పందెం కో‘ఢీ’ | kodi pandalu court baned | Sakshi
Sakshi News home page

పందెం కో‘ఢీ’

Published Mon, Dec 26 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

kodi pandalu court baned

  • సన్నాహాలతో ‘సై’ అంటున్న పందెగాళ్లు
  • హైకోర్టు ఆదేశాలతో ఆచీతూచీ అడుగులు
  • ఎప్పుడూ ఉన్నదేనంటూ సమాయతమ్తవుతున్న వైనం
  • గతమంతా రూ.30 కోట్లతో హవా
  • ఆ వైభవాన్ని కొనసాగిస్తామంటూ ధీమా
  • సంక్రాంతి వచ్చిందంటే భోగిమంట ... కొత్త దుస్తులు... ఇంటి ముందు ముగ్గులు... తోరణాలు... హరిదాసుల గానాలాపనలు... కొత్త అల్లుళ్లతో కోలాహలం... పిల్లల పరుగులు...గోమాతలకు పూజలు  ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా పండగే. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు, ఆ ముసుగులో మరిన్ని జూదాలు, కత్తుల కోలాటాలు... ఘర్షణ వాతావరణం... ఇవుంటేనే
     సం... క్రాంతి. ఈ తీరుపై సోమవారం హైకోర్టు కన్నెర్ర చేసింది. కోడి పందేలు నిర్వహించకుండా చూడాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీలకు అప్పగించింది. గట్టి చర్యలు తీసుకోవాలని హుంకరించడంతో పందెగాళ్లు తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొంతమంది ఇదంతా మామూలే అన్నట్టుగా కోళ్లను దువ్వుతున్నారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు అన్నిటికంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. ఈ పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇవి లేకుండా సంక్రాంతి సంబరాలు జరగవంటే అతిశయోక్తికాదు. ఓ తిరునాళ్లను తలపించే విధంగా నిర్వహిస్తూ ఓ సంప్రదాయ క్రీడగా వీటిని పరిగణిస్తారు. కోడి పుంజుకు కత్తి కట్టకుండా పందెం కడితేనే అది సంప్రదాయ క్రీడ అవుతుంది. అదే కత్తికట్టి బరిలోకి దింపి పందేలు కాస్తే కచ్చితంగా అది చట్ట ప్రకారం నేరమే అవుతుంది. కానీ గోదావరి పొడవునా ఉన్న పల్లెల్లో ఈ నిబంధనలేమీ వర్తించవంటారు స్థానికులు. వారిని స్థానికులనేకంటే  ఆయా ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు అనడమే సబబు. ప్రతి సంక్రాంతికి ముందూ పందేలు జరగనివ్వమని...లాఠీ ఝుళిపిస్తామని పోలీసులు హుంకరిస్తుంటారు. కానీ సంక్రాంతి ప్రారంభానికి పది రోజులు ముందు నుంచి ప్రారంభమై సంక్రాంతి మూడు రోజులు కోట్ల పందేలు జరిగిపోతూనే ఉంటాయి. ఈ సమయాల్లో పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం ప్రతి సంక్రాంతికి షరా’మామూలుగానే తయారవుతోంది.
    కోర్టు ఆదేశాలున్నా..
    వినోదం పేరుతో మూగజీవాలను హింసించడం తగదని సోమవారం హైకోర్టు హెచ్చరించింది. అటువంటి కోడి పందేలు అసలు నిర్వహించ వద్దని, నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పీపుల్‌ ఫర్‌ ఏనిమల్‌ ఆర్గనైజేషన్, ఏనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు వేసిన పిటిషన్లపై కోర్టు ప్రభుత్వానికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో సంక్రాంతికి కోడి పందేలపై చర్చ మొదలైంది. ఈసారి పందేలు జరుగుతాయా లేవా అనే దానిపై పందేల నిర్వాహకులు, రాజకీయ నాయకుల మధ్య తీవ్రంగా చర్చ సాగుతోంది. ప్రతి ఏటా ఇటువంటి ఉత్తర్వులు రావడం మామూలేనని, ఆరు నూరైనా పందేలు నిర్వహించడం ఖాయమనే పందేల రాయుళ్ల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. జిల్లాలో అల్లవరం మండలం గోడి, గోడిలంక, ఐ.పోలవరం మండలం మురమళ్ల, పెదమడి మొక్కతోట, కేశనకుర్రు, ఎదుర్లంక, రావులపాలెం మండలం దేవరపల్లి, మల్కిపురం మండలం ఉయ్యూరువారిమెరక, పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, జగ్గంపేట శివారు మల్లిశాల, తుని, రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో కో అంటే కోడిపందేలు కోట్లలోనే నిర్వహిస్తారు.
    ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలోనే...
    ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు దగ్గరుండి మరీ కోడిపందేలు ఆడించిన సందర్భాలు అనేకం. గత ఏడాది సంక్రాంతి మూడు రోజులు జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎల్‌ఈడీ స్క్రీ¯ŒSలు ఏర్పాటు చేసి మరీ కోడిపందేలు నిర్వహించారు. మురమళ్లలో జరిగిన ఈ పందేలు రూ.కోట్లు దాటేశాయి. పేరుకు సంప్రదాయబద్ధమని పైకి చెబుతూ బరిలో మాత్రం పక్కా ప్లా¯ŒSతో జూదంగా మార్చేస్తుంటారు. వీరికి రాజకీయ అండదండలు దండిగానే ఉంటాయి. పోలీసులు బరి దగ్గరకు రాకుండానే వాటాలు వెళ్లిపోతాయి. కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో గుండాట, గాంబ్లింగ్‌ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డూ అదుపే ఉండదు.
     
    ఆ ముసుగులో అన్నీ...
    కోడి పందేలతోపాటు మిగిలిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు వారం రోజులు ముందుగానే వేలం పాటలు నిర్వహించి లక్షల్లో రేట్లు నిర్ణయిస్తారు. పందెం కాపు కాసే నగదు నుంచి మామూళ్ల పంపకానికి వాటాలు కూడా తీస్తారు. అందుకోసం సొమ్మునంతటినీ ఒక పూల్‌గా ఏర్పాటు చేస్తారు. ఇదంతా చక్కబెట్టినందుకు నాయకులకు కూడా తగినంత ముడుతుంది. గత ఏడాది సంక్రాంతి మూడు రోజులు జిల్లా అంతటా కలిపి రూ.20 నుంచి రూ.30 కోట్లు కోడి పందేలు జరిగాయని అంచనా. గతేడాది కూడా న్యాయస్థానం ఇదేరకమైన ఉత్తర్వులు ఇచ్చినా చివరకు పందెం కోడే గెలిచింది. పందేలు నియంత్రించాల్సిన ఖాకీ ఓడిపోయింది.ఈ సారి ఏం జరుగుతుందో తేలాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement