భీమవరం/అమలాపురం టౌన్: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేలు మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరం, సీసలి, పెన్నాడ, యలమంచిలి మండలం కలగంపూడి, పూలపల్లి, పోడూరు మండలం కవిటం, వీరవాసరం మండలం జొన్నలపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి.
ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు తదితర నియోజకవర్గాల్లో పందేల జోరు కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్లకు పైగా చేతులు మారినట్టు చెబుతున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పందేల రాయుళ్లను ఆకర్షించేందుకు భీమవరం సమీపంలోని పెన్నాడ శిబిరం వద్ద ఎక్కువ పందేలు గెల్చుకున్న వారికి బుల్లెట్, స్కూటీ వంటి వాహనాలను బహుమతులుగా ఇచ్చారు. చిన్న గ్రామాల్లో సైతం కోడి పందేల జోరు కనిపించింది.
తూర్పున 80 బరుల్లో..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 80 ప్రధాన బరుల్లో కోడి పుంజులు తలపడ్డాయి. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ వారంతా కుటుంబాలతో సహా సొంతూళ్లకు వచ్చి కోడి పందేల బరుల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో వెలిసిన భారీ పందెం బరిలో రూ.కోట్లు చేతులు మారాయి.
మలికిపురం, రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం రూరల్, అల్లవరం, రాయవరం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వెలిసిన బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం, మేడపాడు, ఉండూరు, అచ్చంపేట, పులిమేరు, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పందెం కోళ్లు సై అంటే సై అన్నాయి. కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు, ఉప్పులూరు, గొడవర్రు, అంపాపురం, కంకిపాడు, కొత్తూరు తాడేపల్లి, మేకావానిపాలెం, ఎనీ్టఆర్ జిల్లా వెలగలేరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment