మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైనది ‘సంక్రాంతి.‘ మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్ – అంటే పోషించటం, పుష్టిని కలిగించటం. సర్వ్రపాణికోటికీ పుష్టిని కలిగించే పంటలు ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాక ఒకప్పుడు మన భారతదేశంలోని భాగాలే అయిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు.
‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి.
ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని‘మకర సంక్రాంతి పండుగ‘ గా జరుపుకుంటున్నాం.
సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం అంటే, వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్యకాలం ్రపారంభమవుతుంది కనుక. ప్రకృతి లో ఇది గొప్ప మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం.
ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభకార్యాలను జరిపిస్తాం. కనుకే ఉత్తరాయణం ్రపారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాం. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి.
తెలుగువారి ముఖ్య పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ.
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఏడాది పాటు కష్టపడి పని చేసిన ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొత్తధాన్యంతో పులగం, ΄÷ంగలి, పాయసం చేసి, శ్రీ సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవానికి, కులదైవానికి నివేదన చేస్తారు.
ప్రతి సంక్రమణంలోనూ పితృతర్పణాలివ్వాలి, శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమివ్వాలి. అయితే అప్పుడు ఇవ్వలేకపోయినా, కనీసం ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున అయినా సూర్యుని తప్పక ధ్యానించాలి, పూజించాలి, అర్ఘ్యమివ్వాలి. పితృతర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. వీలున్నవారు గోదానం చెయ్యటం శ్రేష్ఠం.
మనం మనకు తొలి పండుగ అయిన ఉగాదినాడు ఎలా పంచాంగ శ్రవణం చేస్తామో, అలాగే సంక్రాంతి పండుగనాడు దైవజ్ఞుల ద్వారా సంక్రాంతి పురుషుని గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎటువంటి ఆకార విశేషాలను కలిగి, ఏ రంగు దుస్తులు ధరించి, ఏ వాహనం మీద ఎక్కి వస్తాడో, దానినిబట్టి దేశ భవిష్యత్తు తెలుస్తుంది, దానివల్ల రాబోయే ఫలితాలను గుర్తించి తగిన విధంగా మెలగటానికి ప్రయత్నం చెయ్యాలి.
సంక్రాంతి రోజే జప తప దానాదుల నాచరించాలి. పండితులకు ధాన్యం, గోధుమలు, తిలలు, వస్త్రాలు, బంగార ం, ధనం, కూరలు, పళ్ళు, ఉదకుంభం వంటి వాటిని దానమివ్వాలి. దానివలన ఆరోగ్యం, వర్చస్సు, ఆత్మ సంస్కారం, గ్రహదోష నివారణ జరుగుతాయి. పితృతర్పణాల వలన వంశాభివృద్ధి జరుగుతుంది.
సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. అందరూ గంగిరెద్దుకు నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు ధన, ధాన్య, వస్త్రాదులనిస్తారు.
సంక్రాంతి రోజున ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు వాయిస్తూ, ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ వస్తాడు. హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సాక్షాత్తు శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. డబ్బులిచ్చి సత్కరిస్తారు.
‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి బుడబుక్కలవాడు వస్తాడు.
ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమదేవర వస్తాడు.
వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ.
వీరందరూ మనందరినీ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ్రపార్థిస్తారు.బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వుండలు పంచిపెడతారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను, అల్లుళ్ళను ఇంటికి పిలుస్తారు, విందుభోజనాలు, చీరసారె, అల్లుళ్లకు కానుకలూ ఇచ్చి ఆనందిస్తారు. తెలంగాణ ్రపాంతంలో సంక్రాంతి రోజున నోము పడతారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి సంక్రాంతి నోము పేరంటం చేస్తారు.
కనుమనాడు మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను, పుడమి తల్లినీ పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది‘ అంటారు కనుక కనుమనాడు గారెలు, ఆవడలు చేసి దైవానికి నివేదించి భుజిస్తాం. పంటలు, సమృద్ధికి దోహదపడే, వ్యవసాయానికి సహకరించే ఎద్దులను గౌరవించే శుభ దినం కనుమ పండుగ.
ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ ‘మన సంక్రాంతి
పండుగ’.
సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పగలే అందమైన కదిలే చుక్కలతో ప్రకాశిస్తున్న భ్రాంతిని కలుగజేస్తుంది. గాలిపటం మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని స్తుంది. దారం మన చేతిలో సవ్యంగా ఉన్నంతసేపే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. అదుపు తప్పిందా, ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు అనే పట్టులో మెలుగుతున్నంత కాలం సమాజాకాశంలో ఆనందంగా విహరించ గలుగుతాం. విలువలు తప్పితే పతనం తప్పదు, అన్న సత్యాన్ని బోధిస్తుంది.
– డా. తంగిరాల విశాలాక్షి,
– సోమంచి రాధాకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment