-
అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో యథేచ్ఛగా కోడిపందేలు
-
హోంమంత్రి నియోజకవర్గాల్లోనూ అదే తీరు
-
మురమళ్లలో భారీ బరులు..
-
కోట్లలో పందేలు
-
విచ్చలవిడిగా గుండాటలు, జూదాలు
-
చేతులెత్తేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
చిన్నచిన్న విషయాలకే సామాన్యులపై ప్రతాపం చూపించే పోలీసులు.. అధికార, ధనబలం ముందు తల వంచేశారు. పందెంకోళ్లకు, పందెగాళ్లకు పగ్గాలు వేయలేకపోయారు. కోడిపందేల నియంత్రణ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఫలితంగా సంక్రాంతి కోడిపందేలు జిల్లావ్యాప్తంగా యథేచ్ఛగా సాగాయి. అన్నిచోట్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలే దగ్గరుండి పందేలను ప్రారంభించడం.. ఆ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా శుక్రవారం భోగి పండగనాడే కోడిపందేలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. దీంతోపాటు గుండాట, పేకాటలు జోరుగా సాగాయి. తొలిరోజు పందెం కోడి ఆరేడు కోట్ల పైనే కొట్టింది. కోడిపందేల నిర్వాహకులు జిల్లా అంతటా సుమారు 40 బరులు ఏర్పాటు చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం పందేలపై కనిపించలేదు. అన్నిచోట్లా రూ.2 వేల నోట్లు రెపరెపలాడాయి. స్వైపింగ్ మెషీన్లు సిద్ధం చేసినా
వినియోగించలేదు.
ప్రధాన ఆకర్షణగా మురమళ్ల
∙ఐ.పోలవరం మండలం మురమళ్ల బరిలో టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కత్తులు లేకుండా సంప్రదాయ పద్ధతిలో కోడిపందేలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కత్తులు కట్టి యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. ఇక్కడి ఏర్పాట్లు మినీ స్టేడియంను తలపించాయి. బరిలో ప్రతి పావుగంటకో పందెం జరిగింది. ఒక బరిలో ఒక్కో పందెం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిగింది. దీంతోపాటు పై పందేలు రూ.20 లక్షల పైనే జరిగాయి. అక్కడ మరో మూడు చిన్న బరులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ పందేలు జరిగాయి. ఇక్కడి పందేల్లో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కనిపించారు.
∙రూ.38 లక్షలకు హక్కులు దక్కించుకున్న గుండాట నిర్వాహకులు గుండాట, సూట్ బాల్ ఆటల కోసం 15 బోర్డులు ఏర్పాటు చేసి అరకోటి లావాదేవీలు జరిపారు.
∙మురమళ్లలోనే సుమారు 10 వేల మంది పందేలను వీక్షించారు. రహదారుల మధ్య మొక్కలు, నేతల ఫ్లెక్సీలు, గ్యాలరీలు.. ఇలా సర్వహంగులతో నిర్వహించడంతో మురమళ్ల కోలాహలంగా మారింది.
∙ఒక్క మురమళ్లలోనే రూ.3 కోట్ల‡ పందేలు జరగగా, మిగిలినచోట్ల సుమారు రూ.4 కోట్లు.. కలిపితే మొత్తంగా రూ.7 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా.
మరిన్నిచోట్ల : రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని చింతలపల్లి, మలికిపురం, లక్కవరం, గూడపల్లి, శంకరగుప్తం, సఖినేటిపల్లి లంక, రామేశ్వరం, లొల్ల, ర్యాలి, పొడగట్లపల్లి, దేవరపల్లి, నడిమిలంక, గెద్దనాపల్లి, చెయ్యేరు, పల్లంకుర్రు శివారు ఐ.చెరువు, అన్నంపల్లి, పల్లిపాలెం, రాజుపాలెం, గున్నేపల్లి అగ్రహారం తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు.
∙కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప, కాకినాడ రూరల్‌లోని 16 ప్రాంతాల్లో బరులు వేసి రూ.లక్షల్లో పందేలు నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లోనే కోడిపందేలు నిర్వహించారు.
∙మండల కేంద్రమైన కాజులూరు, గొల్లపాలెం, పల్లిపాలెం, కుయ్యేరు, జగన్నాథగిరి, కె.గంగవరం మండలం పేకేరు, ఎండగండి, కూళ్ల, రామచంద్రపురం మండలం ద్రాక్షారామల్లో కూడా కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి.
పోలీసులతో ముందుగానే ఒప్పందాలు!
పందేలు జరిగే ప్రతి ప్రాంతం నుంచి బరికి రోజుకు రూ.5 లక్షల చొప్పున పోలీసులకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలాచోట్ల పోలీసుల మొబైల్ ఫో¯ŒSలు స్విచ్చాఫ్ అయిపోయాయి. కొందరు ఫో¯ŒS లిఫ్ట్ చేసినా పందేలు తమ దృష్టికి రాలేదని పైకి చెబుతూ.. పైనుంచి వస్తున్న ఒత్తిళ్ల ముందు తామెంత అని ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. కాగా, దర్జాగా కోడిపందేలు ఆడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, నేతలను ఏమీ చేయలేని పోలీసులు.. కొత్తపేట, కరప తదితర ప్రాంతాల్లో సరదాగా పందేలు ఆడుతున్న సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపారు.
25 వరకూ 144 సెక్షన్ : జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తప్పవన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.