బూర్గుపల్లిలో ట్యాంకు వద్ద నీళ్లకోసం మహిళల పడిగాపులు
- పల్లెల్లో తప్పని తాగునీటి ఘోస
- సరైన వర్షాలు లేక ఎండిన బోర్లు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
మెదక్ రూరల్: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా...సరైన వర్షాలు లేక పల్లెల్లో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. మెదక్ మండలం పాతూర్, బూర్గుపల్లి, మక్తభూపతిపూర్, అవుసులపల్లి, వాడి, సర్ధన తదితర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో పనులు మానుకొని ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడికి బిందెలు పట్టుకొని పరుగులు పెడుతున్నారు.
అయినప్పటికీ అవసరానికి సరిపడ నీళ్లు దొరకడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బోర్లలో నీరున్నా...మోటార్లు చెడిపోయాయి. వీటికి మరమ్మతులు చేయించక పోవడంతో నీటి ఘోస తప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి మెక్కుబమడి తంతుగా వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ఇవి సరిపోకపోవడంతో గ్రామాల్లో తాగునీటి ఘోస ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. తాము తాగునీటికోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తమ గ్రామాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
గోస తప్పడం లేదు
వర్షాకాలం వచ్చినా బోర్లలో నీళ్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామంలో ఎండకాలంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. వర్షాకాలం రావడంతో గత రెండు నెలలుగా ట్యాంకర్లు రావడం లేదు. దీంతో తాగునీటికోసం ఇబ్బంది పడుతున్నాం . మా ఇబ్బందులను సార్లు గమనించి త్వరగా సమస్యను పరిష్కరించాలి. - దూరబొయిన రమేష్, పాతూర్.
పనులు మానుకోవాల్సిందే
తాగునీటికోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నాం. గ్రామంలోని అక్కడక్కడ బోర్లలో కొద్ది కొద్దిగా నీళ్లు వస్తుండటంతో గంటల తరబడి నీళ్లకోసం నిక్షించాల్సి వస్తోంది. దీంతో ఏ పనులు చేసుకోలేక పోతున్నాం. పనులకు పోతే నీళ్లు దొరకడం లేదు. అధికారులు స్పందించి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలి. - నర్సింలు, పాతూర్.