తమిళనాడుకు చెందిన ఒక కోటీశ్వరుడు తన తల్లికి గుర్తుగా మరో తాజ్‌మహల్ నిర్మించారు. ఇందుకోసం లెక్కలేనంత సొమ్ము ఖర్చు చేశారు. అమ్మే తన జీవిత సర్వస్వం అని అతను చెప్పుకొచ్చాడు. అమ్మ చనిపోయినప్పుడు ఎంతో కుమిలిపోయానని అన్నాడు. అమ్మ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయన పాల రాతితో మరో తాజ్‌మహల్ నిర్మించారు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై తనకున్న ప్రేమకు ప్రతీకగా తాజ్‌మహల్ నిర్మించారు. ఇప్పుడు ఒక కుమారుడు తన తల్లికి గుర్తుగా కోట్లాది రూపాయలు వెచ్చించి తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని నిర్మించారు. ఇది తమిళనాడులోని తిరువరూర్ జిల్లాకు చెందిన ఉదంతం. ఈ ప్రాంతానికి చెందిన అమ్రుద్దీన్ షేక్ దావూద్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ తాజ్‌మహల్ తరహాలో ఒక అద్భుత నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. 2020లో అమ్రుద్దీన్ తల్లి జెలానీ బీవీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అమ్రుద్దీన్ ఎంతగానో కుంగిపోయారు.
తల్లి జ్ఞాపకాలు మరువలేక..
అమ్రుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం అతని తల్లి అతనికి శక్తి, ప్రేమలకు ప్రతీకలుగా నిలిచారు. 1989లో రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన తరువాత ఆమె తన ఐదుగురు పిల్లలను పెంచిపోషించారు. ఆ సమయంలో ఆమె వయసు 30 ఏళ్లు మాత్రమే. భర్తను కోల్పోయాక ఆమె మరో వివాహం చేసుకోలేదు. పిల్లలను పెంచి పోషించేందుకు ఎంతో కష్టపడ్డారు. తండ్రిలేడనే లోటును లేకుండా పిల్లలను చూసుకున్నారు. 2020లో అమృద్దీన్ తన తల్లి మరణానంతరం అతను తల్లి జ్ఞాపకాలను మరచిపోలేకపోయారు. ఆమె తమతోనే ఉందని భావించారు. తిరువూరులో వారికి గల భూమిలో తల్లిని ఖననం చేశారు.
చదవండి: చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు
డ్రీమ్ బిల్డర్స్ సహాయంతో..
తరువాత డ్రీమ్ బిల్డర్స్‌ను సంప్రదించి, తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని అక్కడ నిర్మించారు. ఒక ఎకరాభూమిలో 8 వేల చదరపు అడుగులలో నిర్మితమైన ఈ తాజ్‌మహల్ నిర్మాణం కోసం 200 మంది పనిచేశారు. ఈ నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాగా అతని తల్లి 5 కోట్ల రూపాయలను పొదుపు చేశారు. ఆ మొత్తంతో ఇంటిలోని వారి అనుమతి తీసుకుని, అమ్రుద్దీన్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్‌మహల్‌ను చూసినవారంతా అద్భుతంగా ఉందని అంటున్నారు. కాగా ఈ భవనాన్ని చిన్నారులకు విద్యనందించేందుకు, ముస్లింలు నమాజ్ పఠించేందుకు వినియోగించనున్నామని అమ్రుద్దీన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment