ఇంటికి అతిథులొచ్చారు.. ఇంట్లో టీ పొడి నిండుకుంది.. పొరుగునే ఉన్న దుకాణం నుంచి టీ పొడి తెప్పిస్తారు. బంధువులకు టీ నీళ్లయినా ఇస్తారు. ఇది పరిపాటి.. కానీ ఆ గ్రామస్తులు కాస్త మర్యాద చేయడానికైనా ఆరు కిలోమీటర్లు అడవిన పడి నడవాల్సిందే. టీ పొడికే కాదు.. ఆమాటకొస్తే అగ్గిపెట్టెకైనా అంత దూరమూ వెళ్లి రావాల్సిందే. కొయ్యూరు మండలం రామ్‌నగర్ గ్రామస్తుల అవస్థ ఇది. పాలకులు, అధికారులకు పట్టని దయనీయ పరిస్థితి ఇది.
రామ్‌నగర్ (కొయ్యూరు), న్యూస్‌లైన్:
పేరుకే అది ఊరు.. అదీ గ్రామమేనంటే తెలిసిన వారు ఊరుకోరు. అంత అధ్వానంగా ఉంది రామ్‌నగర్ తీరు.. కనీస వసతులు లేక ఈ గ్రామస్తులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఏ వసతులూ లేనేలేవు. అగ్గిపెట్టె కావాలన్నా గ్రామస్తులు ఆరు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఆడాకుల పంచాయతీలోని రామ్‌నగర్ విస్తీర్ణంలో చిన్నదైనా సమస్యల్లో అతి పెద్దది. ఇక్కడ 25 వరకు ఇళ్లున్నాయి. గ్రామస్తుల్లో అధిక శాతం చేపల వేటను సాగిస్తున్నారు. వారిలో గిరిజనేతరులు అధికంగా ఉన్నారు. గ్రామానికి సరైన మార్గం లేదు. మెయిన్‌రోడ్డు నుంచి తగిలే మట్టి రోడ్డునుంచి ఆరు కిలోమీటర్ల దూరం నడిస్తే ఈ ఊరొస్తుంది. అది కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పాడైంది. గ్రామస్తులు శ్రమదానం చేసి తర్వాత బాగు చేసుకున్నారు. ఇక్కడి గిరిజనేతరులకు ఇళ్లు రాకపోవడంతో వారు సొంత ఖర్చులతో గుడిసెలు వేసుకున్నారు. కనీసం ఓ దుకాణమైనా లేకపోవడంతో వీరు ప్రతి చిన్న అవసరానికీ ఆరు కిలోమీటర్ల ‘చేరువ’లో ఉన్న చోద్యం గ్రామానికి నడుచుకు రావాల్సిందే.
తాండవ దాటాల్సిందే..
అనారోగ్యం సోకితే చాలు ఈ గ్రామస్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే వారు నావ ద్వారా తాండవ జలాశయం దాటి అవతల ఒడ్డునున్న జాలారిపేటకు వెళ్తారు. అక్కడ నుంచి ఆటోలు ఎక్కి నాతవరం మండలంలో వైద్యం చేయించుకుంటారు. లేదా పది కిలోమీటర్ల దూరంలోని కంఠారం వెళ్లి చికిత్స పొందుతారు. బోర్లు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో వేసవి వస్తే మంచినీటికి నానా అవస్థలు పడాలని గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడు చెప్పండి.. ఇది గ్రామమేనా?
అగ్గిపెట్టెకు ఆరు కిలోమీటర్లు!
Published Wed, Jan 22 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement