మరమ్మతులకు నోచుకోని బోరు
- మంచినీటి పంపులకు మరమ్మతులు కరువు
- లోపించిన పారుశుద్ధ్యం.. పటించుకోని అధికారులు
మనూరు: మండలంలోని మాయికోడ్‌లో సమస్యలు తిష్టవేశాయి. గ్రామంలో 1,997 జనాభా ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం 5 మంచినీటి బోర్లు వేశారు. బోరు మోటార్లు కాలిపోయాయి. ఈ సమస్యకు తోడు మంజీరా నీరు రావడం లేదు. దీంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మండల అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపించారు. సర్పంచ్‌కు కూడా తమ బాధలు పట్టడం లేదన్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదు. ఈ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో తామే స్వచ్ఛందంగా దీపాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.
కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. కాలువల్లో మురుగు పేరుకుపోయింది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. చిన్నపాటి వర్షానికే ఊరంతా చిత్తడిగా మారుతోంది. ఫలితంగా దోమద బెడద ఎక్కువ అవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి తమ సమ్యలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సర్పంచ్ తీరు సరికాదు
గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాల్సిన సర్పంచ్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ నిధులును తమ సొంత అవసరాలకు వాడుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది. పంచాయతీ అధికారుల తీరు కూడా సరిగ్గా లేదు. సమస్యలను వారు కూడా పట్టించుకోవడం లేదు. - అరుణ్, సీపీఎం నాయకులు, మాయికోడ్
నీళ్లు కోసం తీవ్ర ఇబ్బందులు
గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోజూ బిందెలతో పొలాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఊర్లో ఐదారు బోర్లు ఉన్నా అవి పని చేయడం లేదు. బాధలు పట్టించుకునే నాధులే లేరు. - నాగమ్మ, మాయికోడ్
ప్రజల బాధలు చూడలేక..
తాగునీటి కోసం ప్రజలు పడుతున్న బాధలు చూడలేక తన బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నా. నీటి సమస్య తీవ్రత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. - పోతురాజు బాలయ్య
నిధుల కొరతే కారణం
గ్రామంలో సమస్యలు ఉన్న విసయం నిజమే. పంచాయతీకి నిధుల కొరత ఉంది. ఈ కారణంగా అభివృద్ధి చేయలేకపోతున్నా. బోరు మోటర్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాం. ప్రధాన సమస్యలను మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - నందునాయక్ సర్పంచ్