సాక్షి, కాకినాడ జిల్లా: సంక్రాంతి (Sankranti) పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు(Cockfighting), జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది.
పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి నేతల. ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా: జీవహింస వద్దన్న కోర్టు మార్గదర్శకాలను కూటమి నేతలు లెక్కచేయడం లేదు. యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూదాలను ప్రోత్సహిస్తున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పందెం బరులను ప్రారంభించారు. పోలీసుల మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం స్టాళ్లు ఏర్పాటు చేసి భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ఏరులై పారుతోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగాచేతులు మారింది.
ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
Comments
Please login to add a commentAdd a comment