villagers problems
-
చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
మధ్యప్రదేశ్: నరేంద్రమోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని చీతా(చిరుత పులుల్లో ఒక రకం) ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నేషనల్ పార్క్ సమీపంలో గ్రామాల్లోని ప్రజలు ఈ చిరుతల రాకతో భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది ఈ చిరుత కారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుందని, అందువల్ల ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ చాలామంది గ్రామస్తులు తమ భూములను లాక్కుంటారేమోనని భయపడుతున్నారు. ఈ చిరుతుల రాక మధ్యప్రదేశ్‌లోని షియాపూర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తుల్లో లేని భయాలను రేకెత్తించింది. వారిలో ఈ భయాందోళనలకు కారణం...గతంలో సుమారు నాలుగు నుంచి ఐదు గ్రామాలను పార్కు కోసం మార్చడం, అలాగే సుమారు 25 గ్రామాల ప్రజలను తరలించడం వంటివి జరిగాయి. దీంతో వారు తమ భూములను, నివాసాలను కోల్పోయి..ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు ఆ గ్రామానికి సమీపంలోని ఆనకట్ట ప్రాజెక్టు కారణంగా కూడా ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని రామ్‌కుమార్ గుర్జార్ అనే మరో రైతు చెబుతున్నాడు. మీ గ్రామానికి సమీపంలోని పార్కుల్లో చిరుతల రాక గురించి గ్రామస్తుల అభిప్రాయం గురించి ప్రశ్నించగా... జాతీయ ఉద్యానవనం కోసం గ్రామాలను లాక్కున్నారు. ఇప్పుడూ సమీపంలోని కునో నదిపై ఆనకట్ట ప్రాజెక్లు నిర్మించనున్నారు...ఇది మరో 50 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేషనల్ పార్క్‌ల వల్ల పర్యాటకులు పెరిగినప్పటికీ....ధనవంతులే వ్యాపారాలు నిర్వహించుకుంటారని, తమకు ఉపాధి దొరకదని అంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల కోసం తమ భూములను లాక్కుంటారని గ్రామస్తులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: కునో పార్కులో చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..) -
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు ఆ గ్రామాన్నే ఖాళీ చేశారు!
హోసూరు(బెంగళూరు): క్రిష్ణగిరి జిల్లాలో అడవుల విస్తీర్ణం అధికం. కొన్ని గ్రామాల్లో అడవుల్లో విసిరేసినట్లుగా ఉంటాయి. అక్కడికి రోడ్లు ఉండవు. కాలిబాటల్లోనే వెళ్లాలి. మధ్యలో అడవి ఏనుగులు, వన్యమృగాల దాడులు జరుగుతూ ఉండవచ్చు. వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఒక గ్రామాన్నే ఖాళీ చేశారు. డెంకణీకోట సమీపంలోని క్రిష్ణగిరి– ధర్మపురి జిల్లా సరిహద్దుల్లో దట్టమైన అడవిలో ఉండే పుల్లహళ్లి గ్రామం కథ ఇది. ఈ ఊరు పాడుబడిన నివాసాలతో ఖాళీగా దర్శనమిస్తుంది. మొండిగోడలే మిగిలాయి ఒకప్పుడు కళకళ ఒకప్పుడు ఈ పల్లెలో వందకుపైగా కుటుంబాలు ఉండేవి. గ్రామస్థులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఈ గ్రామానికి వెళ్లాలంటే ధర్మపురి జిల్లా పంజపల్లి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగులు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడేవారు. రోజూ బడికి వెళ్లాలన్నా, ఆస్పత్రికి పోవాలన్నా అన్ని కిలోమీటర్లు నడవలేక అలసిపోయేవారు. దీంతో ఈ ఊరివారితో పెళ్లి సంబంధాలు కలుపుకోవాలన్నా వేరేఊరివారు భయపడేవారు. తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రజలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గత్యంతరం లేక గ్రామస్థులు సుమారు ఐదారేళ్ల కిందట ఏకంగా గ్రామాన్నే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడా గ్రామంలో ఒక్క మనిషి కూడా లేక నిర్మానుష్యంగా మారిపోయింది. ఇళ్లు శిథిలావస్థకు చేరుకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామానికి రోడ్లు, ఆస్పత్రి, బడి వంటి వసతులను కల్పించి నివాసయోగం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చదవండి: Job Opportunities: ‘చిప్స్’.. ఇప్పుడు హాట్‌టాపిక్! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు! -
ఊరు మునిగింది.. ఉపాధి పోయింది!
