కళకళలాడుతూ కనిపిస్తాయి. ముగ్గులు ప్రాచీన కళారూపాలు. కామశాస్త్రం ప్రస్తావించిన అరవైనాలుగు కళల జాబితాలో ముగ్గులు వేయడం కూడా ఒక కళ. తెలుగు కవిత్వంలో ముగ్గుల ప్రస్తావన నన్నయ నాటి నుంచే ఉంది. పాండవులు వారణావతంలోని లక్క ఇంటికి వెళుతున్నప్పుడు వారణావత పుర ప్రజలు వారికి భారీగా స్వాగతం పలికారట. స్వాగత మర్యాదల్లో భాగంగా ఇంటింటా ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దారట. ఆ ఘట్టంలోనే నన్నయ ‘అంగుళల నొప్పె కర్పూర రంగవల్లులు..’ అంటూ ముచ్చటైన పద్యం రాశాడు. ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడూ ముగ్గు ముచ్చట్లు చెప్పాడు.
సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు, పేకాటల సందళ్లు ఒకవైపు కోలాహలంగా కొన సాగుతుంటే, మరోవైపు కవి సమ్మేళనాల వంటి సాహితీ కార్యక్రమాలు కూడా సందడిగా జరుగుతుంటాయి. సంక్రాంతి కర్షకుల పండుగే కాదు, కవుల పండుగ కూడా! సంక్రాంతి నాటికి ధాన్యరాశులే కాదు, కవనరాశులు కూడా తెలుగునేల మీద భారీగానే పోగుపడతాయి. వాటి వాసిని నిర్ణయించాల్సింది మాత్రం ప్రజలే!
Comments
Please login to add a commentAdd a comment