పీక్స్‌కు చేరిన కోడి పందేల సందడి | Rush over Sankranthi Kodi Pandalu: Social media platform announces schedules and invites in AP | Sakshi
Sakshi News home page

పీక్స్‌కు చేరిన కోడి పందేల సందడి

Published Mon, Jan 13 2025 4:45 AM | Last Updated on Mon, Jan 13 2025 4:45 AM

Rush over Sankranthi Kodi Pandalu: Social media platform announces schedules and invites in AP

సోషల్‌ మీడియా వేదికగా షెడ్యూల్స్‌ ప్రకటిస్తూ ఆహ్వానాలు

చింతమనేని అడ్డాలో ‘కాకతీయ కోడిపందేల ప్రీమియర్‌ లీగ్‌’ 

బిగ్‌ డే మ్యాచ్‌ల పేరిట ఉమ్మడి ‘పశ్చిమ’లో భారీ ఏర్పాట్లు 

రూ.9 లక్షల నుంచి రూ.25 లక్షల పందేలకు షెడ్యూల్‌ 

సిద్ధమవుతున్న బరులు, ఏర్పాట్లతో రీల్స్‌ ట్రెండింగ్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి వేళ కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఏ రోజున ఎక్కడెక్కడ పందేలు జరుగుతాయనే షెడ్యూల్స్‌ ప్రకటిస్తున్నారు. పలానా చోట పలానా బరి సిద్ధమవుతోందని.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మొత్తంలో పందేలు వేయొచ్చనే వివరాలతో కూడిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. కోడిపందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది.  

బిగ్‌ డే మ్యాచ్‌లట.. 
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5,  రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్‌ ప్రకటించుకున్నారు.

మరోవైపు బడా కోడి పందేంరాయుళ్లు నలుగురు పేర్లతో 13వ తేదీ గణపవరం, 14వ తేదీ శింగవరం, 15వ తేదీ సీసలిలో బిగ్‌డే మ్యాచ్‌లంటూ షెడ్యూల్‌ ప్రకటించడం వంటివి రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే తరహాలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని స్థానిక పందెంరాయుళ్లు బరులు, ఇతర వివరాలతో సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ చేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున పందేలకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.  

నిషేధం బేఖాతరు.. 
కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974­లోని సెక్షన్‌ 9 (1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్‌ అవుతున్నాయి.

దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్‌ లీగ్‌’ 
వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్‌ లీగ్‌ (కోడి పందేల లీగ్‌) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. క్రికెట్‌ టోర్నమెంట్స్‌ లీగ్‌ మాదిరిగా కోడి పందేల లీగ్‌ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement