సాక్షి, అమరావతి: సంక్రాంతి కోడి పందేల ముచ్చట గురువారంతో ముగిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోను మూడు రోజుల పాటు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పందేల బరుల్లో కోళ్ల హంగామాతో పాటు సమీపంలో పేకాట, గుండాట, కోతాట వంటి జూదం, అనధికార మద్యం షాపులు లెక్కకు మిక్కిలి ఉండేవి. అయితే ఈఏడాది కోడి పందేలు గతానికంటే భిన్నంగా జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘాతో జూదానికి బ్రేక్ పడింది. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందేలు వేసుకోవాలని పోలీసులు సూచించారు. అలా జరపడం వల్ల ఉపయోగంలేదని, కత్తులు కట్టి పందెం వేస్తేనే త్వరగా గెలుపోటములు తేలుతాయని నిర్వాహకులు పట్టుబట్టారు.
బరుల వద్ద జూదం, మద్యం విక్రయాలు జరిగితే సహించేది లేదని పోలీసు యంత్రాంగం అల్టిమేటం ఇచ్చింది. దీంతో పందేలు చప్పగా సాగాయని నిర్వాహకులు నిట్టూర్చారు. అయితే కొన్ని చోట్ల చాటుమాటుగా గుండాటలతో పాటు పేకాటలు నిర్వహించారు. మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ షాపుల్లో మద్యం కొని తెచ్చుకుని కొందరు బరుల వద్ద సేవించారు. భోగి రోజు మధ్యాహ్నం మొదలై.. కనుమ రోజున ముగిసిన పందేలలో ఈ ఏడాది క్రేజ్ తగ్గిందని, జూదం కూడా తగ్గడం మంచి పరిణామమని గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కోడి పందెం బరులకు ఆనుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పకోడి దుకాణాలు, బిర్యాని సెంటర్లు, కూల్‌డ్రింక్ షాప్‌లతో పాటు కార్లు, బైక్ పార్కింగ్‌లతో భారీ ఎత్తున వ్యాపారం జరిగింది.
పందేలు తిలకించిన పలువురు ప్రముఖులు
గోదావరి జిల్లాల్లో కోడి పందేలను చూసేందుకు గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈసారి కూడా వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన కోడి పందేలను ఆయన తిలకించారు. ఉండి–భీమవరం రోడ్డు పక్కన ఉన్న కోట్ల ఆడిటోరియంలో ఆయనకు ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. సినీ నటుడు శ్రీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాలకు వచ్చి మూడు రోజులపాటు పండుగను సరదాగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment