సాక్షి, సంగారెడ్డి: గుక్కెడు నీళ్లు గరళ మవుతున్నాయి. గొంతు తడుపుకునేందుకు తాగే కాసిన్ని నీళ్లు..కాలకూటమవుతున్నాయి. తాగునీటిపైప్‌లైన్‌ల లీకేజీలతో జీవ, రసాయన వ్యర్థాలతో కలుషితమవుతున్న తాగునీరు అతిసార విజృంభనకు కారణమవుతోంది. గ్రామీణ ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. గత అనుభవాలతోనైనా ప్రభుత్వ యంత్రాంగం పాఠాలు నేర్వడం లేదు. దీంతో రూ.కోట్లు కుమ్మరించి నిర్మించిన రక్షిత మంచి నీటి పథకాలు విషపూరిత నీళ్లను సరఫరా చేస్తున్నాయి. మెదక్, సదాశివపేట, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేటలో నీటి నాణ్యత పరీక్షించే ప్రభుత్వ ప్రయోగశాలలే ఈ వాస్తవాన్ని ధ్రువీకరించాయి. అయితే అతిసార మరణాల వెనక వేరే కారణాలున్నాయని గ్రామీణ నీటి సరఫరా సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుకాయిస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యాలతోనే బాధితులు మృతి చెందారని తేల్చేసి .. అసలు కారణాలను కప్పిపుచ్చుతున్నారు.
‘ఫాయికల్ కొలీ’ .. తాగితే బలి
జిల్లాలో 24 సమీకృత రక్షిత తాగునీటి పథకాలు(సీపీడబ్ల్యూస్), 1,811 రక్షిత తాగునీటి పథకాలు(పీడబ్ల్యూఎస్), 708 చిన్న రక్షిత తాగునీటి పథకాలు(ఎంపీడబ్ల్యూఎస్), 15,178 చేతి పంపులున్నాయి. ఇలా చిన్నాపెద్ద అన్నీ కలిపి మొత్తం 24,338 వరకు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2,384 గ్రామీణ జన ఆవాసాలుండగా.. వీటి ద్వారా 940 ఆవాసాలకు సంపూర్ణంగా, 1,444 ఆవాసాలకు పాక్షికంగా నీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. లీకేజీలకు మరమ్మతులు నిర్వహించకుండానే పల్లె ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేసేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు 11,627 జల వనరుల్లోని నీటిని ప్రభుత్వ ప్రయోగశాల్లో పరీక్షించగా.. 261 జల వనరులు ‘ఫాయికల్ కొలిఫాం’ అనే బ్యాక్టిరియా కలిగి ఉన్నట్లు తేలింది. అదే విధంగా 1,055 వనరులు ఫ్లోరైడ్, 304 వనరుల్లో లోహ లవణాలు, 296 వనరుల్లో నైట్రేట్, 83 వనరుల్లో ఉప్పు లవణాలు, 344 వనరుల్లో ఆల్కైన్, క్లోరైడ్, సల్ఫైట్ అవశేషాలు, 150 వనరుల్లో టీడీఎస్‌ను మోతాదుకు మించి కలిగి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. 361 జల వనరులైతే ఒకటి కంటే ఎక్కువ మూలకాలతో కలుషితమై ఉన్నాయి. అతిసార కారకమైన ‘ఫాయికల్ కొలీఫాం’ బ్యాక్టిరియా నీళ్ల ద్వారా శరీరంలోకి చేరి వాంతులు, విరేచనాలకు దారితీస్తుంది. సకాలంలో రోగికి వైద్యం అందకపోతే ప్రాణపాయం తప్పదు.
తాగునీటి సమస్య కాదు
శివ్వంపేట మండలం దొంతి, హత్నూర మండలం కొన్యాలలో అతిసార ప్రబ లడానికి కలుషిత తాగునీళ్లు కారణం కాదు. కొన్యాలలో అనాథ వృద్ధురాలు ఆలనాపాలన లేక చనిపోయింది. దొంతి లో ఇద్దరి మృతికి విందు భోజనం కార ణం కావచ్చు. ఈ గ్రామంలో మా అధికారులు పర్యటించి నీటి సరఫరాను పరిశీ లిస్తే ఎక్కడా లోపాలు కనిపించలేదు. -విజయ్ ప్రకాశ్, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
గరళమే!
Published Mon, Nov 18 2013 12:32 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Advertisement