
తల్లిని రోడ్డుపై వదిలి వెళ్లిపోయిన కొడుకు
అక్కున చేర్చుకున్న కాలనీవాసులు
వృద్ధాశ్రమానికి తరలించిన పోలీసులు
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది.
వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్‌బీనగర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు.
దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment