కత్తులతో కో‘ఢీ’
నిబంధనలకు నీళ్లు.. యథేచ్ఛగా పందాలు
జిల్లాలో జోరుగా కోడి పందాలు
చేతులు మారుతున్న లక్షల రూపాయలు
ప్రజాప్రతినిధులే ప్రత్యక్ష సాక్షులు పోలీసులు మౌన ప్రేక్షకులు
పందెం కోడి కాలు దువ్వింది..
కత్తులు కట్టుకొని మరీ కదం తొక్కింది..
సంప్రదాయానికి సరే..
కత్తులు మాత్రం కూడదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ కాలదన్నింది..
భోగి పండుగ అయిన శుక్రవారం నుంచే పందెం కోళ్లు ఢీ అంటే ఢీ అన్నాయి.. వాటి మధ్య లక్షల రూపాయలు
చేతులు మారాయి..
విశాఖ నగర శివారులోని ముడసర్లోవతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతున్నా అధికారులు
ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
వీటితోపాటు గుర్రపు పందాలు, ఎడ్లపందాలకు గ్రామీణ ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి.
విశాఖపట్నం: సంక్రాంతి అంటే కోడిపందాల కోలాహలం తప్పనిసరి. అయితే ఈసారి కత్తులు లేకుండా కోడిపందాలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కత్తులతోనే కోడిపందాలు జరిగాయి. నగర శివార్లలో భారీ బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలి, కోటఉరట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, చోడవరం, మాడుగుల, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాల్లో పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణలు దగ్గరుండి ముడసర్లోవ ప్రాంతంలో కోడి పందాలు జరిపించారు. దీంతోపోలీసులు ప్రేక్షకపాత్ర వహించి, శాంతి భద్రతలు పర్యవేక్షణతో సరిపెట్టారు.పక్క జిల్లాల నుంచి పందెం రాయుళ్లు
నగరంలో జరిగిన కోడి పందాలకు పక్క జిల్లాలైన తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పందెం రాయుళ్లు వచ్చారు. నిజానికి ఉభయగోదావరి జిల్లాల్లోనే కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈసారి అక్కడి పోలీసులు నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు సొంత ప్రాంతంలో పందాలు కాయడానికి కొందరు సంశయించడం వంటి కారణాలతో విశాఖ జిల్లాకు తాకిడి పెరిగింది. వీరంతా తమ వెంట కోళ్లను తీసుకువచ్చి మరీ పందాల్లో పాల్గొన్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు:
కోడిపందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశారు. నగదు కొరత ప్రభావం కోడి పందాలపై పెద్దగా కనిపించలేదు. నగదు రహిత పందాలకూ సై అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. స్మార్ట్‌ఫోన్లు, స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకున్నారు. దీంతో పందెంరాయుళ్లతోపాటు.. మందుబాబులతో శివారు ప్రాంతాలు కోలాహలంగా మారాయి. షామియానా సప్లయర్లు, భోజన విక్రేతలకు, చిరుతిళ్ల వ్యాపారులకు మంచి వ్యాపారం జరిగింది. ముఖ్యంగా మాంసం అమ్మకాలు విపరీతంగా జరిగాయి.
బారులు తీరిన వాహనాలు:
కోడి పందాలకు వచ్చిన వారితో నగరంలోని బరులు, రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ఒక్క ముడసర్లోవ ప్రాంతంలోనే ఐదొందల కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు కష్టంగా మారింది. వందలాది మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డులను నియమించారు.
రేపటి నుంచి ఎడ్లు, గుర్రం పందాలు
కనుమ రోజు నుంచి జిల్లాలో ఎడ్లపందాలు కూడా భారీ నిర్వహిస్తారు. కనుమ తర్వాత మాడుగుల, చోడవరం, సబ్బవరం, పెందుర్తి, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చియ్యపేట తదితర మండలాల్లో నెలరోజుల పాటు తీర్థాలు (తిరునాళ్లు) మొదలవుతాయి. ఈ తిరునాళ్లతో పాటు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు కూడా ఏర్పాటు చేసి విజేతలకు నగదు బహుమతులిస్తారు. జిల్లాలోని దాదాపు 200 గ్రామాల్లో ఏటా ఇవి జరుగుతుంటాయి. ఎడ్ల పందాల్లో మైసూరు జాతి ఎడ్లనే ఎంపిక చేస్తారు. వీటి ఖరీదు రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంటాయి. ఎడ్ల పందాల ఎద్దులను వ్యవసాయ పనులకు ఉపయోగించరు. ఏడాది పొడవునా వీటికి ప్రత్యేక దాణా పెడతారు. అదే విధంగా గుర్రం పందాలు కూడా నిర్వహిస్తారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఈ గుర్రపు పందాలు ఎక్కువగా జరుగుతాయి.