జోరుగా కోడి పందేలు | Kodi Pandalu In Telangana Warangal | Sakshi
Sakshi News home page

జోరుగా కోడి పందేలు

Published Sat, Sep 15 2018 12:36 PM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM

Kodi Pandalu In  Telangana Warangal - Sakshi

భద్రాచలం (ఖమ్మం): భద్రాచలానికి సమీపంలోని సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సరిహద్దున ఉండటంతో అటువైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో నిర్వాహకులు యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నా రు. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తునికి చెరువు, చోడవరం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చీరవల్లి సమీప అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజులు, ఎక్కువగా గురు, ఆదివారాల్లో వీటిని నిర్వహిస్తున్నారు.

భద్రాద్రి, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పందెంరాయు ళ్లు తరలివస్తున్నారు. ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ని సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి తూర్పుగోదావరి, విశాఖ పట్నం జిల్లాల నుంచి ఇక్కడ నిర్వహించే కోడిపందేలలో పాల్గొనేందుకు వస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారంతా భద్రాచలం మీదుగా, తూర్పు, విశాఖపట్నం నుంచి వచ్చే వారు రంపచోడవం ఘాట్‌రోడ్‌ నుంచి చింతూరు మీదగా వాహనాల్లో వస్తున్నారు. ఇక్కడ కోడిపందేలు నిర్వహించే రోజుల్లో ఆయా రూట్‌లలో కార్ల దండు కనిపిస్తుంది. భద్రాచలం ప్రాంతానికి యాత్రికులు, భక్తులు ఎక్కువగా వాహనాల్లోనే వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తనిఖీలు లేకుండానే పందెంరాయుళ్లు దర్జాగా స్థావరాలకు చేరుకుంటున్నారు.
  
కత్తులు కడితే రూ.లక్షలు పడాల్సిందే 

కోడి పందేలు కొందరు ప్రముఖల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రాచలానికి సమీపంలో మూడు చోట్ల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోగా, ఎక్కడ నిర్వహిస్తారనేది పందెం రాయుళ్లకు ముందుగానే సమాచారం ఉంటుంది. స్థావరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. బిర్రులోకి వెళ్లే ప్రతీ ఒక్కరి నుంచి రూ. 300 రూ.500 వరకు నిర్వాహకులు వసూళ్లు చేస్తున్నారు. పందెం నిర్వహించే రోజున ఎంత మంది వచ్చినప్పటికీ,  ఐదు వందల మంది పట్టే రీతిలో బిర్రు తయారు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక రోజుకు కత్తుల కట్టిన చోట రూ.2.50 లక్షల వరకు వసూళ్లవుతాయి. పందెం కాసే డబ్బుల్లోంచి కూడా 5 శాతం కమీషన్‌ నిర్వాహకులకు ఇచ్చేలా తగిన ఒప్పందాలు ఉంటాయి.

ఒక్క రోజుకు రూ. 3 నుంచి 5 లక్షల వరకూ నిర్వాహకులకు ముడతాయి. మూడు ముక్కల పేకాట, లోనబయట వంటి జూదం నిర్వహించుకునేందుకు నిర్వాహకులకు ముందస్తుగా డబ్బులు చెల్లించాలి. కోడిపందేలు నిర్వహించే చోట మద్యం విక్రయాలకు సంబంధించిన దుకాణాలు కూడా వెలుస్తున్నాయి. వీటిని పెట్టుకునేందుకు నిర్వాహకులకు డబ్బులు చెల్లించి ముందుగానే ఒప్పందం చేసుకోవాలి. ఈ రీతిన కోడి పందేల నిర్వహణకు లక్షలాది రూపాయలను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిహారం డబ్బులు అందుకున్న బడాబాబులు సైతం వీటిలో పాల్గొనేందుకు వస్తుండటంతో ఇక్కడ పందేలు రూ.లక్షల్లోనే సాగుతున్నాయి.
 
భద్రాచలం కేంద్రంగానే..  
సరిహద్దు అటవీ ప్రాతంలో వినాయక చవితి మొదలుకుని సంక్రాంతి వరకు కోడిపందేల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలకు కొంతమంది జట్టుగా ఏర్పడి కోడిపందేలను నిర్వహిస్తున్నారు. పందేలు జరిగే రోజుల్లో తనిఖీలు చేయకుండా సరిహద్దు ప్రాంతాల్లోని ఒక్కో స్టేషన్‌కు నెలకు రూ. లక్ష ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వీటి జోలికి వెళ్లకుండా ఉండేలా కొన్ని వర్గాలకు కూడా డబ్బులు పంచుతున్నారనే ప్రచారం ఉంది. గత ఏడాది కూడా ఇదే రీతిన సరిహద్దు ప్రాంతంలో కోడి పందేలు సాగాయి. అప్పట్లో జరిగిన మామూళ్ల పర్వంపై ఇక్కడి నిఘా వర్గాలు పక్కా ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. భద్రాచలంలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి మారాయిగూడెం ప్రాంతంలో జరిగే కోడిపందేలును అడ్డుకునేందుకు ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.
 
ముందుగానే మేల్కొంటేనే.. 
భద్రాచలం కేంద్రంగా సాగుతున్న కోడిపందేల దందాపై పోలీసు అధికారులు అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ఈ పరిణామాలు వేరే అక్రమాలకు తావిచ్చే అవకాశం ఉంటుంది. గత సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో ఎటపాక పోలీసు స్టేషన్‌లో ఎన్‌ఐఏ అధికారిని అంటూ కొన్ని రోజులు పాటు హల్‌చల్‌ చేసిన నకిలీ పోలీసు భద్రాచలం కేంద్రంగానే కదలికలు కొనసాగించాడు. గంజాయి రవాణాకు కూడా ఇదే మార్గం కావటం పోలీసులకు కత్తిసాము వంటిదే. మళ్లీ ఈ ప్రాంతంలో కోడి పందేలకు తెరలేపగా, ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ కావటం, మరో పక్క మావోయిస్టుల కదలికలు కూడా బాగానే ఉండటంతో దీని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై ముందుగానే దృష్టి సారించి కట్టడి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement