శనివారం.. ఒక్కరోజే వేర్వేరు సంఘటనలలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్ శాటర్ డే అంటూ దీనిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. తెల్లవారుజామునే తూర్పుగోదావరి జిల్లాలో వాహనం నదిలోపడి 22 మంది మరణించారు. అప్పటినుంచి వరుసపెట్టి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. గాలి, నీరు, నిప్పు.. ఇలా పంచభూతాల్లో చాలావరకు ప్రమాదకరంగానే పరిణమించాయి. దేశరాజధాని ఢిల్లీలో గాలి దుమారం సంభవించి పలువురు గాయాలపాలయ్యారు, వాహనాలు బోల్తా పడ్డాయి. గోదావరిలో వాహనం పడి 22 మంది మరణించారు. హైదరాబాద్లోని కంచన్బాగ్ ప్రాంతంలో బీడీఎల్ రక్షణ సంస్థలో వ్యర్థాలను తగులబెడుతుండగా మంటలు చెలరేగి ఐదుగురు గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ధవళేశ్వరం ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలో వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రల్లో భాగంగా తిరుపతి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
లూథియానాలో అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతి
లూథియానా: లూథియానా జిల్లాలో దోర్హా బైపాస్ రహదారి వద్ద ఫ్లైఓవర్ కింద అమ్మోనియం ట్యాంకర్ ఇరుక్కుపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి అమ్మోనియం గ్యాస్ లీకైంది. గ్యాస్ పీల్చిన స్థానికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 100 మంది తీవ్రంగా ఆస్వస్థతకు గురయ్యారు.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 19 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఈటా సమీపంలో లారీ - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
కాకినాడ సముద్రం విద్యార్థి మృతి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద శనివారం సముద్రంలో మునిగి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడలోని ఆదిత్య, కైట్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 29 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు సుధీర్(20) ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.
జీపు బోల్తా..ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలం కుడియా గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం ఓ జీపు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. సుమారు 10 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. శివర్ల నుంచి దేవరాపల్లి వైపు జీపు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడినట్టు సమాచారం.
బీడీఎల్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ కంచన్బాగ్ ప్రాంతంలో గల బీడీఎల్ సంస్థలో వ్యర్థాలను తగలబెడుతుండగా ప్రమాదం సంభవించింది. అవి పేలడంతో అక్కడే ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నీళ్లలో పడి ముగ్గురి గల్లంతు
విశాఖజిల్లా హుకుంపేట మండలం చీడిపుట్ట వంతెన సమీపంలోని వాగులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ముగ్గురి వయసూ పదేళ్లలోపే. గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది.
బ్లాక్ శాటర్డే
Published Sat, Jun 13 2015 7:08 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement