సంప్రదాయాలను చెడగొట్టేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. చైనా మాంజాలూ అనవసర పోటీలతో గాలిపటాలకు అడ్డంకులేర్పరుస్తుంటారు. నిజానికి గాలిపటం ఎగుర వేయడం చలికాలంలో మంచి వ్యాయామం. సంక్రాంతి వేళ ఖాళీ పొలాల్లో పతంగాలు ఎగురేస్తే వినోదమూ ప్లస్ డి విటమిన్. గాలిపటం చుట్టూ ఎన్నో జీవనసత్యాలు. అది ఆకాశాన్ని అందుకోమని అంటుంది. కాని సూత్రం సరిగా లేకపోయినా దారం చేజారినా తనలాగే జీవితమూ గిరికీలు కొడుతుందని హెచ్చరిస్తుంది. దేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగే సమయం ఇది. పిల్లలకు గాలిపటాలు చాలా ఇష్టం. సంక్రాంతి గాలిపటం ఒక పసిడి జ్ఞాపకం.
ఇప్పుడు ప్లాస్టిక్ షీట్‌తో గాలిపటాలు తయారు చేస్తున్నారుగాని ఒకప్పుడు గాలిపటం అంటే రంగు కాగితమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయ రంగు.... డార్క్ కలర్ కాగితాలతో తయారయ్యి, తోకలు తగిలించుకుని దుకాణాల్లో అమ్మకానికి పెట్టి ఉంటే వాటి అందమే వేరు. పిల్లలకు తమ ఇష్టానికి తగిన రంగు గాలిపటం దొరికేది. ‘నీది ఎరుపు... నాది పచ్చ’ అని తగాదాలు లేకుండా గుర్తుగా ఇళ్లల్లో దాచుకునేవారు. మైదానంలో, మిద్దెక్కి ఎగరేసేవారు. గాలిపటం సం΄ాదించడానికి అమ్మ, నాన్నల దగ్గర మారాము చేసేవారు. గాలిపటం, పతంగి, కైట్... పేరు ఏదైనా ఎగిరే కాగితం పిట్ట అది.
బాల్య కుతూహలం
గాలిపటం ఒక బాల్య కుతూహలం. తాను ఎగరలేక΄ోయినా తాను ఎగిరించగలడు అనే ఇగో సంతృప్తికి సంకేతం. పక్షిలా ఎగరలేని మనిషి పక్షితో సమాంతరంగా ఆకాశంలో గాలిపటం ఎగురవేసి అబ్బురపడ్డాడు. అలా ఎగరడానికి అవసరమైన సూత్రాన్ని కనుగొన్నాడు. కాలాన్ని కూడా గమనించాడు.
మితిమీరిన ఎండల కాలం, వానల కాలం గాలిపటం ఎగురవేయడానికి అనువైనది కాదు. ఒకప్పుడు దీపావళి ముగిశాక... అప్పటి నుంచి మొదలయ్యి ఫిబ్రవరి వరకు గాలిపటాలు ఎగుర వేసేవారు. ఇప్పుడు మెల్లగా అది సంక్రాంతి సీజన్‌గా మారింది. దానికి కారణం పొలాలు కోత పూర్తయ్యి ఖాళీగా ఉంటాయి. పల్లెల్లో జనం విశ్రాంతిలో ఉంటారు. సీజన్ అనుకూలంగా ఉంటుంది.
సంక్రాంతితో ఎండ మొదలవుతూ ఉష్ణం ఒంటికి తగులుతూ ఉంటుంది. అందుకని ఇది గాలిపటాల సీజన్‌గా మారింది. ఒక్క తెలుగు ప్రాంతంలోనే కాదు... తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో కూడా సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేస్తారు. హైదరాబాద్‌లో ఈ క్రీడ విఖ్యాతం. గుజరాత్‌లో ‘ఉత్తరాయణ్’ పేరుతో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.
ప్రతాప చిహ్నం
ఆధిక్య ప్రదర్శన చేయడం కూడా మనిషికి ఇష్టం. గాలిపటాలు ఎగురవేసి ఏది ఎక్కువ ఎత్తుకు ఎగరితే ఆ ఎగరేసిన మనిషికి ఆ కాసేపు ఆధిక్యం వస్తుంది. ‘కోయడం’ కూడా ఈ ఆటలో ఒక ఆధిక్యప్రదర్శనే. ఎగురుతున్న గాలిపటాల మీదకు వెళ్లి తమ గాలిపటంతో (దారంతో/మాంజాతో) కోసి దానిని నేలకూల్చడం గొప్ప. రాను రాను ఇలా కోతకు గురికాని దారం కోసం అంటే ప్రత్యర్థులు దాడి చేసినా తెగని దారం కోసం రకరకాల ప్రయోగాలు, పదార్థాలు కలిపిన దారం తయారు చేసి నేడు పక్షులకు, మనుషులకు ప్రమాదకరంగా మారి గాలిపటాల ఆటకే చేటుకాలాన్ని తెచ్చారు కొందరు. ఈ ఆధిక్య ప్రదర్శను పక్కన పెడితే గాలిపటం ఎగురవేయడం ఎంతో ఆహ్లాదం కలిగించే ఆట.
గాలిపటం పాటలు
గాలిపటం పాటలు సినిమాల్లో చాలా ఉన్నాయి. ‘తోడికోడళ్లు’లో ‘గాలిపటం గాలిపటం రయ్యిన ఎగిరే గాలిపటం’ అని అక్కినేని పాడతాడు. ‘కులదైవం’ సినిమాలో హీరో చలం ‘పద పదవే ఒయ్యారి గాలి పటమా’ పాడితే నేటికీ అది హిట్ పాటగా ఉంది. ‘చంద్రముఖి’లో ‘చిలుకా పద పద మైనా పద పద’ అని రజనీకాంత్ కూడా గాలిపటాలు ఎగురవేస్తాడు. గాలిపటంలో తత్త్వం కూడా మనిషి వెతికాడు. అదను మరిస్తే జీవితం తెగిన గాలిపటం అవుతుందని గ్రహించాడు. ఎంత ఎత్తుకు ఎగిరినా దారం లాంటి ఆధారం తప్పక ఉండాలని గ్రహించాడు. గాలిపటంలా మిడిసి పడకూడదని, చివరకు దానిలాగే నేలకు దిగాల్సి వస్తుందని బుద్ధి చెప్పుకున్నాడు.
అపశ్రుతులు లేకుండా
గాలిపటం మన దృష్టిని పైన ఉంచుతుంది. ముందు వెనుకా చూడ వీలు కల్పించదు. అందుకే పిల్లల చేత మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయించాలి. లేదా రెయిలింగ్ ఉన్న మిద్దెల మీదే ఎగుర వేయించాలి. గోడలు ఎక్కనివ్వరాదు. తెగిన గాలిపటాల కోసం కరెంటు స్తంభాల దగ్గరకు వెళ్లనివ్వరాదు. దారం వదిలేప్పుడు వేలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment