panchayathi
-
తీరుమారనున్న పంచాయతీ పాలన
సాక్షి, అచ్చంపేట : గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈసారి పంచాయతీ పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీలకు వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకద్బందీగా అమలు చేయనున్నారు. సర్పంచ్‌లకు సవాలే గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి పరిస్థితులు లేవు. అభివృద్ధి పనులను చేయాలంటే మొదటగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. గ్రామంలో ఏ పనులు చేయాలన్నా సమావేశంలో తీర్మాణాలు చేసి వారి సమక్షంలో నిధులు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తీర్మానం తప్పనిసరి గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటుగా వారిపై వేటుపడే అవకాశం ఉంది. గత సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బు ఖర్చు చేసి గ్రామాల్లో పనులు చేసి ఆతర్వాత వచ్చిన నిధులను తీర్మాణాలు చేయకుండానే పనులు చేశామని పంచాయతీ నుంచి డబ్బు తీసుకునేవాళ్లు. ఈసారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మాణం చేసుకుని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవినీతికి పాల్పడే సర్పంచ్ల పదవికి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. అందుబాటులో వివిధ యాప్‌లు ప్రియా సాఫ్ట్‌వేర్‌తో అక్రమాలకు చెక్ పడనుంది. పంచాయతీరాజ్ ఇనిస్టిషన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. పంచాయతీలకు ఎంత బడ్జెట్ మంజూరైంది. మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చు చేశారు. శానిటేషన్, వైద్యం, నీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణం, సిబ్బంది వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామజ్యోతి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వార్షిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపు, నిధుల ఖర్చు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్లాన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా సమాచారాన్ని నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జనాభా సామాజిక వివరాలు, భౌతిక వనరలు, మౌలిక వసతులు, సాంఘిక ఆర్థిక సహజ వనరులను యాక్షన్ ప్లాన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పారదర్శక పాలన నూతనంగా అమలు చేయనున్న పంచాయతీరాజ్ చట్టాలతో గ్రామాల్లో పారదర్శక పాలన అందనుంది. అందుబాటులోకి యాప్‌లు రావడంతో ఎలాంటి అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతాయి. అవినీతికి పాల్పడే సర్పంచ్‌లపై వేటు పడే అవకాశాలు ఉన్నందున తప్పులకు తావివ్వరు. యాప్‌లపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – సురేష్‌కుమార్, ఎంపీడీఓ, అచ్చంపేట -
తండాలకు కొత్తకళ
సాక్షి, యాదాద్రి : మాతండాలో మా రాజ్యం కావా లని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనుల ఆశలు నెరవేరబోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వం నూతనంగా 84 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా అందులో 38 తండాలు ఉన్నాయి. వీటిలో పూర్తిగా వందశాతం గిరిజనులు కలిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాలు 31 ఉన్నాయి. నూతన పంచాయతీల్లో ఆగస్టు 2నుంచి పాలన ప్రారంభమవుతుం ది. అయితే పంచాయతీ ఎన్నికలకు మరికొంత సమయం ఉండడంతో అప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ మేరకు తండాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గెలిచినా కీలుబొమ్మలే..! ఇంతకాలం మరుగునపడిన తండాల్లో ‘కొత్త’ శకం ప్రారంభం కాబోతోంది. రిజర్వేషన్ల ప్రకా రం వారికి ప్రజాప్రతినిధులుగా అవకాశం వచ్చి నా ఆయా గ్రామాల్లో ఉండే ఇతర కులాల పెద్దల చేతుల్లో కీలు బొమ్మలుగా ఉండేవారు. రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలిచినప్పటికీ అధికారం మొత్తం వారి చేతుల్లో ఉండేది కాదు. అలాగే ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారికి అందకుండాపోయేవి. గిరిజనుల పేరు మీద మంజూ రైన రుణాలు, ఇతర పథకాలు దుర్వినియోగం అయ్యేవి. రాజకీయంగా ఎదుగుదల లేకపోవడంతోపాటు వారి సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా మిగిలే వి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, త్వరలో ప్రత్యేక పాలన ప్రారంభం కానుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోతున్నాయి. రెండు,మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు ఆగస్టు 2 నుంచి నూతన గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలకు గ్రామపంచాయతీల భవనాలు గుర్తించాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో ఆయా నూతన పంచాయతీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వేతర భవనాలు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో నివేధికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. నూతన, పాత గ్రామ పంచాయతీల్లని సామగ్రిని సర్దుబాటు చేయడం కోసం అధికారులు సిద్ధమయ్యారు. వచ్చేనెల 2 నుంచి జిల్లాలోని 401గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వస్తాయి. మూడు గ్రామపంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక అధికారిని నియమిస్తారు. ఈనెల 25వ తేదీ లోపు నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. నారాయణపురం మండలంలో అధికంగా.. సంస్థాన్ నారాయణపురం మండలంలో ప్రస్తుతం 14గ్రామపంచాయతీలు ఉండగా మరో 17 నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో 14 తండాలు ఉన్నాయి. మౌలి క వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూతబడిన ప్రభుత్వ పాఠశాలలో, అద్దె భవనాల్లో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాల ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబం ధించి ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలన చేశారు. కడపగండితండాలో క మ్యూనిటీ భవనం కానీ, ఇతర ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. తండాలో ప్రభుత్వ భూమి లేదు. సీసీ రోడ్లు లేవు. తండాకు నీరందించడానికి రెండు మంచినీటి ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. మురుగునీటి సరఫరా కోసం ఒక డ్రెయినేజీ మాత్రమే ఉంది. ప్రస్తుతం 14 గ్రామాలకు ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. నూతనంగా 17 పంచాయతీల ఏర్పాటుతో మండలంలో మొత్తం 31 గ్రామాలు కానున్నాయి. మొత్తం ఏడుగురు కార్యదర్శులతో పాలన సాగనుంది. జనగాం గ్రామ కార్యదర్శికి 8 గ్రామాలకు ఇన్చార్జి కొనసాగనున్నారు. -
‘కనికట్టు’పై క్షేత్రస్థాయి విచారణ
తొండంగి (తుని): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ(ఐఎస్ఎల్) పథకంలో తొండంగి మండలం పైడికొండ పంచాయతీలో జరిగిన అవకతవకలను వెలికిస్తూ ‘సాక్షి’ గతేడాది ‘కనికట్టు’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. మరోవైపు బాధిత లబ్ధిదారులు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేప«థ్యంలో బుధవారం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో లబ్ధిదారులకు తెలియకుండానే ఎన్జీఓ పేరుతో కాంట్రాక్టర్, పంచాయతీ కార్యదర్శి కలిసి నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంపై కొంత కాలం క్రితం బాధిత గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీలో 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్లో పేర్కొనడంతోపాటు తొంభైశాతం మరగుదొడ్లకు కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిగాయి. దాదాపుగా పంచాయతీలోనే 70 నుంచి 80 లక్షల వరకూ అవినీతి జరిగిందని అంచనా. కాగా దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జెడ్పీ సీఈవోను విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవో సుబ్బారావు, ఇతర అధికారులను విచారణ చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఏఓ సుబ్బారావు కొద్ది రోజుల క్రితం మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమికంగా రికార్డులు పరిశీలించి నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్‌కు చెల్లింపు జరిగినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం బాధితులందరూ కలిసి విచారణ పక్కదారి పడుతుందన్న అనుమానంతో క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని మరో మారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పైడికొండ, ఆనూరు గ్రామల్లో 32 మందితో కూడిన అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులనునిలదీసిన గ్రామస్తులు గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని నిధులు కాజేసిన వ్యవహారంపై కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు విచారణకు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ భమిడి శివమూర్తితో సహా, విచారణ అధికారుల బృందాన్ని గ్రామస్తులు నిలదీశారు. దీనిపై అధికారులు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికే పరిశీలనకు వచ్చామని గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో వారు విచారణ నిర్వహించారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో ఎనిమిది మంది నాలుగు బృందాలుగా, మిగిలిన దాదాపు 11 బృందాలు పైడికొండ గ్రామంలో ఇంటింటా తిరిగి పరిశీలన జరిపారు. వాస్తవంగా మరుగుదొడ్డి ఉందా? ఎప్పుడు నిర్మించుకున్నారు?, ఎవరు నిర్మించారు?, నిధులు అందాయలా? లేదా? అన్న విషయాలపై విచారణ జరుపుతున్నట్టు విచారణ అధికారి ఏవో సుబ్బారావు తెలిపారు. నిధులు దుర్వినియోగం అయినట్టు ప్రాథమికంగానే గుర్తించామని, ఏ స్థాయిలో జరిగిందనేది క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతుందని ఆయన వివరించారు. దీనిపై సమగ్రమైన నివేదికను జిల్లా పరిషత్ సీఈవోకు అందజేస్తామన్నారు. నాకు తెలియకుండా నిధులు దుర్వినియోగం చేశారు మా పంచాయతీలో ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కార్యదర్శి, ఎంపీడీవో కలిసి నిధులు ఖర్చు చేశారు. జాయింట్ చెక్ పవర్ ఉన్నా నా ప్రమేయం లేకుండా ఖర్చు చేశారు. దీనిపై 19న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.– పైడికొండ సర్పంచ్ భవిరిశెట్టి లోవ విచారణకు వచ్చిన అధికారులకు ఫిర్యాదు ఆనూరులో ఐఎస్ఎల్పై పరిశీలనకు వచ్చిన అధికారుల బృందానికి లబ్ధిదారులు కొంత మంది నిధులు అందలేదని ఫిర్యాదు చేశారు. తాము సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని తెలిపారు. మరికొంత మంది మరుగుదొడ్డే నిర్మించుకోలేదని, కానీ తమపేరున తమకు తెలియకుండానే నిధులు విడుదల చేసుకున్నట్టు వచ్చిన అధికారులకు వివరించారు. -
విద్యుత్ బకాయిలు..రూ.167.42 కోట్లు..!
నల్లగొండ : విద్యుత్ బిల్లుల బకాయిల భారం విద్యుత్‌శాఖకు పెద్ద గుదిబండలా మారింది. ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించడం మానేశారు. నిధుల సమస్యను కారణంగా చూపించి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా మొండికేశారు. దీంతో ఏటికేడు పెరిగిపోతున్న బకాయిలను వసూలు చేయడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. విద్యుత్ శాఖ నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. ప్రతి నెలా విద్యుత్ శాఖ నిర్వహించే నెలవారీ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ బకాయిల పైన ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్నా బిల్లులు మాత్రం వసూలు కావడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్, మైనర్ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు మొత్తం రూ.167.42 కోట్లు అని తేలింది. దీంట్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చెల్లించాల్సిన బకాయిలు రూ.44 కోట్లు. కాగా పాత బకాయిలతో కలుపుకుని మొత్తం రూ.167.42 కోట్లు. వీటిల్లో ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.3.21 కోట్లు కాగా, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3.74 కోట్లు, మేజర్, మైనర్ పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. పేరుకుపోయిన బకాయిలు.. జిల్లా కేంద్రంలోని 26 ప్రభుత్వ శాఖల్లో బిల్లులు చెల్లించకుండా మొండికేసిన శాఖల్లో విద్యాశాఖ రూ.కోటి 32 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పాఠశాలల హెచ్ఎంల నుంచి స్పందన ఉండటం లేదన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారని విద్యాశాఖ చెప్తోంది. కానీ హెచ్ఎంలు మాత్రం వచ్చిన కొద్దిపాటి నిధులు పాఠశాలల నిర్వహణకే సరిపోతున్నాయని, దాంతో బిల్లులు చెల్లించడం కష్టం మారిందని అంటున్నారు. పోలీస్ క్వార్టర్స్‌కు సంబంధించి కోటి రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ బకాయిలు ఇవి. నెలవారీ బిల్లుల చెల్లింపులో పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉంది. కానీ క్వార్టర్స్ బకాయిలను సెటిల్ చేసుకోకపోవడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయాయి. వ్యవసాయ శాఖ రూ.3.08 లక్షలు, పశుసంవర్థక శాఖ రూ.లక్షా 92 వేలు, ఉన్నత విద్య రూ.లక్షా 94 వేలు, సాగునీటి పారుదల శాఖ రూ.57.41 లక్షలు, రెవిన్యూ శాఖ రూ.7 లక్షలు, రవాణా శాఖ రూ.5.97 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ శాఖలకు సంబంధించి నిధులు సర్దుబాటుకాకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, వచ్చిన కొద్దిపాటి నిధులు కూడా ఫ్రీజింగ్‌ల పేరుతో ట్రెజరీ శాఖ నిలిపేస్తుందని అంటున్నారు. ప్రతి నెలా క్రమతప్పకుండా బిల్లులు చెల్లి స్తున్న శాఖల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, వైద్య ఆరోగ్యం, పోలీస్ శాఖలు ఉన్నాయి. బిల్లులు చెల్లించక రెండేళ్లు...! మున్సిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించక రెండేళ్లు దాటింది. పంచాయతీలు చివరిసారిగా జనవరి 2016లో చెల్లించారు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. మున్సిపాలిటీల బకాయిలు రూ.3.74 కోట్లు ఉండగా, పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్న నాటి నుంచి సర్పంచ్‌లు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల్లో 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు పాటించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో వీధిలైట్ల విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. తాగునీటి బోర్లకు విద్యుత్ కట్ చేయడం సాధ్యం కానందున చర్యలు తీసుకులేకపోతున్నామని అంటున్నారు. మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ సర ఫరా నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ మేరకు కమిషనర్లకు నోటీసులకు కూడా జారీ చేశామని చెప్పారు. సర్‌చార్జీల భారం... విద్యుత్ బకాయిల పైన సర్‌చార్జీల పేరుతో 18 శాతం అదనపు భారాన్ని వసూలు చేయడం జరుగుతోంది. ఈ తరహా చార్జీలు అన్ని రకాల కేటగిరీలకు చెందిన బిల్లులకు వర్తిస్తుంది. ప్రతిఏడాది 18 శాతం సర్‌చార్జీల పేరుతో వినియోగదారులు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు అదనపు భారాన్ని మోయాల్సిందే. ఎంతకాలం పాటు బిల్లులు చెల్లించకుండా ఉంటే అన్నేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులపైన 18 శాతం సర్‌చార్జీ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయిల పైన ఎస్ఈ కృష్ణయ్య మాట్లాడుతూ...అన్ని శాఖలకు నోటీసులు జారీ చేశామని, ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు. -
కాతేరులో.. ‘కట్టు’కథలు..
- యథేచ్ఛగా అపార్ట్మెంట్ల నిర్మాణం – అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు – సెట్‌బ్యాక్స్ రెండు అడుగులు కూడా లేని వైనం – నిర్మించి అమ్మేస్తున్న వ్యాపారులు – చూసీచూడనట్టుగా అధికారులు అక్రమ కట్టడాలకు కాతేరు పంచాయతీ అడ్డాగా నిలుస్తోంది. పంచాయతీ అనుమతులు తీసుకుని బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. బిల్డర్ల ‘కట్టు’కథలు వింటున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు సాగుతున్నా.. తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. - సాక్షి, రాజమహేంద్రవరం దాదాపు 9వేల గడప ఉన్న కాతేరు పంచాయతీ రాజమహేంద్రవరంలో కలిసినట్టుగానే ఉంటుంది. నగరం నుంచి కాతేరు వరకు మధ్యలో నిర్మాణాలు ఉండడంతో పంచాయతీలో అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో స్థలాలు లేకపోవడంతో వ్యాపారులు నగరాన్ని ఆనుకుని ఉన్న హుకుంపేట, పిండిగొయ్యి, కాతేరు, ధవళేశ్వర్యం తదితర పంచాయతీల్లో అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ఐదేళ్లుగా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అక్కడ జన్మభూమి కమిటీలు, పంచాయతీ అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ క్రమంలోనే పంచాయతీ అధికారులు అడిగిందే తడవుగా అనుమతులు ఇస్తున్నారు. సాధారణంగా పంచాయతీ స్థాయిలో జీ ప్లస్ 2 వరకు అనుమతులు ఇస్తారు. అయితే వ్యాపారులు మూడు, నాలుగు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. కాతేరు గ్రామం, పంచాయతీ పరిధిలోని మల్లయ్యపేటలో ఈ విధంగా అనధికారిక కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మల్లయ్యపేట కాతేరు మధ్యలో చెరువు వద్ద శివాని బిల్డర్స్, డెవలెపర్స్ సంస్థ పంచాయతీ అనుమతులతో జీ ప్లస్ 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. నిబంధనల ప్రకారం పంచాయతీ అనుమతితో గరిష్టంగా జీ ప్లస్ 2 వరకే నిర్మించాలి. కానీ జీ ప్లస్ 4 అంతస్తుల భవనం నిర్మిస్తున్న శివాని బిల్డర్స్, డెవలపర్స్ సంస్థ కనీసం సెట్‌బ్యాక్స్ కూడా నిబంధనలకు అనుగుణంగా వదలలేదు. భవనం నాలుగు వైపులు కనీసం రెండు అడుగుల ఖాళీ ప్రదేశం కూడా వదల్లేదు. మల్లయ్యపేటలోని నిర్మించిన లక్ష్మీ టవర్స్ కూడా ఇలాగే నిబంధలకు విరుద్ధంగా నిర్మించారు. పంచాయతీ అనుమతితో జీ ప్లస్ 4 అంతస్తులు నిర్మించిన బిల్డర్, సెట్‌బ్యాక్స్ రెండు అడుగులు కూడా వదల్లేదు. ఇలా పంచాయతీలో అనేక ఇళ్లు కూడా ఉన్నాయి. గతంలో కాతేరు పంచాయతీ కార్యదర్శి ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. నిధుల గోల్మాల్, పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలపై ఆ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పట్టించుకోని అధికారులు, సిబ్బంది.. కాతేరు పంచాయతీలో నిబంధలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు, భవనాలు నిర్మిస్తున్నా పంచాయతీ అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా ఉంటున్నారు. రాజకీయ పార్టీ నేతల ఒత్తిడులు, ఇతర వ్యవహారాల నేపథ్యంలో కింది స్థాయి అధికారులు మిన్నుకుండిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. నష్టపోనున్న కొనుగోలుదారులు... నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ అనుమతులకు మించి మూడు, నాలుగు అంతస్తుల మేర అపార్ట్మెంట్లు నిర్మించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణాలు, నగరాలలో నిర్మించిన పాత భవనాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం బీఆర్ఎస్ అనే పథకం ప్రవేశపెట్టి అమలు చేసింది. కానీ పంచాయతీలలోని అనధికారిక, అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేలా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకం ప్రవేశ పెట్టలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. అనధికారికి కట్టడాలను కూల్చివేడం, లేదా భారీ స్థాయిలో జరిమానా విధించడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్టు గత కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. అయితే వీటిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది జరిగితే అప్పటికే కొనుగోలు చేసిన వారు నష్టపోనున్నారు. నోటీసులు ఇస్తాం.. చట్టప్రకారం చర్యలు అనధికారిక, అక్రమ కట్టడాలు నిర్మించే వారికి నోటీసులు ఇస్తాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, సబ్‌కలెక్టర్ తరచూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ నిర్మాణదారులు లెక్కచేయడం లేదు. అక్రమ, అనధికారిక అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొన్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – వరప్రసాద్, డీఎల్పీవో, రాజమహేంద్రవరం డివిజన్ -
పంచాయతీల్లో అక్రమాలను సమర్థిస్తారా?
మూడేళ్లయినా ఇంకా బురద జల్లే ప్రయత్నమా? విజిలె¯Œ్సకు ఫిర్యాదు చేస్తే భుజాలు తడుముకుంటారెందుకు? ‘పోలవరం’ జాతీయ ప్రాజెక్టని విభజన చట్టంలోనే ఉంది సాక్షి, రాజమహేంద్రవరం: అభివృద్ధి పేరుతో పంచాయతీల్లో జరుగుతున్న అవినీతికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండగా ఉంటే ప్రతిపక్షం చూస్తూ కూర్చోదని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత కందుల దుర్గేష్ హెచ్చరించారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల గోల్‌మాల్‌పై తమ పార్టీ విజిలె¯Œ్స విభాగానికి ఫిర్యాదు చేస్తే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించడం సీనియర్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్యకు తగదన్నారు. మూడేళ్లలో ఇసుక, మట్టి ఇలా ప్రతి పనిలో అవినీతి జరిగిందని ప్రజలే చెబుతున్నారన్నారు ఇప్పటికైనా అవినీతిపై విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని, లేదంటే ప్రజలతో కలసి వైఎస్సార్సీపీ ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అనధికార లే అవుట్లపై నిబంధనల ప్రకారం పన్ను వసూలు చే సి చూపించాలన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నిబంధనల ప్రకా రం అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే చందన రమేష్‌కు ప్రాధాన్యం ఇచ్చానని, రూరల్ నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో ఒక్క అభివృద్ధి పనైనా చేశానని పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాకపోయినా ఎంపీలు ఏదో వచ్చినట్లు జబ్బలు చరుచుకుంటున్నారని దుర్గేష్ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ విభజన చట్టంలోనే ఉందన్న విషయం సీనియర్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్యకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ పూనుకోకపోతే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేవా అని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, కాతేరు మాజీ సర్పంచ్ అచంట సుబ్బారాయుడు, నేతలు మెండా సత్తులు, సీతారం, రామకృష్ణ, నరేంద్ర, కర్రి నాయుడు, సప్పా చిన్నారావు, బ్రహ్మాజీరావు పాల్గొన్నారు. -
శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు
పరిగి: బాలిక శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు. ఔను ఇది నిజం. కొందరు పెద్దలు దుప్పటి పంచాయితీ చేసి తీర్మానించిన మొత్తం ఇది. పరిగి మండలం గొల్లపల్లికి చెందిన నాగరాజు పదిహేనేళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బాలికను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తండ్రి లేడు. తన పక్కనే నిద్రిస్తున్న తల్లి దురాగతాన్ని అడ్డుకోలేని నిస్సహాయురాలు. జరిగిన దారుణంపై గురువారం ఉదయమే బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి శీలానికి వేలం కట్టారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
చనిపోయాడని బేరం కుదిరింది కానీ?
మహబూబ్‌నగర్: ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి చనిపోయాడంటూ పరిహారం కోసం పంచాయితీ పెట్టిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్‌లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని జూరాల గ్రామానికి చెందిన బాలస్వామి గత నెల 25వ తేదీన జెన్కో అతిథి గృహ నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి జారి కిందపడ్డాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, గురువారం బాలస్వామి మృతి చెందాడని పుకార్లు లేచాయి. పలు ప్రజాసంఘాల నాయకులు గ్రామస్తులు సంబంధిత కాంట్రాక్టర్ వద్ద పంచాయితీ పెట్టారు. ఈ చర్చల్లో బాధిత కుటుంబానికి రూ.4.50లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు కాంట్రాక్టర్ ఒప్పుకున్నాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు, గ్రామస్తులు ఆస్పత్రికి తరలివెళ్లారు. అయితే, అక్కడి వైద్యులు మాత్రం బాలస్వామి చికిత్స పొందుతున్నాడని, చనిపోలేదని చెప్పటంతో నివ్వెరపోయారు. -
పంచాయతీలకు ఆడిట్ గుబులు!
ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో సర్పంచ్‌ల్లో పెరుగుతున్న ఆందోళన అవకతవకలు బయటపడకుండా జాగ్రత్తలు పడుతున్న కార్యదర్శులు..? విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: పంచాయతీలకు ఆడిట్ గుబులు పట్టుకుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో అటు సర్పంచ్‌లతో పాటు ఇటు కార్యదర్శుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాస్తవానికి పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి ఏటా నిధుల వినియోగం, జమా ఖర్చులపై ఆడిట్ జరగవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను జిల్లా ఆడిట్ శాఖ అధికారులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే 2013-14 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 921 పంచాయతీలకు కేటాయించిన నిధులు వాటి జమా, ఖర్చులు వివరాలపై ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ చేయించుకోవలసి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఆడిట్ జరగని పక్షంలో చట్టం ప్రకారం సంబంధిత పంచాయతీ సర్పంచ్‌పై అనర్హత వేటు వేస్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఈఓపీఆర్డీపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పంచాయతీలో కూడా నిధుల వినియోగంపై ఆడిట్ జరగకపోవడంతో 40 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందా లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చొరవతీసుకోవలసిన ఈఓపీఆర్డీతో పాటు ఆడిట్ శాఖ అధికారులు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో నిధులు వినియోగంపై కార్యదర్శులు సమగ్ర లెక్కలతో ఆడిట్ చేయించుకోవాలని, ఈఓపీఆర్డీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో 921 పంచాయతీలుండగా అందులో 15 మేజర్ పంచాయతీలు, మిగిలిన 906 మైనర్ పంచాయతీలు. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులు వినియోగం, జమా ఖర్చులు ఇతర వివరాలపై ఆడిట్ జరగాల్సి ఉంటుంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి నిధుల వినియోగంపై ఈ ఏడాది నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లే ఆడిట్ చేయించుకోవలసిన బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎన్నికలు నిర్వహించడంతో అంతకుముందు ప్రత్యేకాధికారులు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పంచాయతీల్లో నిధులు వినియోగించారు. అయితే వాటి గురించి తమకేమి తెలుస్తుందని కొత్త సర్పంచ్‌లు చెబుతుండగా... చట్టం ప్రకారం పదవుల్లో ఉండే సర్పంచ్‌లే ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో సర్పంచ్‌లున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 921 పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్టోబర్ మొదటి వారం వరకు పంచాయతీ రికార్డులు, చెక్ బుక్‌లు అందజేయలేదు. అనంతరం జాయింట్ చెక్‌పవర్‌ను రద్దుచేయాలంటూ అక్టోబర్ ఆఖరి వారం వరకు పోరాటం చేశారు. అదే దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ మొత్తంలో నిధులు కేటాయించటంలో పూర్తి స్థాయిలో సర్పంచ్‌లు బాధ్యతలపై దృష్టి సారించారు. ఈ తరుణంలో మరో 40 రోజుల వ్యవధిలో 921 పంచాయతీల్లో నిధులపై ఆడిట్ నిర్వహించాల్సి ఉండడం వారికి కాస్త తలనొప్పిగా మారింది. లెక్కల్లో తేడాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నిధుల వినియోగంలో జరిగిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు పలువురు కార్యదర్శులు పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి సాక్షి, గుంటూరు పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి జరగనున్న రాత పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష నిర్వహణ బాధ్యతలను జిల్లా పరిషత్ కు అప్పగించడంతో సీఈవో సుబ్బారావు, డిప్యూటీ సీఈవో వీరాంజనేయులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈ నెల 23న రాత పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్జీవోల సమ్మె నేపథ్యం లో పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ రాత పరీక్ష యథావిధిగా జరగనుందని ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ నెల 10 నుంచే హాల్ టికెట్లు పొందవచ్చని తొలుత అధికారులు ప్రకటించారు. అయితే సోమవారం వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ఆందోళన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,677 ఖాళీల భర్తీకి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత ఏడాది 30న ఏపీపీఎస్సీ చైర్మన్ బిశ్వాల్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. దీంతో జిల్లాలో 26 పోస్టుల భర్తీకి అవకాశం దక్కింది. 26 పోస్టులకు 32,240 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 50 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీలున్నాయి. అనుమతించిన 26 పోస్టులకు ఓసీ జనరల్ కేటగిరీలో 7, ఓసీ మహిళ-4, బీసీ-ఎ కేటగిరీలో ఒకటి మహిళ, మరొకటి జనరల్, బీసీ-బీలో రెండింటిలో ఒక మహిళ, జనరల్, బీసీ-సీలో జనరల్, బీసీ-డీలో జనరల్, మహిళ, బీసీ-ఈ లో జనరల్, ఎస్సీలో రెండు జనరల్, రెండు మహిళ, ఎస్టీ కేటగిరీలో రెండింటిలో జనరల్, మహిళ పోస్టులున్నాయి. వికలాంగుల కోటాలో ఓ పోస్టు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్ళ వరకు, వికలాంగులకు 46 ఏళ్ళ వరకు వయోపరిమితి ఉండటంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం మార్చి 24న జిల్లా స్థాయిలో ర్యాంకింగ్ జాబితాలు తయారు చేయనున్నార. -
అగ్గిపెట్టెకు ఆరు కిలోమీటర్లు!
ఇంటికి అతిథులొచ్చారు.. ఇంట్లో టీ పొడి నిండుకుంది.. పొరుగునే ఉన్న దుకాణం నుంచి టీ పొడి తెప్పిస్తారు. బంధువులకు టీ నీళ్లయినా ఇస్తారు. ఇది పరిపాటి.. కానీ ఆ గ్రామస్తులు కాస్త మర్యాద చేయడానికైనా ఆరు కిలోమీటర్లు అడవిన పడి నడవాల్సిందే. టీ పొడికే కాదు.. ఆమాటకొస్తే అగ్గిపెట్టెకైనా అంత దూరమూ వెళ్లి రావాల్సిందే. కొయ్యూరు మండలం రామ్‌నగర్ గ్రామస్తుల అవస్థ ఇది. పాలకులు, అధికారులకు పట్టని దయనీయ పరిస్థితి ఇది. రామ్‌నగర్ (కొయ్యూరు), న్యూస్‌లైన్: పేరుకే అది ఊరు.. అదీ గ్రామమేనంటే తెలిసిన వారు ఊరుకోరు. అంత అధ్వానంగా ఉంది రామ్‌నగర్ తీరు.. కనీస వసతులు లేక ఈ గ్రామస్తులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఏ వసతులూ లేనేలేవు. అగ్గిపెట్టె కావాలన్నా గ్రామస్తులు ఆరు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఆడాకుల పంచాయతీలోని రామ్‌నగర్ విస్తీర్ణంలో చిన్నదైనా సమస్యల్లో అతి పెద్దది. ఇక్కడ 25 వరకు ఇళ్లున్నాయి. గ్రామస్తుల్లో అధిక శాతం చేపల వేటను సాగిస్తున్నారు. వారిలో గిరిజనేతరులు అధికంగా ఉన్నారు. గ్రామానికి సరైన మార్గం లేదు. మెయిన్‌రోడ్డు నుంచి తగిలే మట్టి రోడ్డునుంచి ఆరు కిలోమీటర్ల దూరం నడిస్తే ఈ ఊరొస్తుంది. అది కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పాడైంది. గ్రామస్తులు శ్రమదానం చేసి తర్వాత బాగు చేసుకున్నారు. ఇక్కడి గిరిజనేతరులకు ఇళ్లు రాకపోవడంతో వారు సొంత ఖర్చులతో గుడిసెలు వేసుకున్నారు. కనీసం ఓ దుకాణమైనా లేకపోవడంతో వీరు ప్రతి చిన్న అవసరానికీ ఆరు కిలోమీటర్ల ‘చేరువ’లో ఉన్న చోద్యం గ్రామానికి నడుచుకు రావాల్సిందే. తాండవ దాటాల్సిందే.. అనారోగ్యం సోకితే చాలు ఈ గ్రామస్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే వారు నావ ద్వారా తాండవ జలాశయం దాటి అవతల ఒడ్డునున్న జాలారిపేటకు వెళ్తారు. అక్కడ నుంచి ఆటోలు ఎక్కి నాతవరం మండలంలో వైద్యం చేయించుకుంటారు. లేదా పది కిలోమీటర్ల దూరంలోని కంఠారం వెళ్లి చికిత్స పొందుతారు. బోర్లు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో వేసవి వస్తే మంచినీటికి నానా అవస్థలు పడాలని గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడు చెప్పండి.. ఇది గ్రామమేనా? -
సాయంత్రమైతే..సై‘ఖతం’!
జలుమూరు, న్యూస్‌లైన్: మండలంలో శివారు పంచాయతీ కరకవలస కేంద్రం గా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సాయంత్రమైతే చాలు.. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అటు హిరమండలం మండలం రెల్లివలస, అక్కారాపల్లి రేవుల్లో ట్రాక్టర్లు పెట్టి..కరకవలస మామిడి, జీగి తోటల్లో ఇసుకను పోగులుగా వేస్తున్నారు. చీకటి పడితే..రవాణా చేస్తూ..లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌తో ఇసుకను తెచ్చేందుకు సంబంధిత యజమానులకు రూ.500 నుంచి రూ.700 ఇస్తున్నారు. మూడు ట్రాక్టర్ల లోడులను ఒక లారీలో వేసి..విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాతపట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ లోడు ఇసుకను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పగటిపూట అయితే..రెవెన్యూ, పోలీస్ అధికారుల నుంచి తప్పించుకోవడం కష్టసాధ్యమని భావించి..రాత్రిపూట రవాణా సాగిస్తున్నారు. ఎక్కువగా కరకవలస, రెల్లివలస, అంబావిల్లికి చెందిన ఇసుక అక్రమార్కులు ట్రాక్టర్లను లీజుకు తీసుకుని దందా సాగిస్తున్నారని భోగట్టా. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి..ఇసుకాసురుల ఆటకట్టించాలని..నదీమతల్లుల గర్భశోకాన్ని ఆలకించాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని తహశీల్దార్ వై.శ్రీనివాసరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. గతంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా ఉండేదని..గ్రామాల్లో దండోరా వేయించి, ప్రత్యేక నిఘా ఉంచి..నిలుపుదల చేశామని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేసి..దాడులు నిర్వహిస్తామన్నారు. -
పడకేసిన పల్లె ప్రగతి
సాక్షి, కొత్తగూడెం పాలకవర్గాలు ఏర్పడినా నిధుల లేమితో పల్లెలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. పలు సమస్యలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లాలోని పంచాయతీల్లో పనులకు రూ.17 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు చూపిస్తున్నా చాలా మంది సర్పంచ్ల ఖాతాలో ఈ నిధులు పడలేదు. దీంతో పదవి చేపట్టి ఐదునెలలు కావస్తున్నా సర్పంచ్‌లు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలారు. జిల్లాలో మొత్తం 758 పంచాయతీలున్నాయి. ఇందులో మోతుగూడెం, కూనవరం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, అశ్వారావుపేట, సారపాక, బూర్గంపాడు, గార్ల, బయ్యారం, వైరా, తల్లాడ, కల్లూరు, పెద్దతండా, నేలకొండపల్లి మేజర్ పంచాయతీలు. కాగా, జిల్లాలో 115 పంచాయతీలకు అసలు సొంత భవనాలే లేవు. దీంతో అద్దెభవనాల్లో పాలకవర్గాల సమావేశాలు సాగుతున్నాయి. అలాగే ఉల్వనూరు, పెనగడప, మర్రిగూడెం, రాయపట్నం, భగవత్వీడుతండా పంచాయతీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మరమ్మతుల కోసం రూ. 18 లక్షలు విడుదల చేయాలని జిల్లా నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినా ఇంతవరకు నిధుల ఊసే లేదు. వర్షం వస్తే ఈ భవనాలు జలమయంగా మారుతున్నాయి. సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకార సందర్భంగా వారి ఖర్చుతోనే వీధి దీపాలు వేయించారు. అయితే ఆ డబ్బులు కూడా ఇంతవరకు వారి ఖాతాలో పడలేదు. దీపాలు పోయినచోట మళ్లీ వేసే దిక్కులేకపోవడంతో పల్లె వీధులు అంధకారంగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ రహదారులు కోతకు గురయ్యాయి. కనీసం వీటిని నిర్మించడానికి కూడా పంచాయతీలకు నిధులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు రూ. 17 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంటున్నా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. సాంకేతిక సమస్యలు, కొంత మంది సర్పంచ్ల ఖాతాల్లో తప్పులు దొర్లడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. పలువురు సర్పంచ్‌లు ఖాతాలో పడిన కొద్ది మొత్తం నిధులతో కేవలం పారిశుధ్య పనులు చేయించేందుకే పరిమితమయ్యారు. మేజర్ పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పినపాక నియోజకవర్గంలో 52 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. టీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ నిధులు వచ్చినా వాటితో పెద్దగా అభివృద్ధి పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. నిధుల కొరతతో పినపాక, అశ్వాపురం పంచాయతీల పరిధిలో కనీసం డ్రైనేజీల పూడిక కూడా సర్పంచ్‌లు తీయించలేకపోతున్నారు. చింతకాని మండల పరిధిలోని బస్వాపురం, చింతకాని, బొప్పారం, జగన్నాథపురం గ్రామాల్లో పంచాయతీ నిధులు సరిపడినన్ని లేక అభివృద్ధిపనులు కుంటుపడుతున్నాయి. ఎర్రుపాలెం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు టీఎఫ్సీ నిధులు సర్పంచ్ల ఖాతాలో పడలేదు. బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం గ్రామాల్లో పంచాయతీ నిధుల కొరతవల్ల తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట, రేగళ్లపాడు, పాకలగూడెం పంచాయతీల్లో వర్షాలకు రోడ్లు కోతకు గురయ్యాయి. వీటికి కల్వర్టులు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. నిర్మాణ పనులకు నిధులు విడుదల కాకపోవటంతో సమస్య తీరడం లేదు. బ్లీచింగ్ కొనేందుకు కూడా నిధులు లేకపోవటంతో అనేక పంచాయతీలలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. తల్లాడ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కొణిజర్ల మండలానికి మంజూరైన నిధులతో పంచాయతీల్లో పారిశుధ్య పనులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొణిజర్లలో సైడ్‌డ్రైన్ పూడిక తీయకపోవడంతో డ్రైనేజి నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. జిల్లా అధికార్లు, మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. ఏన్కూరు పంచాయతీలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన రహదారిని శుభ్రం చేయించకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఇల్లెందు నియోజకవర్గంలో పలు పంచాయతీల పరిధిలో మంచినీటి పథకాల మోటార్లు కాలిపోయాయి. అయితే వీటికి మరమ్మతులు చేయించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు గ్రామాల్లో ఏరులాపారుతోంది. మేజర్ పంచామతీల్లో సైతం పంచాయతీ నిర్వహణ వంటి ఖర్చులకే జనరల్ ఫండ్ సరిపోతుందని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. ఖమ్మంరూరల్ మండలంలోని పెద్దతండా మేజర్ పంచాయతీకి నిధులున్నా పాలక వర్గంలో ఉన్న వర్గపోరుతో ఏపని చేయలేని పరిస్థితి నెలకొంది. అదే విధంగా కూసుమంచి పంచాయతీలో కూడా పనులు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. పాలేరు ని యోజ కవర్గ వ్యాప్తంగా 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. కోటికి పైగా మంజూరయ్యాయి. ఈ నిధులు ఖాతాలో పడకపోవడంతో సర్పంచ్‌లు పనులు చేపట్టలేకపోతున్నారు. కొత్తగూడెం మండలంలోని కారుకొండ, చుంచుపల్లి, రాఘవాపురం పంచాయతీల పరిధిలో డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. తాగునీటి పైపుల్లో కూడా ఈనీరు కలుస్తోందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పంచాయతీలకు సరిపడ నిధులు లేక పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. రఘునాథపల్లి మండలంలోని చిమ్మపుడి పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. వర్షం వస్తే కార్యాలయంలోని రికార్డులు, ఫర్నీచర్ తడుస్తున్నాయి. శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండడంతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట, చండ్రుగొండ పంచాయతీల్లో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వీధులు కంపుకొడుతున్నాయి. భారీ వర్షాలకు శివారు కాలనీలు గుంటలమయంగా మారాయి. అయితే ఉన్న నిధులను శానిటేషన్‌కు వినియోగిస్తుండడంతో ప్రధాన పనులను అసలు సర్పంచ్‌లు పట్టించుకోవడం లేదు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయితీ పరిధిలో అన్ని కాలనీల్లో గోదావరి మంచినీటి సమస్య వేధిస్తోంది. మంచినీటి సమస్యను పరిష్కరించటానికి నిర్మించిన రెండు వాటర్ ట్యాంకులు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. దీంతో పాటుగా కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు లేక మట్టిరోడ్లే దర్శనిమిస్తున్నాయి. శివారు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగుగుంటలు ఏర్పడి కాలనీ వాసులు నానాబాధలు పడుతున్నారు. -
సమైక్యానికి జై
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం సమైక్య నినాదం మారుమోగింది. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామ సభలు నిర్వహించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, విద్యార్థులు, నిరుద్యోగుల తోపాటు అన్ని వర్గాలకు సమస్యలు ఏర్పడతాయని ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేయించారు. ఈ కాపీలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ద్వారా జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌కు పంపించారు. అనంతరం ఆ తీర్మానాల కాపీలను ఫ్యాక్స్ ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రాష్ట్ర విభజనకు సహకరించిన నేతల (సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనా రాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తదితరుల ) దిష్టిబొమ్మలను వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్వర్యంలో కళామందిర్ సెంటరులో, కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో మంగళగిరిలో , గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లిలోని బంగ్లా సెంటరులో దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాచర్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యానికి మద్దతుగా, విభజనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారు. గుంటూరులో మానవహారం విద్యానగర్,(గుంటూరు) : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అర్బన్ కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హిందూ కళాశాల సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. -
నిధుల వరద
సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామ పంచాయతీలకు శుభవార్త. పాలకవర్గాలు లేకపోవడంతో రెండేళ్లుగా వెలవెలబోయిన పంచాయతీలకు మంచిరోజులొచ్చాయి. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావడంతో అభివృద్ధి నిధుల విడుదలకు కేంద్రం పచ్చజెండా ఊపిం ది పంచాయతీలకు రావాల్సిన 13వ ఆర్థిక సంఘం (టీఎఫ్సీ) నిధులతోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లాకు రూ.22.8 కోట్లు విడుదలయ్యాయి. రెండేళ్లుగా గల్లాపెట్టె ఖాళీకావడంతో అభివృద్ధి కుంటుపడింది. తాజాగా నిధుల మంజూరు ఊరటనివ్వనుంది. త్వరలో ఖాతాల్లోకి.. టీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ నిధులు పంచాయతీ శాఖ, జిల్లా పరిషత్‌కు వేర్వేరుగా విడుదలయ్యాయి. 13వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.11.79 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా రూ.3.86 కోట్లు జిల్లా పంచాయతీ శాఖకు విడుదలయ్యాయి. అదేవిధంగా జిల్లా పరిషత్ కు 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.5.07కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా రూ. 2.08 కోట్లు విడుదలయ్యా యి. జిల్లా పరిషత్‌కు వచ్చిన నిధులతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో భాగంగా చేపట్టే పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నిధులను గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా పంచాయతీ శాఖకు విడుదలైన నిధులను మాత్రం నేరుగా పంచాయతీలకే ఇవ్వనున్నారు. ఇందుకుగాను పంచాయతీల వారీగా ఏ మేరకు నిధులివ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు కే టాయిస్తామని జిల్లా పంచాయతీ శాఖ అధికారి వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పంచాయతీలకు ఊరట
సాక్షి, కరీంనగర్: ప్రత్యేక అధికారుల పాలనలో నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడడంతో ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేస్తుండడం ఊరటనిస్తోంది. ఈ నిధులతో గ్రామాల్లో రెండేళ్లుగా తిష్టవేసిన సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం లభించనుంది. జిల్లాలోని 1207 గ్రామపంచాయతీలకు ఇటీవల రూ.20 కోట్ల వరకు మంజూరయ్యాయి. జిల్లాలకు 13వ ఆర్థిక ప్రణాళిక కింద రూ.15.02 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.4.94 కోట్లు విడులయ్యాయి. 13వ ఆర్థిక ప్రణాళిక కింద మొదటి విడత నిధులు గతంలోనే విడుదల కాగా, రెండవ విడత నిధులు విడుదలయ్యే సమయానికి అప్పటి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో గండి పడింది. గ్రామపంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో ఈ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా రావడంతో పల్లెలు కొత్త కళను సంతరింకునే వీలు కలుగుతుంది. గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధిదీపాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలల నిర్వహణ తదితర అవసరాలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం మాత్రమే నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం నిధులను ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేయాలి. ఈ నిధులతోపాటు పంచాయతీలకు గ్రాంట్ల రూపంలో అందనున్నాయి. సీనరేజీ, తలసరి ఆదాయం, వృత్తిపన్ను గ్రాంటు ఆయా పంచాయతీల ఖాతాల్లో జమకానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీలకు నిధులు కేటాయిస్తారు. అన్నీ కలిసి చిన్న పంచాయతీలకు రూ.50 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.3-5 లక్షల వరకు సమకూరుతాయి. ఈ నిధులతో పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. -
పంచాయతీ ‘లెక్క’ చెప్పాల్సిందే!
యాచారం, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టాలని కిందిస్థాయి సిబ్బందిని పురమాయిస్తోంది. నిధులులేక అభివృద్ధి పనులు కుంటుపడుతున్న ఈ పరిస్థితుల్లో.. పంచాయతీలను పటిష్ట పరిచేందుకు పన్నుల వసూళ్లే ఉత్తమ మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో వసూలయ్యే పన్నుల వివరాలను ప్రతి నెలా 5వ తేదీలోగా అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిసర ప్రాంతాలు నగరానికి సమీపంలో ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్లు, బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారు. అయితే నిబంధనల ప్రకారం అనుమతులు పొందకపోవడంతోపాటు పన్నులు కూడా చెల్లించడం లేదు. దీంతో పెద్దఎత్తున పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అదేవిధంగా ఇంటి, నీటి తదితర పన్నులు సక్రమంగా వసూలు కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఉన్నతాధికారులు గ్రామాల్లో ఇంటి, నీటి పన్నులతోపాటు వెంచర్లు, గృహ నిర్మాణాలకు సంబంధించిన పన్నుల వసూళ్ల వివరాలను ప్రతి నెల తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్న వారికి నోటీసులు పంపి నిర్దేశిత ఫీజు వసూలు చేయడంతోపాటు మిగతా పన్నులు సక్రమంగా చెల్లించేలా అవగాహన కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో (2013 ఏప్రిల్ -సెప్టెంబర్) గ్రామాల్లో వసూలు చేసిన పన్నుల వివరాలను తెలియజేయాలని, అది కూడా వారం రోజుల్లోగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలను ఆదేశించారు. ఇకపై ప్రతి నెల క్రమం తప్పకుండా 5వ తేదీలోపు వసూలైన పన్నుల లెక్కలు పంపించాలని కూడా స్పష్టం చేశారు. వివరాలు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల్లో 2012-13 సంవత్సరానికి గాను వివిధ పన్నుల రూపంలో రూ.29,81,320 వసూలు కావాల్సి ఉండగా, కేవలం 12శాతం మాత్రమే వసూలయ్యాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు పన్నుల బకాయిలపై దృష్టిపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు వెంటనే పన్నుల వసూళ్ల వివరాలను అందజేయాల్సిందిగా ఈఓఆర్డీ శంకర్ నాయక్ పం చాయతీ కార్యదర్శులను పురమాయించారు. ఇన్చార్జి బాధ్యతలతో కార్యదర్శుల ఇబ్బందులు ఇదిలా ఉంటే, ఒక్కొక్కరు మూడేసి గ్రామాల బాధ్యతలను చూస్తున్నందున పన్నుల వసూళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు 20మంది కార్యదర్శులు ఉండాలి. అయితే కేవలం ఆరుగురిని మాత్రమే నియమించారు. నలుగురు పర్మనెంట్ కార్యదర్శులు కాగా మిగతా ఇద్దరు కాంట్రాక్టు పద్ధతిన కొనసాగుతున్నారు. వీరిలో యాచారం కార్యదర్శి (పర్మనెంట్) లక్ష్మయ్య ఈ నెల 30న పదవీ విరమణ పొందుతుండగా, గునుగల్ కార్యదర్శి రాములుకు ఆరోగ్యం సహకరించక ఆస్పత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం 20 గ్రామాల్లో కేవలం నలుగురు కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. పన్నులు సక్రమంగా వసూలు చేయడానికి, లెక్కలు చెప్పడానికి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది పన్నుల వసూళ్ల వివరాల కోసం ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రతి నెల 5వ తేదీలోపు వివరాలు తెలి యజేయాలని ఆదేశాలు వచ్చాయి. గ్రామా ల్లో చూస్తే పన్నుల వసూళ్ల శాతం తక్కువగా ఉంది. బకాయిలతోపాటు ప్రతి నెలా పన్నులు సక్రమంగా వసూళ్లు చేయాలని కార్యదర్శులను ఆదేశించాం. సర్పంచ్‌లు, ప్రజలు ఇందుకు సహకరించాలి. పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసేందుకు వెనుకాడం. - శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం -
‘జాయింట్’ పంచాయ(యి)తీ !
సాక్షి, మచిలీపట్నం : కాంగ్రెస్ సర్కార్ తీరుతో గ్రామ పంచాయతీలకు ఇబ్బందులు తప్పడంలేదు. తమ ఊరిని బాగుచేసుకోవాలనే కోటి ఆశలతో పదవులు చేపట్టిన నూతన పాలకవర్గాలకు ప్రభుత్వ తీరు రుచించడంలేదు. వరుస అవరోధాలతో పల్లెల్లో అభివృద్ధి అడుగంటింది. తాజాగా ప్రభుత్వం జిల్లాలోని పంచాయతీలకు రూ.20 కోట్ల నిధులు మంజూరుచేసినా జాయింట్ చెక్‌పవర్‌తో సమస్యలు తప్పేలా లేవు. దీనిపై తుది కసరత్తు పూర్తిచేసిన జిల్లా పంచాయతీ అధికారి ఆయా పంచాయతీలకు జరిపిన కేటాయింపులను జిల్లా ట్రెజరీ(ఖజానా)కి నివేదించారు. నిధుల కేటాయింపు జరిగినా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో చెక్కులపై సర్పంచి, కార్యదర్శి ఉమ్మడి సంతకాలు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. జిల్లాలో 970పంచాతీలకు గానూ ఇటీవల మూడు దశల్లో 968 పంచాతీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెల్సిందే. 2006లో ఎన్నికలు జరిగిన పంచాయతీలకు 2011తో పదవీకాలం తీరింది. అయినా దాదాపు రెండేళ్లపాటు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనతోనే కాలక్షేపం చేసింది. దీంతో గత రెండేళ్లలో జిల్లాలోని పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.40కోట్లు ప్రభుత్వ నిధులు రాకుండాపోయాయి. దీనికితోడు గత 2006ఎన్నికల్లో 109పంచాయతీలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 134పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికల వ్యయం లేకుండా ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక పారితోషికం అందించే విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడిన మూడు నెలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాకు కొద్ది రోజుల క్రితం రూ.20కోట్లు విడుదలయ్యాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15కోట్లు, స్టేట్ ఫైనాన్స్ నిధులు రూ.5కోట్లు కేటాయించారు. కాగా, పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడిన 15రోజుల్లోనే పంచాయతీ కార్యదర్శి నుంచి అటెండర్ వరకు సమ్మెబాట పట్టారు. ఆగస్టు 12 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జిల్లాలోని పంచాయతీ సిబ్బంది సమ్మెబాట పట్టడంతో పల్లెల్లో అభివృద్ధితోపాటు నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పంచాయతీ ఉద్యోగులు సమ్మెబాట వీడి విధుల్లోకి చేరడంతో ప్రభుత్వం కేటాయించిన రూ.20కోట్ల నిధులను ఆయా పంచాయతీలకు కేటాయించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు జనాభాలోని తలసరి(తలకు ఒక్కింటికి) రూ.52, స్టేట్ ఫైనాన్స్ నిధులు తలసరి రూ.18చొప్పున కేటాయింపులు జరిపినట్టు జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ సాక్షికి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయా పంచాయతీల వారీగా కేటాయించిన నిధుల వివరాలను జిల్లా ట్రెజరీకి పంపామని ఆయన తెలిపారు. ఉమ్మడి సంతకం పిటలాటకం.. ప్రభుత్వ తీరు ఒకచేత్తో పెట్టి మరో చేత్తో మొట్టినట్టు ఉందని జిల్లాలోని పంచాయతీల సర్పంచులు మండిపడుతున్నారు. సర్పంచుల చెక్ వపర్‌కు ఉమ్మడి సంతకం(కార్యదర్శుల జాయింట్ సిగ్నేచర్) మెలిక పెట్టడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కును కాలరాస్తూ ప్రభుత్వం జాయింట్ చెక్‌పవర్ పద్ధతి పెట్టడాన్ని సర్పంచులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది కొత్త వివాదాలకు తెరతీస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
పంచాయతీలకు ‘సమ్మె’ పోటు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పంచాయతీల పరిస్థితి. రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గిన పంచాయతీలకు జూలైలో జరిగిన ఎన్నికల్లో పాలకవర్గాలను ఎన్నుకున్నారు. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సమ్మె కారణంగా నిధులు అందుబాటులో లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఎటు చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పారి శుద్ధ్యం లోపించి కంపుకొడుతున్నాయి. వీధి దీపాలు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది. రోడ్లు, తాగునీటి సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగి సిన మరుసటి రోజు నుంచే సమైక్య ఉద్యమం జిల్లాలో ఊపందుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెబాట పట్టారు. దీంతో పంచాయతీల్లో అసలు ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయన్న లెక్కలు వారికి తెలియకపోగా రావలసిన నిధులకు బ్రేక్ పడింది. ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహక నిధులు జిల్లాలో 921 పంచాయతీలకు వాటి పరిధిలోని 8,764 వార్డులకు ఈ ఏడాది జూలై 23, 27 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 131 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆయా పంచాయతీల్లో ఎన్నికల ఖర్చు లేకపోవడంతో గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైన మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.5 లక్షల వరకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 131 పంచాయతీలూ మైనర్ పంచాయతీలు కావడంతో ఒక్కొక్క పంచాయతీకి రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు రూ 6.55 కోట్లు రావలసి ఉంది. మరో రూ 2 కోట్ల వరకు నిధులు పంచాయతీల్లో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను, సీనరేజీ పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులతో పంచాయతీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు చేపడతారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుంచే జిల్లాలో సమైక్య ఉద్యమం ఊపందుకోవడం పంచాయతీలకు గొడ్డలిపెట్టుగా మారింది. ఎంపీడీఓలు, ఖజానా శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు సమ్మెలో ఉండడంతో నిధులున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయిన సేవలు.. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో ఉద్యోగులంతా ఆగస్టు మొదటి వారంలో సమ్మెబాటపట్టారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడికలు తీయాలన్నా, తాగునీటి పైపులైన్లు మరమ్మతులు చేయించాలన్నా, వీధి లైట్లు వెలగించాలన్నా పంచాయతీల్లో నిధులు లేకపోవడం, ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువై సర్పంచ్‌లు అప్పులు పాలైన తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి రావడం వారికి భారంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఇంటి పన్ను ఎలా వసూలు చేయాలో తెలియని పరిస్థితిలో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. బ్లీచింగ్ చల్లేందుకు ప్రతి పంచాయతీకి కనీసం రూ2 వేల నుంచి రూ3 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సొంత నిధులు వెచ్చిస్తే తీర్మానాలు లేకుండా చేసిన పనులకు బిల్లులు వస్తాయా...? రావా...? అన్న ప్రశ్నలు వారిలో తలెత్తుతున్నాయి. రెండేళ్ల పాటు రాజకీయ నిరుద్యోగంతో విసిగెత్తిపోయిన గ్రామస్థాయి నాయకులు పంచాయతీ ఎన్నికలు ప్రకటించగానే పరుగులు పెట్టి పోటీ చేసి గెలుపొందినప్పటికీ ఆదిలోనే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఓ వైపు నిధులు విడుదల కాక, మరోవైపు బాధ్యతలు పూర్తి స్థాయిలో అందకపోవటంతో వారి బాధను బయటకు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. -
యువకుని హత్య
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: పొలం గట్టు పంచాయతీ నేపథ్యంలో ఓ యువకుడిని పెద్దనాన్న, సమీప బంధువులు కొట్టి చంపారు. రఘునాధపాలెం మండలంలోని మల్లేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం.. రఘునాధపాలెం మండలంలోని మల్లేపల్లికి చెందిన గండు రామారావు(32)కు, అతని పెద్దనాన్న గండు భూషయ్యకు మధ్య పొలం గట్టు విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. వారిద్దరూ సోమవారం రాత్రి మద్యం మత్తులో గట్టు పంచాయతీ విషయమై ఘర్షణ పడ్డారు. వారిని స్థానికులు విడదీసి ఎవరింటికి వారిని పంపించారు. రామారావు ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత కొదిసేపటికి.. భూషయ్య, అతని కుమారుడు బాబూరావు, అల్లుడు పొట్టపల్లి ఆసిన్ కలిసి రామారావు ఇంటికి వెళ్లి, ‘గట్టు పంచాయతీ విషయంలో మమ్మలిన ఇష్టమొచ్చినట్టుగా తిడతావా...?’ అంటూ, ఇంటి తలుపులను పగులగొట్టి ఘర్షణకు దిగారు. దీనిపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడేమోనని భావించిన భూషయ్య కుటుంబీకులు రాత్రి పది గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, తమపై (రామారావు) దాడి చేసినట్టుగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వారంతా ఇంటికి బయల్దేరారు. వారికి మార్గమధ్యలో.. (దసరా ఉత్సవాలకు వెళ్లి వస్తున్న) రామారావు తారసపడ్డాడు. అక్కడ వారి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. భూషయ్య, అతని కుమారుడు బాబూరావు, అల్లుడు ఆసిన్, భార్య సావిత్రి, మరో వ్యక్తి నాగేశ్వరరావు కలిసి రామారావుపై కరల్రతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు అర్ధరాత్రి తర్వాత మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామారావు భార్య రేణుక మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. రామారావు దంపతులకు పదేళ్లలోపు వయసున్న కూతురు, కుమారుడు ఉన్నారు. వెంటాడుతున్న విషాదం.. రామారావు హత్య జరిగిన సోమవారం రోజున ఆయన భార్య ఇంటి వద్ద లేరు. దసరా పండుగకని ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. రామారావు చిన్నతనంలోనే తల్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. తండ్రి కూడా.. ఖమ్మంలో రైలు ఎక్కుతూ జారిపడి మృతిచెందాడు. ఇప్పుడు రామారావు కూడా ప్రాణాలు కోల్పోయాడు. -
విలీనం వద్దు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గ్రేటర్లో శివారు పంచాయతీల విలీనంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో జిల్లాలోని 35 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ డంపై జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని శ్రీధర్‌బాబు ప్రస్తావించారు. గ్రేటర్లో పంచాయతీల విలీనంపై జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ అంశంపై డీఆర్సీ సమావేశంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని సీఎం దృష్టికి తెచ్చారు. విలీన పంచాయతీలను ముందుగా నగర పంచాయతీ, మున్సిపాలిటీ, ఆ తర్వాత జీహెచ్ఎంసీలో కలిపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శ్రీధర్‌బాబు వాదనతో ఏకీభవించిన ప్రసాద్ కుమార్.. పంచాయతీల విలీనంతో జిల్లా ఉనికి దెబ్బతింటుందని, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయపార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. పంచాయతీల విలీనంపై పునరాలోచన చేయాలని కోరారు. మంత్రుల వాదనను ఓపిగ్గా విన్న సీఎం కిరణ్.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలావుండగా.. గ్రేటర్లో పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 17గ్రామాల ప్రతినిధులు కోర్టుకెక్కారు. దీనిని శుక్రవారం విచారించిన ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.