ఈ చిత్రంలో ఆటోలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారు. రుద్రవరం మధ్యమానేరు నిర్వాసిత గ్రామం. ఈ ఊరిలో ఉపాధిహామీ పనులు చూపకపోవడంతో వీరంత ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. మగవాళ్లయితే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డకూలీలుగా మారారు. ఉన్న ఊరిలోనే ఉపాధిహామీ పని చూపెట్టాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. సాక్షి,వేములవాడఅర్బన్: మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామస్తులకు ఉపాధిహామీ పని కరువైంది. గతంలో వంద రోజుల పనులు పూర్తి చేసిన వారు సైతం మధ్యమానేరు నిర్వాసిత గ్రామాలలో ఉన్నారు. అయితే వారంతా ఇప్పుడు ఇతర గ్రామాల్లో పనుల కోసం ఆటోలలో వెళ్తున్నారు. మగవారైతే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారిపోయారు. మరికొందరు వాచ్మెన్స్, సెక్యూరిటీగార్డులుగా పనులు చూసుకుంటున్నారు. పని కరువైన నిర్వాసిత కాలనీలు మిడ్‌మానేరు ముంపునకు గురైన సంకెపల్లి, ఆరెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, చింతాల్‌ఠాణా, చీర్లవంచ, గుర్రవానిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలుగా ఏర్పాటు చేశారు. ఆయా కాలనీవాసులకు ఉపాధిహామీ పనులు పెట్టడం లేదు. ఒకప్పుడు ఐదు, ఆరు ఎకరాలలో పంటలు పండిస్తూ ధర్జాగా బతికిన వీరంతా ఇప్పుడు కుటుంబ పోషణకు ఇతర గ్రామాలకు కూలీలుగా పనులకు వెళ్తున్నారు. పని కల్పించాలని వేడుకోలు ►మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లోని ఉపాధిహా మీ కూలీలకు జిల్లా అధికారులు స్పందించి పనులు చూపెట్టాలని కోరుతున్నారు. ►బ్యాక్ వాటర్ పక్కన చెరువులు, కుంటలు ఏర్పాటు చేస్తే పని దొరుకుతుందని వారు పేర్కొంటున్నారు. ►జిల్లా అధికారులు స్పందించాలని నిర్వాసిత గ్రామాల్లోని ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్న వారు కోరుతున్నారు. గతంలో పనిచేసినం మేము పాత గ్రామం ఉన్నప్పుడు రోజు ఉపాధి హామీ పనికి పోయినం. పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి ఉపాధిహామీ పనులు లేవు. ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలి. – అంగూరి స్వప్న, రుద్రవరం పని చూపెట్టాలి పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి పనులు లేక కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. ఉపాధిహామీ పనులు లేవు, కూలి పని లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. అధికారులు స్పందించి పని చూపెట్టాలి. – పాముల కనకవ్వ, రుద్రవరం పనులకు వస్తలేరు పునరావాసకాలనీల్లోని కూలీలు ఉపాధిహామీ పనులకు ఇతర గ్రామాలకు రమ్మంటే వస్తలేరు. మారుపాక, చంద్రగిరి గ్రామాలకు ఉపాధి పనులకు తీసుకెళ్తామంటే వస్తలేరు. ఇప్పటికైనా వాళ్లు వస్తే ఉపాధిహామీ పనులు కల్పిస్తాం. – నరేశ్ ఆనంద్, ఎంపీడీవో, వేములవాడ చదవండి: Hyderabad: యువతిపై ప్రేమ.. అప్పటికే పెళ్లి నిశ్చయమైందని తెలిసి.. -
దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు..
సాక్షి,మరిపెడ రూరల్(వరంగల్): తాయత్తులు, పూజలు చేస్తానని ఓ దేశ గురువు పేరుతో దొంగ బాబా గ్రామస్తులను భయపెట్టి రూ.80వేలు వసూలు చేశాడు. అతనిపై అనుమానం వచ్చి కొందరు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ గురువుగా బయటపడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలోకి ఈ నెల 25వ తేదీన దేశగురువు పేరుతో ఓ వ్యక్తి తన నలుగురు శిష్యువులతో కలిసి వచ్చాడు. (చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. ) వసతి కోసం అక్కడి సర్పంచ్‌ను ఆశ్రయించగా పాఠశాలలో ఓ గదిని చూపించారు. తన శిష్యులతో కలిసి దేశ గురువు తన గుర్రంపై గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు నీళ్లు అరబోయడంతో పాటు కొబ్బరికాయలు కొట్టారు. ఈ క్రమంలో వితంతువుని పిలిచి నీ కొడుకుకు ప్రాణగండం ఉందని అది పోవాలంటే తాయత్తు కట్టాలని అందుకు రూ. 7 వేలు, పెండ్లి కావడం లేదని మరొకరి ఇంట్లో రూ.5 వేలు, ఆరోగ్య సమస్య అని మరో ఇంట్లో రూ.10 వేలు చొప్పున ఒక్కరోజే రూ.80 వేలు కాజేశాడు. బయట ఊరినుంచి వీరారం వచ్చిన ఓ వ్యక్తి దేశ గురువు నిజస్వరూపం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బయటపడ్డ నిజస్వరూపం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన బూడిగ జంగాలకు చెందిన యాకయ్యగా బాబాను గుర్తించారు. కొందరితో ముఠాగా ఏర్పడి ఓ గుర్రాన్ని రోజుకు రూ. వెయ్యి కిరాయికి తీసుకొచ్చి దేశ గురువుగా యాకయ్య అవతారమెత్తాడు. పలు గ్రామాలు తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరారం గ్రామ బాధితుల ఫిర్యాదు మేరకు యాకయ్య, తన అనుచరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. చదవండి: కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే -
అక్సాన్పల్లిలో చిరుత పులి సంచారం
సాక్షి, జోగిపేట (ఆందోల్): సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అక్సాన్‌పల్లి శివారులో ఆదివారం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన కృష్ణాగౌడ్ తన స్నేహితుడితో కలిసి తన బోరు మోటారు వద్దకు వెళ్లాడు. అక్కడ ఏదో జంతువు చెట్టుపై కదులుతున్నట్లు కృష్ణాగౌడ్‌కు కనిపించింది. అదేంటో అని పరిశీలనగా చూస్తుండగా చిరుత పులి ఒక్కసారిగా చెట్టుపై నుంచి దూకింది. అయితే, అది అక్కడి కాల్వకు అవతలి వైపు ఉండటంతో వారిరువురు ఊపిరి పీల్చుకున్నారు. విషయాన్ని వారు గ్రామస్తులకు తెలియజేయగా, ఆ చిరుత పులిని చూడటానికి చాలామంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అది దూరంగా వెళ్లిపోయింది. చిరుత ఎటువైపు వెళ్లిందో తెలియక, ఎక్కడ గ్రామంలోకి వస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
ఎదురుమొండి...మొండిబతుకులు!
సాక్షి, అవనిగడ్డ : బాహ్య ప్రపంచానికి దూరంగా.. కష్టాలు.. కన్నీళ్లు.. వలస బతుకులకు చేరువగా ఎదురుమొండి దీవుల ప్రజలు దీనావస్థలో కాలంవెళ్లదీస్తున్నారు. పాలకుల హామీలు నీటిమూటలు కాగా.. ఓట్ల రాజకీయం శాపంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ. తమ కష్టాలు కడతేర్చే పాలన కోసం ఈ ప్రాంతం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు. గతంలో ఎదురుమొండి, గొల్లమంద వద్ద జరిగిన పడవ ప్రమాదాల్లో 50 మంది మరణించినా పాలకుల్లో చలనం లేదు. గత ఏడాది నవంబర్‌లో దివిసీమ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా అతీగతీ లేదు. గుంటూరు జిల్లా రాజుకాలువ ప్రజల దయాదాక్షిణ్యాలే ఈ దీవుల సాగు, తాగునీరుకి ఆధారం. దీవుల్లో బంగారు పంటలు పండే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, సాగునీరందక ఐదేళ్లలో రెండు సార్లు పంట విరామం ప్రకటించారు. ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది. గతంలో 50 మంది మృత్యువాత ఎదురుమొండి దీవుల్లో కృష్ణా నదిలో జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 50 మంది మృత్యువాతపడ్డారు. 1990లో ఎదురుమొండి వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది మరణించగా, 2004లో గొల్లమందలో జరిగిన పడవ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. వీరంతా కూలి పనులకు, మండల కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించాలని డిమాండ్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎదురుమొండి దీవులను పట్టించుకోలేదని ప్రజలు చెబుతున్న మాట. వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు ప్రకటించినా.. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం అంశం ప్రధాన అస్త్రంగా సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.45 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా, అనంతరం మహానేత మరణంతో దీని గురించి పట్టించుకున్నవారే లేరు. గత ఏడాది నవంబర్ 21న ఉల్లిపాలెం, చల్లపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా అతీగతీ లేదు. రెండుసార్లు సాగుకు విరామం ఎదురుమొండి దీవుల్లో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మాజీ సైనికులు, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మరో మూడు వేల ఎకరాల అటవీభూమి ఉంది. గుంటూరు జిల్లాలోని రాజుకాలువ వద్ద ఉన్న పంపింగ్ స్కీం నుంచి ఎదురుమొండిలోని చెరువులకు నింపి అక్కడ నుంచి పంట పొలాల సాగుకు రైతులు నీటిని వాడుకుంటుంటారు. 2014 – 15లో రెండేళ్లు సాగునీరందక దీవుల్లో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. 2016 – 17లో అరకొరగా అందిన సాగునీటితో పంటలు సాగుచేసుకున్నారు. గత ఏడాది రాజుకాలువ రైతులు పంపింగ్ పథకాన్ని అడ్డుకోవడం, కృష్ణానది పాయలో వేసిన పైపులైన్ దెబ్బతినడంతో రెండు వేల ఆయకట్టుకుగాను 450 ఎకరాల్లో మాత్రమే సాగుచేయగలిగారు. ఎదురుమొండి రక్షిత మంచినీటి పథకం చెరువు నీరు పసర్లు కమ్ముకోవడంతో దిక్కులేని స్థితిలో ఈ నీటినే వాడుకుంటున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటను చూసి దిగాలుగా ఉన్న రైతులు ఆగని వలసలు ఎదురుమొండి దీవుల్లో సక్రమంగా సాగునీరు అందకపోవడం, ఇతర పనులు లేకపోవడం వల్ల ఈ దీవులకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఎనిమిది నెలలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పనుల కోసం ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తుంటారు. గొల్లమంద, జింకపాలెం, ఎదురుమొండి నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఎదురుమొండి దీవుల్లోని ప్రజల సమగ్ర అభివృద్ధి పథకం కోసం 25 ఏళ్ల క్రితం ఎదురుమొండిలో వేసిన శిలాఫలకం ముళ్లకంప పెరిగి వెక్కిరిస్తోంది. మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా.. ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ పంచాయతీలు ఉన్నాయి. ఎదురుమొండి పంచాయతీలో గొల్లమంద, జింకపాలెం, ఏసుపురం, కృష్ణాపురం, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిమూల, ఎదురుమొండి గ్రామాలు ఉన్నాయి. దీవుల్లోని ఈ మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా ఉండగా, 3,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మత్స్యకారులే. ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ఎదురుమొండి దీవుల ప్రజలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఈ దీవుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నారు. ఈ విషయాన్ని దివంగత శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య పలుసార్లు బాహాటంగానే చెప్పారు. 2009 ఎన్నికల్లో అప్పటి వరకూ మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, చివరిరౌండైన ఎదురుమొండి దీవుల్లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యకు 1504 అధిక్యంతో బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ధప్రసాద్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు కంటే కేవలం 365 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. రెండుసార్లు రెండు వేర్వేరు పార్టీలు మారినా దీవుల ప్రజలు తనను ఆదరించలేదనే కోపంతో ఎదురుమొండి దీవుల గురించి బుద్ధప్రసాద్ పట్టించుకోలేదని కొంతమంది దీవుల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓట్లు వేయలేదని కక్ష గత రెండు ఎన్నికల్లో ఎదురుమొండి దీవుల్లో ప్రజలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదని మా దీవులపై కక్ష పెంచుకున్నారు. అందుకే దీవుల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. రూ.74 కోట్లుతో ఎదురుమొండి వారధి నిర్మిస్తామని సీఎం ప్రకటించినా పనులు ప్రారంభించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే మా దీవులకు మంచి రోజులు వస్తాయి. –నాయుడు అంకరాజు,ఎదురుమొండి, నాగాయలంక మండలం మా తాత కాలం నుంచి రోడ్డు ఉంది ఊరి పుట్టిన దగ్గర నుంచి నాచుగుంట – ఎదురుమొండి రోడ్డు ఉంది. గతంలో రెండు సార్లు వేశారు. ఇప్పుడు అటవీశాఖ అభ్యంతరాలు పెడితే ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. చినుకు పడితే ఈ రోడ్డుపై వెళ్లలేము. నదిలో నావపై నాగాయంక వెళ్లాలంటే 3 గంటల ప్రయాణం. ఎవరన్నా గర్భిణులు ఉన్నా, రోగస్తులున్నా నావపై తీసుకెళ్లాల్సిందే. – సైకం బస్వారావు, నాచుగుంట -
35 గ్రామాలకు ఉప్పునీరే దిక్కు ..
సాక్షి, వాకాడు: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మండలంలోని 35 తీర ప్రాంత గ్రామాల్లో గత ఐదేళ్లుగా ఉప్పు జలగండం పట్టి పీడిస్తోంది. నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. తీరప్రాంత వాసులకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో 68 గ్రామాల్లో 10.5 వేల కుటుంబాలు, 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 204 చేతి పంపులు ఉండగా, వాటిలో 164 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. నిడిగుర్తి, రెడ్డిపాళెం, బాలాజీ నగర్, నిమ్మవానితిప్ప, వేణుగోపాల్‌పురం, నిడిగుర్తి గొల్లపాళెం, శ్రీహరిపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు, అంజలాపురం, కాకివాకం, పంబలి, నిడిగుర్తి, శ్రీపురం, తీపలపూడి, మూలపడవ, రాజ్యలక్ష్మీపురం, మొనపాళెం, వైట్‌కుప్పం, నలగామల, పున్నమానితిప్ప, నిడిగుర్తి గొల్లపాళెం, రెడ్డిపాళెం, మాధవాపురం, ముట్టెంబాక, కల్లూరు, దుర్గవరం, పల్లెపాళెం ఇలా 35 గ్రామాల్లో వేసవి వస్తే సరి త్రాగునీరు ఉప్పునీరుగా మారిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. ఐతే వీరి గురించి అధికార పక్షం నాయకులు గానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వీరికి సురక్షిత మంచినీరు అందించేందుకు వాకాడు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన పాత పైలెట్ ప్రాజెక్టు పట్ల పాలకులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సక్రమంగా అందడంలేదు. అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి మరమ్మత్తులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా తీర గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులు, దాతల చందాలతో మంచినీరు దొరికే ప్రాంతాల్లో గ్రామస్తులే బోరు పాయింట్లు నిర్మించుకుని తాగునీరు తెచ్చుకుంటున్నారు. తీరప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పునీరు పనికిరాదు. మండలంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు వాకాడు స్వర్ణముఖి వద్ద మరో మంచినీటి ప్రాజెక్టు నిర్మించాలని మండల ప్రజలు కోరుచున్నారు. తాగేందుకు ఉప్పునీరే గతి స్నానాలు చేయాలన్నా.. వంట చేసుకోవాలన్నా ఉప్పునీరు కావడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు తాగి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా త్రమే మంచినీళ్లు తాగుతున్నాం. మిగిలిన సమయంలో ఉప్పునీరే తాగుతున్నాం.– నల్లపురెడ్డి మునస్వామిరెడ్డి, వేణుగోపాలపురం ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం గ్రామాల్లో లభిస్తున్న ఉప్పునీరు కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. సిమెంటులో ఉప్పునీరు కలిపితే నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మండలంలోని 35 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. – మునస్వామి, ఓడపాళె ఆందోళన చేసినా పట్టించుకోలేదు గ్రామంలో తాగునీరు ఉప్పునీరుగా మారి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అనేక సార్లు ఆందోళన చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉప్పునీరు తాగే బతుకుతున్నాం.– పోలయ్య మత్స్యకార కాపు, కొండూరుపాళెం -
ఊళ్లో దెయ్యం.. మాకెంతో భయం!
ఊళ్లో దెయ్యం ఉందంటూ కొందరు ఊరినే ఖాళీ చేశారు. ఇటీవల కొన్ని నెలలుగా ఒకే గ్రామానికి చెందిన పలువురు ఎలాంటి రోగాల బారిన పడకుండానే మృతి చెందారు. ఇలా ఎందుకు జరుగుతోంది.. మా ఊరికి ఏమైంది? చేతబడి జరుగుతోందా? లేక దెయ్యమే ఉందా? అంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు. చివరికి దెయ్యమే ఉందని నిర్ధారణకొచ్చి.. ఊరినే ఖాళీ చేసిన సంఘటన సీఎం కేసీఆర్ స్వగ్రామం శివారు ఉప్పలోనికుంటలో వెలుగుచూసింది. సిద్దిపేట రూరల్: దెయ్యం భయంతో సిద్దిపేట రూరల్ మండలంలోని సీఎం కేసీఆర్ సొంతూరు శివారులోని ఉప్పలోనికుంట గ్రామస్తులు ఊరు ఖాళీ చేసిన విషయం చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలోని రాందేవి అనే ఒకే వంశానికి చెందిన వారు పొలాల వద్దే స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. గ్రామంలో మొత్తం వీరివి 20 కుటుంబాలు. అయితే వరుసగా ఆ కుటుంబాల్లో మరణాలు జరుగుతుండటంతో చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోయాయి. దీంతో చాలావరకూ ఇళ్లు తాళాలు వేసి, వ్యవసాయ భూములు బీడులుగా మారి గ్రామం బోసిపోయినట్లు కన్పిస్తుంది. ఇప్పుడు.. గ్రామంలో రాందేవి వంశానికి చెందిన మూడు కుటుంబాల వారు మాత్రమే వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రానికే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. ఇదంతా మూడేళ్ల నుంచే మూడేళ్ల క్రితం రాందేవి భారతి అనే మహిళ చనిపోయింది. అప్పటినుంచి గ్రామంలో ప్రతీ 4 నెలలకు ఒకరు ఎలాంటి అనారోగ్యం లేకుండానే చనిపోతున్నారు. పరీక్ష రాసేందుకు సిద్ధమైన ఓ విద్యార్థిని సైతం తెల్లవారుజామున నిద్రలోనే మరణించింది. ఇటీవల అస్వస్థతకు గురైన ఓ వ్యక్తిని, వింత చేష్టలు చేస్తున్న మరోవ్యక్తిని వైద్యులకు చూపించారు. డాక్టర్లు పరీక్షలు చేసి వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ భూతవైద్యులను ఆశ్రయించారు. దెయ్యం కారణంగానే వీరంతా మరణిస్తున్నారని చెప్పడంతో ఆ గ్రామంలో పూజలు చేయించారు. అయినప్పటికీ మరణాలు ఆగకపోవటంతో గ్రామస్తులందరూ ఊరిని, పొలాలను వదిలి.. చింతమడక, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. రోడ్డున పడ్డాం.. గ్రామంలో మా వంశానికి చెందిన వారందరూ ఎలాంటి కారణాలు లేకుండా చనిపోవడంతో మాకు భయం వేసి చింతమడకలోనే ఉంటున్నాం. భూమిని వదిలిపెట్టడంతో ఉపాధి లేక రోడ్డున పడ్డాం. – రాందేవి నర్సింహులు, ఉప్పలోనికుంట అద్దె ఇంట్లో ఉంటున్నాం.. దెయ్యం ఉందన్న కారణంతో గ్రామం నుంచి వలస వచ్చేశాను. నా నాలుగు ఎకరాల భూమిలో పగలే వ్యవసాయం చేస్తున్నాను. దెయ్యం భయంతో సాయంత్రానికే తిరిగి వస్తున్నాను. – రాందేవి వెంకటయ్య. ఉప్పలోనికుంట -
నీటి కోసం పాట్లు
పల్లెల్లో తప్పని తాగునీటి ఘోస సరైన వర్షాలు లేక ఎండిన బోర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మెదక్ రూరల్: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా...సరైన వర్షాలు లేక పల్లెల్లో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. మెదక్ మండలం పాతూర్, బూర్గుపల్లి, మక్తభూపతిపూర్, అవుసులపల్లి, వాడి, సర్ధన తదితర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో పనులు మానుకొని ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడికి బిందెలు పట్టుకొని పరుగులు పెడుతున్నారు. అయినప్పటికీ అవసరానికి సరిపడ నీళ్లు దొరకడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బోర్లలో నీరున్నా...మోటార్లు చెడిపోయాయి. వీటికి మరమ్మతులు చేయించక పోవడంతో నీటి ఘోస తప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి మెక్కుబమడి తంతుగా వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇవి సరిపోకపోవడంతో గ్రామాల్లో తాగునీటి ఘోస ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. తాము తాగునీటికోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తమ గ్రామాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గోస తప్పడం లేదు వర్షాకాలం వచ్చినా బోర్లలో నీళ్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామంలో ఎండకాలంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. వర్షాకాలం రావడంతో గత రెండు నెలలుగా ట్యాంకర్లు రావడం లేదు. దీంతో తాగునీటికోసం ఇబ్బంది పడుతున్నాం . మా ఇబ్బందులను సార్లు గమనించి త్వరగా సమస్యను పరిష్కరించాలి. - దూరబొయిన రమేష్, పాతూర్. పనులు మానుకోవాల్సిందే తాగునీటికోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నాం. గ్రామంలోని అక్కడక్కడ బోర్లలో కొద్ది కొద్దిగా నీళ్లు వస్తుండటంతో గంటల తరబడి నీళ్లకోసం నిక్షించాల్సి వస్తోంది. దీంతో ఏ పనులు చేసుకోలేక పోతున్నాం. పనులకు పోతే నీళ్లు దొరకడం లేదు. అధికారులు స్పందించి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలి. - నర్సింలు, పాతూర్. -
మంచంపట్టిన తుక్కాపూర్
పలువురికి విషజ్వరాలు పారిశుద్ధ్య లోపమే కారణమంటున్న వైద్యులు కొల్చారం: కొల్చారం మండలం తుక్కాపూర్‌లో వారం రోజులుగా గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్ గ్రామస్తులను పట్టిపీడిస్తున్నాయి. తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వైద్య సేవల కోసం మెదక్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 25మంది విషజ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అసలే కష్టాల్లో ఉన్న తమకు మాయరోగాలు ప్రాణాలమీదికి తెస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రంగంపేట వైద్యాధికారి మురళీధర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యలోపంవల్లే గ్రామంలో రోగాలు వస్తున్నాయని, కాచివడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆయన సూచించారు. -
సమస్యల వలయంలో మాయికోడ్
మంచినీటి పంపులకు మరమ్మతులు కరువు లోపించిన పారుశుద్ధ్యం.. పటించుకోని అధికారులు మనూరు: మండలంలోని మాయికోడ్‌లో సమస్యలు తిష్టవేశాయి. గ్రామంలో 1,997 జనాభా ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం 5 మంచినీటి బోర్లు వేశారు. బోరు మోటార్లు కాలిపోయాయి. ఈ సమస్యకు తోడు మంజీరా నీరు రావడం లేదు. దీంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మండల అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపించారు. సర్పంచ్‌కు కూడా తమ బాధలు పట్టడం లేదన్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదు. ఈ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో తామే స్వచ్ఛందంగా దీపాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. కాలువల్లో మురుగు పేరుకుపోయింది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. చిన్నపాటి వర్షానికే ఊరంతా చిత్తడిగా మారుతోంది. ఫలితంగా దోమద బెడద ఎక్కువ అవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి తమ సమ్యలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్పంచ్ తీరు సరికాదు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాల్సిన సర్పంచ్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ నిధులును తమ సొంత అవసరాలకు వాడుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది. పంచాయతీ అధికారుల తీరు కూడా సరిగ్గా లేదు. సమస్యలను వారు కూడా పట్టించుకోవడం లేదు. - అరుణ్, సీపీఎం నాయకులు, మాయికోడ్ నీళ్లు కోసం తీవ్ర ఇబ్బందులు గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోజూ బిందెలతో పొలాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఊర్లో ఐదారు బోర్లు ఉన్నా అవి పని చేయడం లేదు. బాధలు పట్టించుకునే నాధులే లేరు. - నాగమ్మ, మాయికోడ్ ప్రజల బాధలు చూడలేక.. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న బాధలు చూడలేక తన బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నా. నీటి సమస్య తీవ్రత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. - పోతురాజు బాలయ్య నిధుల కొరతే కారణం గ్రామంలో సమస్యలు ఉన్న విసయం నిజమే. పంచాయతీకి నిధుల కొరత ఉంది. ఈ కారణంగా అభివృద్ధి చేయలేకపోతున్నా. బోరు మోటర్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాం. ప్రధాన సమస్యలను మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - నందునాయక్ సర్పంచ్ -
అగ్గిపెట్టెకు ఆరు కిలోమీటర్లు!
ఇంటికి అతిథులొచ్చారు.. ఇంట్లో టీ పొడి నిండుకుంది.. పొరుగునే ఉన్న దుకాణం నుంచి టీ పొడి తెప్పిస్తారు. బంధువులకు టీ నీళ్లయినా ఇస్తారు. ఇది పరిపాటి.. కానీ ఆ గ్రామస్తులు కాస్త మర్యాద చేయడానికైనా ఆరు కిలోమీటర్లు అడవిన పడి నడవాల్సిందే. టీ పొడికే కాదు.. ఆమాటకొస్తే అగ్గిపెట్టెకైనా అంత దూరమూ వెళ్లి రావాల్సిందే. కొయ్యూరు మండలం రామ్‌నగర్ గ్రామస్తుల అవస్థ ఇది. పాలకులు, అధికారులకు పట్టని దయనీయ పరిస్థితి ఇది. రామ్‌నగర్ (కొయ్యూరు), న్యూస్‌లైన్: పేరుకే అది ఊరు.. అదీ గ్రామమేనంటే తెలిసిన వారు ఊరుకోరు. అంత అధ్వానంగా ఉంది రామ్‌నగర్ తీరు.. కనీస వసతులు లేక ఈ గ్రామస్తులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఏ వసతులూ లేనేలేవు. అగ్గిపెట్టె కావాలన్నా గ్రామస్తులు ఆరు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఆడాకుల పంచాయతీలోని రామ్‌నగర్ విస్తీర్ణంలో చిన్నదైనా సమస్యల్లో అతి పెద్దది. ఇక్కడ 25 వరకు ఇళ్లున్నాయి. గ్రామస్తుల్లో అధిక శాతం చేపల వేటను సాగిస్తున్నారు. వారిలో గిరిజనేతరులు అధికంగా ఉన్నారు. గ్రామానికి సరైన మార్గం లేదు. మెయిన్‌రోడ్డు నుంచి తగిలే మట్టి రోడ్డునుంచి ఆరు కిలోమీటర్ల దూరం నడిస్తే ఈ ఊరొస్తుంది. అది కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పాడైంది. గ్రామస్తులు శ్రమదానం చేసి తర్వాత బాగు చేసుకున్నారు. ఇక్కడి గిరిజనేతరులకు ఇళ్లు రాకపోవడంతో వారు సొంత ఖర్చులతో గుడిసెలు వేసుకున్నారు. కనీసం ఓ దుకాణమైనా లేకపోవడంతో వీరు ప్రతి చిన్న అవసరానికీ ఆరు కిలోమీటర్ల ‘చేరువ’లో ఉన్న చోద్యం గ్రామానికి నడుచుకు రావాల్సిందే. తాండవ దాటాల్సిందే.. అనారోగ్యం సోకితే చాలు ఈ గ్రామస్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే వారు నావ ద్వారా తాండవ జలాశయం దాటి అవతల ఒడ్డునున్న జాలారిపేటకు వెళ్తారు. అక్కడ నుంచి ఆటోలు ఎక్కి నాతవరం మండలంలో వైద్యం చేయించుకుంటారు. లేదా పది కిలోమీటర్ల దూరంలోని కంఠారం వెళ్లి చికిత్స పొందుతారు. బోర్లు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో వేసవి వస్తే మంచినీటికి నానా అవస్థలు పడాలని గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడు చెప్పండి.. ఇది గ్రామమేనా?