Betting Crores of Amount on Kodi Pandalu in Godavari Districts - Sakshi
Sakshi News home page

Cockfights: కత్తి దూసిన పుంజులు: కోళ్లు.. కోట్లు

Published Sat, Jan 15 2022 3:55 AM | Last Updated on Sat, Jan 15 2022 3:28 PM

Organizer Betting Crores For Kodi Pandalu Name Of Tradition Godavari Districts - Sakshi

సాక్షి, అమరావతి: పందెం కోళ్లు జూలు విదిల్చి కత్తులు దూశాయి. భోగి రోజైన శుక్రవారం ఉభయ గోదావరితోపాటు పలు జిల్లాల్లో ఆంక్షలను అధిగమించి సంప్రదాయం పేరుతో నిర్వాహకులు పందెం పుంజులను బరుల్లోకి దించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంపలో ఒకరోజు ముందే పందెం కోళ్ల కూత మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా పళ్లంకుర్రులో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో అత్యధిక పందాలు గెలిచిన కోడి పుంజు యజమానికి ఇన్నోవా కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇక్కడ పందేలకు హాజరయ్యారు.

బురదగా బరులు..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బరులు తడిసిపోయి బురదమయంగా మారడంతో పలుచోట్ల పందేలు ఆలస్యంగా మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా సీసలి, తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోట ప్రాంతాల్లో వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలను ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులతో వీఐపీ గ్యాలరీలు, సాధారణ బారికేడ్లుతో బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల మాత్రం కత్తులు కట్టకుండా సంప్రదాయ కోడి పందాలను రాజకీయ నాయకులు ప్రారంభించారు. 

బరుల ధ్వంసం.. బైండోవర్లు
పలు ప్రాంతాల్లో పోలీసులు కోడి పందాలను అడ్డుకునేందుకు బరులను ధ్వంసం చేశారు. నిర్వాహకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. పందెం కోళ్లకు కత్తులు కట్టేవారిని అదుపులోకి తీసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైక్‌లతో ప్రచారం నిర్వహించారు. ఈసారి కోడి పందాలను అడ్డుకోవడంలో వర్షం, కరోనా భయం కొంతమేర సహకరించాయి. పందెంరాయుళ్ల సంఖ్య కొంత పలచబడింది.

పశ్చిమలో ‘తగ్గేదే లే’
పశ్చిమ గోదావరి జిల్లాలో పూలపల్లి, కలగంపూడి, మార్టేరు, ఉంగుటూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం,  దొరమామిడి, బుట్టాయిగూడెం, దెందులూరు తదితర చోట్ల భారీ షామియానాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. బరుల వద్ద పేకాట, గుండాటతో కోలాహలం నెలకొంది. కోడి పకోడి, బిర్యాని విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. జిల్లాలో సుమారు రూ.80 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

గుండెపోటుతో యువకుడు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కోడిపందేలను తిలకిస్తూ ఆరేపల్లి వీర్రాజు (34) గుండెపోటుకు గురై కుప్పకూలాడు. భీమవరం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  

రూ.లక్షకు తగ్గకుండా..
కృష్ణా జిల్లాలోని కొత్తూరు, తాడేపల్లి, సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు, అంబాపురం, నూజివీడు ప్రాంతాల్లో ఒక్కో పందెం రూ.లక్షకు తక్కువ కాకుండా జరిగాయి. గుంటూరు జిల్లా మాచర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు పందేలు కాశారు. 

పలుచోట్ల అరెస్టులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో పలుచోట్ల కోడి పందేల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చింతలపాలెం, ఉదయగిరి మండలం క్రిష్ణంపల్లి బీసీ కాలనీ, వెంకటగిరిలో మాసాపేట ట్యాంకు, సైదాపురం మండలం చీకవోలు తదితర చోట్ల పొలాలు, ఇతర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న 13 మందిని అరెస్టు చేసి రూ.5 వేల నగదు, పుంజులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ గంగవరం పోర్టు రోడ్‌ వై జంక్షన్‌లోని తోటల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు కోళ్లు, రూ.10 వేలు స్వాధీనం చేసుకొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement