వింతలు చూడతరమా... | wonders in india | Sakshi
Sakshi News home page

వింతలు చూడతరమా...

Published Wed, Sep 9 2015 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

wonders in india

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, చరిత్ర చాలా భిన్నమైనవి. సాంస్కృతిక భిన్నత్వం, చారిత్రక ప్రదేశాలు, అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు మరెన్నో వింతలూ, విశేషాలూ భారతదేశం సొంతం. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఏదో ఓ పర్యాటక ప్రదేశం.. వింత దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. విదేశీ పర్యాటకులెవరైనా మన దేశానికి వస్తే తాజ్‌మహల్‌ను చూడాలనో.. గోవా బీచ్‌ను సందర్శించాలనో భావిస్తారు. వాటితోపాటు పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రదేశాలు, వింత ఆచారాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటివాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
 

మాస్ బర్డ్ సూసైడ్..
అసోంలోని బోరైల్ హిల్స్ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం జతింగ. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పక్షులు గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తుంటాయి. కానీ ప్రతి ఏటా వర్షాకాలంలో ముఖ్యంగా సెప్టెంబర్- అక్టోబర్‌ల మధ్య ఇక్కడ పరిశోధకులకు అంతుచిక్కని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో రాత్రిపూట వందలకొలది వలస పక్షులు వేగంగా ప్రయాణించి, అక్కడి చెట్లను, ఇళ్లను ఢీకొని మరణిస్తాయి. ఇలా ఎప్పుడూ ఒకేసారి పక్షులన్నీ కలిసి మరణించడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనిక గల కారణాలను వారు ఇంకా కనుగొనలేదు. పక్షులన్నీ ఆత్మహత్యకు పాల్పడతాయనే ఉద్దేశంతో ఈ ఘటనకు ‘మాస్ బర్డ్ సూసైడ్’ అనే పేరు పెట్టారు. తొలిసారిగా 1960లో ఈ.పీ. గీ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు.


ఆసియాలోనే శుభ్రమైన గ్రామం..
మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి సమీపాన గల మాలిన్నాంగ్ గ్రామానికి ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. మేఘాలయా రాష్ట్రం పర్యావరణ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందులో మాలిన్నాంగ్ కూడా పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. పూర్తిస్థాయిలో ఈ గ్రామం శుభ్రంగా ఉంటూ, పచ్చని చెట్లూ, జలపాతాలు, సరస్సులతో ఆకట్టుకుంటుంది. అనేక పర్యాటక వింతలు ఈ ప్రాంతం సొంతం. ఈ గ్రామం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి ప్రజలు వందశాతం అక్షరాస్యత సాధించారు. దాదాపు అందరూ ఇంగ్లీష్‌ను చాలా స్పష్టంగా మాట్లాడగలరు.


ల్యాండ్ ఆఫ్ స్నేక్స్..
పాములంటే అందరికీ భయమే. కానీ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని షేత్పల్ గ్రామంలోని వారు మాత్రం పాముల్ని చూస్తే అస్సలు భయపడరు. పిల్లలకు కూడా అవంటే భయం లేదు. పైగాఅక్కడ ఎక్కువగా కనిపించే పాములేంటో తెలుసా.. అత్యంత విషం కలిగిన కోబ్రాలు. స్థానికుల ఇళ్లల్లో చాలాచోట్ల ఈ పాములు దర్శనమిస్తాయి. పైగా పాములను వారు దైవంతో సమానంగా కొలుస్తారు. మరో విశేషమేంటంటే అనేక పాములు ఊళ్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటివరకు ఒక్కరిని కూడా కాటేసిన ఉదంతాలు లేవు.

 

టెంపుల్ ఆఫ్ ర్యాట్స్..
ఇంట్లో ఎలుకలు కనిపిస్తే వాటి అంతు చూసే వరకూ వదలం. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఎలుకల్ని దైవానికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. బికనీర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని డెష్నాక్ అనే చిన్న పట్టణంలో కర్ణిమాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఏకంగా 20,000 ఎలుకలు జీవిస్తున్నాయి. ఈ ఎలుకల్ని దేవుడి సంతానంగా భావించడం వల్ల స్థానికులు వాటిని పూజిస్తారు. వాటికి క్రమం తప్పకుండా ఆహారం పెట్టడంలాంటి సేవలు కూడా చేస్తారు.

 

జ్వాలా మాత టెంపుల్..
హిమాచాల్ ప్రదేశ్ కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా మాత దేవాలయంలో ఏడాదంతా నిరంతరం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. భక్తులు కూడా నిత్యం జ్యోతిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ గుడి మధ్యలో ఉన్న ఓ రాయిలోనుంచి ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. వందల ఏళ్ల నుంచి ఇది వెలుగుతూనే ఉండడం గమనార్హం. పార్వతీదేవి ఇక్కడ జ్యోతి రూపంలో ఉన్నట్లుగా భక్తులు విశ్వసిస్తారు.

 

 

లివింగ్ రూట్స్ బ్రిడ్జి..
ఇది కూడా మేఘాలయాలోని చిరపుంజిలో ఉంది. సాధారణంగా మానవులు బ్రిడ్జిలు నిర్మిస్తారు. కానీ ఈ బ్రిడ్జిని మాత్రం మానవులు పెంచారు. జలపాతాలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో పెరిగిన రబ్బరు మొక్క కాండం నుంచి పెరిగిన వేళ్లను స్థానికులు దాని పక్కనే ఉన్న నదికి బ్రిడ్జిగా మలిచారు. భూమిలోపలికి పెరగాల్సిన వేళ్లను స్థానికులు నదికి సమాంతరంగా మలిచారు. అవి క్రమంగా పెద్దవై, గట్టిపడి నదిమీద బ్రిడ్జిలా మారాయి. ఇక్కడ ఇలాంటి బ్రిడ్జిలు చాలానే కనిపిస్తాయి.

 

 

లేక్ ఆఫ్ స్కెలిటన్స్..
దాదాపు 16,500 అడుగుల ఎత్తున హిమాలయాల్లోని జనావాసాలు లేని ప్రాంతంలో ఉన్న ఓ సరస్సు రూప్‌కండ్. ఇది ఎక్కువగా మంచుపలకలతో కప్పి ఉంటుంది. ఈ సరస్సును స్కెలిటన్ సరస్సు లేదా మిస్టరీ సరస్సు అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 600 వరకు మానవ అస్థిపంజరాలు లభించాయి. దీంతో ఈ సరస్సుకు స్కెలిటన్ సరస్సు అనే పేరు వచ్చింది. ఇక్కడి మంచు కరిగిపోయిన సమయంలో సరస్సు అడుగుభాగంలో ఈ అస్థిపంజరాలు దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రజలు అనేక సంఘటనల్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు కాబట్టి ఇక్కడ అస్థి పంజరాలు కనిపించడానికి కూడా స్థానిక దేవత కోపమే కారణమని పలువురు భావిస్తారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏవీ లభించలేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement