all over india
-
సంక్రాంతి: శుభాలకు వాకిలి
మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైనది ‘సంక్రాంతి.‘ మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్ – అంటే పోషించటం, పుష్టిని కలిగించటం. సర్వ్రపాణికోటికీ పుష్టిని కలిగించే పంటలు ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాక ఒకప్పుడు మన భారతదేశంలోని భాగాలే అయిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని‘మకర సంక్రాంతి పండుగ‘ గా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం అంటే, వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్యకాలం ్రపారంభమవుతుంది కనుక. ప్రకృతి లో ఇది గొప్ప మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభకార్యాలను జరిపిస్తాం. కనుకే ఉత్తరాయణం ్రపారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాం. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి. తెలుగువారి ముఖ్య పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఏడాది పాటు కష్టపడి పని చేసిన ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొత్తధాన్యంతో పులగం, ΄÷ంగలి, పాయసం చేసి, శ్రీ సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవానికి, కులదైవానికి నివేదన చేస్తారు. ప్రతి సంక్రమణంలోనూ పితృతర్పణాలివ్వాలి, శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమివ్వాలి. అయితే అప్పుడు ఇవ్వలేకపోయినా, కనీసం ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున అయినా సూర్యుని తప్పక ధ్యానించాలి, పూజించాలి, అర్ఘ్యమివ్వాలి. పితృతర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. వీలున్నవారు గోదానం చెయ్యటం శ్రేష్ఠం. మనం మనకు తొలి పండుగ అయిన ఉగాదినాడు ఎలా పంచాంగ శ్రవణం చేస్తామో, అలాగే సంక్రాంతి పండుగనాడు దైవజ్ఞుల ద్వారా సంక్రాంతి పురుషుని గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎటువంటి ఆకార విశేషాలను కలిగి, ఏ రంగు దుస్తులు ధరించి, ఏ వాహనం మీద ఎక్కి వస్తాడో, దానినిబట్టి దేశ భవిష్యత్తు తెలుస్తుంది, దానివల్ల రాబోయే ఫలితాలను గుర్తించి తగిన విధంగా మెలగటానికి ప్రయత్నం చెయ్యాలి. సంక్రాంతి రోజే జప తప దానాదుల నాచరించాలి. పండితులకు ధాన్యం, గోధుమలు, తిలలు, వస్త్రాలు, బంగార ం, ధనం, కూరలు, పళ్ళు, ఉదకుంభం వంటి వాటిని దానమివ్వాలి. దానివలన ఆరోగ్యం, వర్చస్సు, ఆత్మ సంస్కారం, గ్రహదోష నివారణ జరుగుతాయి. పితృతర్పణాల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. అందరూ గంగిరెద్దుకు నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు ధన, ధాన్య, వస్త్రాదులనిస్తారు. సంక్రాంతి రోజున ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు వాయిస్తూ, ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ వస్తాడు. హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సాక్షాత్తు శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. డబ్బులిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి బుడబుక్కలవాడు వస్తాడు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమదేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ. వీరందరూ మనందరినీ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ్రపార్థిస్తారు.బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వుండలు పంచిపెడతారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను, అల్లుళ్ళను ఇంటికి పిలుస్తారు, విందుభోజనాలు, చీరసారె, అల్లుళ్లకు కానుకలూ ఇచ్చి ఆనందిస్తారు. తెలంగాణ ్రపాంతంలో సంక్రాంతి రోజున నోము పడతారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి సంక్రాంతి నోము పేరంటం చేస్తారు. కనుమనాడు మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను, పుడమి తల్లినీ పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది‘ అంటారు కనుక కనుమనాడు గారెలు, ఆవడలు చేసి దైవానికి నివేదించి భుజిస్తాం. పంటలు, సమృద్ధికి దోహదపడే, వ్యవసాయానికి సహకరించే ఎద్దులను గౌరవించే శుభ దినం కనుమ పండుగ. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ ‘మన సంక్రాంతి పండుగ’. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పగలే అందమైన కదిలే చుక్కలతో ప్రకాశిస్తున్న భ్రాంతిని కలుగజేస్తుంది. గాలిపటం మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని స్తుంది. దారం మన చేతిలో సవ్యంగా ఉన్నంతసేపే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. అదుపు తప్పిందా, ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు అనే పట్టులో మెలుగుతున్నంత కాలం సమాజాకాశంలో ఆనందంగా విహరించ గలుగుతాం. విలువలు తప్పితే పతనం తప్పదు, అన్న సత్యాన్ని బోధిస్తుంది. – డా. తంగిరాల విశాలాక్షి, – సోమంచి రాధాకృష్ణ -
అమరవీరులకు కన్నీటి వీడ్కోలు
-
వింతలు చూడతరమా...
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, చరిత్ర చాలా భిన్నమైనవి. సాంస్కృతిక భిన్నత్వం, చారిత్రక ప్రదేశాలు, అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు మరెన్నో వింతలూ, విశేషాలూ భారతదేశం సొంతం. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఏదో ఓ పర్యాటక ప్రదేశం.. వింత దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. విదేశీ పర్యాటకులెవరైనా మన దేశానికి వస్తే తాజ్‌మహల్‌ను చూడాలనో.. గోవా బీచ్‌ను సందర్శించాలనో భావిస్తారు. వాటితోపాటు పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రదేశాలు, వింత ఆచారాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటివాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. మాస్ బర్డ్ సూసైడ్.. అసోంలోని బోరైల్ హిల్స్ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం జతింగ. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పక్షులు గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తుంటాయి. కానీ ప్రతి ఏటా వర్షాకాలంలో ముఖ్యంగా సెప్టెంబర్- అక్టోబర్ల మధ్య ఇక్కడ పరిశోధకులకు అంతుచిక్కని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో రాత్రిపూట వందలకొలది వలస పక్షులు వేగంగా ప్రయాణించి, అక్కడి చెట్లను, ఇళ్లను ఢీకొని మరణిస్తాయి. ఇలా ఎప్పుడూ ఒకేసారి పక్షులన్నీ కలిసి మరణించడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనిక గల కారణాలను వారు ఇంకా కనుగొనలేదు. పక్షులన్నీ ఆత్మహత్యకు పాల్పడతాయనే ఉద్దేశంతో ఈ ఘటనకు ‘మాస్ బర్డ్ సూసైడ్’ అనే పేరు పెట్టారు. తొలిసారిగా 1960లో ఈ.పీ. గీ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. ఆసియాలోనే శుభ్రమైన గ్రామం.. మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి సమీపాన గల మాలిన్నాంగ్ గ్రామానికి ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. మేఘాలయా రాష్ట్రం పర్యావరణ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందులో మాలిన్నాంగ్ కూడా పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. పూర్తిస్థాయిలో ఈ గ్రామం శుభ్రంగా ఉంటూ, పచ్చని చెట్లూ, జలపాతాలు, సరస్సులతో ఆకట్టుకుంటుంది. అనేక పర్యాటక వింతలు ఈ ప్రాంతం సొంతం. ఈ గ్రామం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి ప్రజలు వందశాతం అక్షరాస్యత సాధించారు. దాదాపు అందరూ ఇంగ్లీష్‌ను చాలా స్పష్టంగా మాట్లాడగలరు. ల్యాండ్ ఆఫ్ స్నేక్స్.. పాములంటే అందరికీ భయమే. కానీ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని షేత్పల్ గ్రామంలోని వారు మాత్రం పాముల్ని చూస్తే అస్సలు భయపడరు. పిల్లలకు కూడా అవంటే భయం లేదు. పైగాఅక్కడ ఎక్కువగా కనిపించే పాములేంటో తెలుసా.. అత్యంత విషం కలిగిన కోబ్రాలు. స్థానికుల ఇళ్లల్లో చాలాచోట్ల ఈ పాములు దర్శనమిస్తాయి. పైగా పాములను వారు దైవంతో సమానంగా కొలుస్తారు. మరో విశేషమేంటంటే అనేక పాములు ఊళ్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటివరకు ఒక్కరిని కూడా కాటేసిన ఉదంతాలు లేవు. టెంపుల్ ఆఫ్ ర్యాట్స్.. ఇంట్లో ఎలుకలు కనిపిస్తే వాటి అంతు చూసే వరకూ వదలం. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఎలుకల్ని దైవానికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. బికనీర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని డెష్నాక్ అనే చిన్న పట్టణంలో కర్ణిమాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఏకంగా 20,000 ఎలుకలు జీవిస్తున్నాయి. ఈ ఎలుకల్ని దేవుడి సంతానంగా భావించడం వల్ల స్థానికులు వాటిని పూజిస్తారు. వాటికి క్రమం తప్పకుండా ఆహారం పెట్టడంలాంటి సేవలు కూడా చేస్తారు. జ్వాలా మాత టెంపుల్.. హిమాచాల్ ప్రదేశ్ కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా మాత దేవాలయంలో ఏడాదంతా నిరంతరం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. భక్తులు కూడా నిత్యం జ్యోతిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ గుడి మధ్యలో ఉన్న ఓ రాయిలోనుంచి ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. వందల ఏళ్ల నుంచి ఇది వెలుగుతూనే ఉండడం గమనార్హం. పార్వతీదేవి ఇక్కడ జ్యోతి రూపంలో ఉన్నట్లుగా భక్తులు విశ్వసిస్తారు. లివింగ్ రూట్స్ బ్రిడ్జి.. ఇది కూడా మేఘాలయాలోని చిరపుంజిలో ఉంది. సాధారణంగా మానవులు బ్రిడ్జిలు నిర్మిస్తారు. కానీ ఈ బ్రిడ్జిని మాత్రం మానవులు పెంచారు. జలపాతాలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో పెరిగిన రబ్బరు మొక్క కాండం నుంచి పెరిగిన వేళ్లను స్థానికులు దాని పక్కనే ఉన్న నదికి బ్రిడ్జిగా మలిచారు. భూమిలోపలికి పెరగాల్సిన వేళ్లను స్థానికులు నదికి సమాంతరంగా మలిచారు. అవి క్రమంగా పెద్దవై, గట్టిపడి నదిమీద బ్రిడ్జిలా మారాయి. ఇక్కడ ఇలాంటి బ్రిడ్జిలు చాలానే కనిపిస్తాయి. లేక్ ఆఫ్ స్కెలిటన్స్.. దాదాపు 16,500 అడుగుల ఎత్తున హిమాలయాల్లోని జనావాసాలు లేని ప్రాంతంలో ఉన్న ఓ సరస్సు రూప్కండ్. ఇది ఎక్కువగా మంచుపలకలతో కప్పి ఉంటుంది. ఈ సరస్సును స్కెలిటన్ సరస్సు లేదా మిస్టరీ సరస్సు అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 600 వరకు మానవ అస్థిపంజరాలు లభించాయి. దీంతో ఈ సరస్సుకు స్కెలిటన్ సరస్సు అనే పేరు వచ్చింది. ఇక్కడి మంచు కరిగిపోయిన సమయంలో సరస్సు అడుగుభాగంలో ఈ అస్థిపంజరాలు దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రజలు అనేక సంఘటనల్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు కాబట్టి ఇక్కడ అస్థి పంజరాలు కనిపించడానికి కూడా స్థానిక దేవత కోపమే కారణమని పలువురు భావిస్తారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏవీ లభించలేవు. -
బ్లాక్ శాటర్డే
శనివారం.. ఒక్కరోజే వేర్వేరు సంఘటనలలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్ శాటర్ డే అంటూ దీనిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. తెల్లవారుజామునే తూర్పుగోదావరి జిల్లాలో వాహనం నదిలోపడి 22 మంది మరణించారు. అప్పటినుంచి వరుసపెట్టి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. గాలి, నీరు, నిప్పు.. ఇలా పంచభూతాల్లో చాలావరకు ప్రమాదకరంగానే పరిణమించాయి. దేశరాజధాని ఢిల్లీలో గాలి దుమారం సంభవించి పలువురు గాయాలపాలయ్యారు, వాహనాలు బోల్తా పడ్డాయి. గోదావరిలో వాహనం పడి 22 మంది మరణించారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ ప్రాంతంలో బీడీఎల్ రక్షణ సంస్థలో వ్యర్థాలను తగులబెడుతుండగా మంటలు చెలరేగి ఐదుగురు గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ధవళేశ్వరం ప్రమాదం తూర్పు గోదావరి జిల్లాలో వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రల్లో భాగంగా తిరుపతి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లూథియానాలో అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతి లూథియానా: లూథియానా జిల్లాలో దోర్హా బైపాస్ రహదారి వద్ద ఫ్లైఓవర్ కింద అమ్మోనియం ట్యాంకర్ ఇరుక్కుపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి అమ్మోనియం గ్యాస్ లీకైంది. గ్యాస్ పీల్చిన స్థానికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 100 మంది తీవ్రంగా ఆస్వస్థతకు గురయ్యారు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 19 మంది మృతి లక్నో: ఉత్తరప్రదేశ్ ఈటా సమీపంలో లారీ - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ సముద్రం విద్యార్థి మృతి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద శనివారం సముద్రంలో మునిగి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడలోని ఆదిత్య, కైట్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 29 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు సుధీర్(20) ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. జీపు బోల్తా..ఇద్దరు మృతి విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలం కుడియా గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం ఓ జీపు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. సుమారు 10 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. శివర్ల నుంచి దేవరాపల్లి వైపు జీపు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడినట్టు సమాచారం. బీడీఎల్‌లో అగ్నిప్రమాదం హైదరాబాద్ కంచన్‌బాగ్ ప్రాంతంలో గల బీడీఎల్ సంస్థలో వ్యర్థాలను తగలబెడుతుండగా ప్రమాదం సంభవించింది. అవి పేలడంతో అక్కడే ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నీళ్లలో పడి ముగ్గురి గల్లంతు విశాఖజిల్లా హుకుంపేట మండలం చీడిపుట్ట వంతెన సమీపంలోని వాగులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ముగ్గురి వయసూ పదేళ్లలోపే. గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది.