రెప్పపాటులో అదృశ్యమైపోయే దృశ్యాలు కొన్ని మనకు తారసపడుతూ ఉంటాయి. అలాంటి దృశ్యాలను శాశ్వతంగా పదిలపరచుకోవాలంటే, అందుకు కెమెరా ఒక చక్కని సాధనం. అలాగని కెమెరా చేతిలో ఉంటే సరిపోదు. కనిపించిన దృశ్యాన్ని పదికాలాల పాటు నిలిచి ఉండేలా ఫొటో తీయడానికి ఎంతో సహనం, అంతకు మించిన సమయస్ఫూర్తి కావాలి. ఎంతో సహనంతో సమయస్ఫూర్తితో చాకచక్యంగా తీసిన ఫొటోల్లో కొన్ని అద్భుత చిత్రాలుగా నిలిచిపోతాయి. ‘నేషనల్ జాగ్రఫిక్’ 2022 సంవత్సరంలో అత్యుత్తమ చిత్రాలుగా ప్రకటించిన కొన్ని ఫొటోలు ఇవి...
ఓ వైపు సూర్యోదయం, మరోవైపు చంద్రుడు
ఒకవంక సూర్యోదయం, మరోవంక మబ్బుచాటు నిండుచంద్రుడు. రేయింబగళ్ల సంధికాలాన్ని ఒకే దృశ్యంలో బంధించిన అద్భుత చిత్రం ఇది. అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్టీఫెన్ విల్కిస్ ఈ ఫొటో తీయడానికి పురాతన సిటడల్ శిఖరంపైకి చేరుకుని 2,092 ప్రయత్నాలు చేశాడు. చివరకు ఈ అద్భుతాన్ని కెమెరాలో విజయవంతంగా బంధించగలిగాడు.
‘పోలార్ సన్’
నేషనల్ జాగ్రఫిక్ నౌక ‘పోలార్ సన్’ గ్రీన్‌లాండ్ తీరానికి ఆవల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు తారసపడిన దృశ్యం ఇది. రెండు మంచుఖండాల మధ్యనున్న చోటు నుంచి ప్రయాణిస్తున్న చిన్న పడవ కనిపించడంతో, ఓడలోనున్న ఫొటోగ్రాఫర్ రెనాన్ ఓజ్‌టర్క్ తన ద్రోన్ కెమెరాను సంధించి, ఈ అద్భుత చిత్రాన్ని బంధించాడు.
పశ్చిమాఫ్రికాలోని పోర్చుగీస్ ఆర్చిపెలాగో పర్వతప్రాంతంలోని ‘మడీరా లారెల్’ అరణ్యం. పురాతన వృక్షాలతో అలరారే ఈ అరణ్యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ అరణ్యంలోని చెట్లు ఒక్కొక్కటి వెయ్యి అడుగుల నుంచి ఐదువేల అడుగుల ఎత్తున ఉంటాయి. అమెరికన్ ఫొటోగ్రాఫర్ ఓర్సోల్యా హార్స్‌బెర్గ్ ఈ ఫొటో తీసింది.
వెనిజులా రాజధాని కరకస్‌లో కనిపించిన దృశ్యం ఇది. వేకువ జామునే పిట్టగోడపై వాలి మేత కోసం ఎదురుచూస్తున్న బ్లూ అండ్ యెల్లో మకావ్ పక్షులు. రామచిలుకల జాతికి చెందిన ఈ పక్షులకు స్థానికులు రోజూ పొద్దున్నే మేత పెడుతుంటారు. ఈ దృశ్యాన్ని వెనిజులాకు చెందిన ఫొటోగ్రాఫర్ అలెజాండ్రా సెగారా తన కెమెరాలో బంధించాడు.
Comments
Please login to add a commentAdd a comment