ఊళ్లో దెయ్యం ఉందంటూ కొందరు ఊరినే ఖాళీ చేశారు. ఇటీవల కొన్ని నెలలుగా ఒకే గ్రామానికి చెందిన పలువురు ఎలాంటి రోగాల బారిన పడకుండానే మృతి చెందారు. ఇలా ఎందుకు జరుగుతోంది.. మా ఊరికి ఏమైంది? చేతబడి జరుగుతోందా? లేక దెయ్యమే ఉందా? అంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు. చివరికి దెయ్యమే ఉందని నిర్ధారణకొచ్చి.. ఊరినే ఖాళీ చేసిన సంఘటన సీఎం కేసీఆర్ స్వగ్రామం శివారు ఉప్పలోనికుంటలో వెలుగుచూసింది.
సిద్దిపేట రూరల్: దెయ్యం భయంతో సిద్దిపేట రూరల్ మండలంలోని సీఎం కేసీఆర్ సొంతూరు శివారులోని ఉప్పలోనికుంట గ్రామస్తులు ఊరు ఖాళీ చేసిన విషయం చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలోని రాందేవి అనే ఒకే వంశానికి చెందిన వారు పొలాల వద్దే స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. గ్రామంలో మొత్తం వీరివి 20 కుటుంబాలు. అయితే వరుసగా ఆ కుటుంబాల్లో మరణాలు జరుగుతుండటంతో చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోయాయి. దీంతో చాలావరకూ ఇళ్లు తాళాలు వేసి, వ్యవసాయ భూములు బీడులుగా మారి గ్రామం బోసిపోయినట్లు కన్పిస్తుంది. ఇప్పుడు.. గ్రామంలో రాందేవి వంశానికి చెందిన మూడు కుటుంబాల వారు మాత్రమే వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రానికే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.
ఇదంతా మూడేళ్ల నుంచే
మూడేళ్ల క్రితం రాందేవి భారతి అనే మహిళ చనిపోయింది. అప్పటినుంచి గ్రామంలో ప్రతీ 4 నెలలకు ఒకరు ఎలాంటి అనారోగ్యం లేకుండానే చనిపోతున్నారు. పరీక్ష రాసేందుకు సిద్ధమైన ఓ విద్యార్థిని సైతం తెల్లవారుజామున నిద్రలోనే మరణించింది. ఇటీవల అస్వస్థతకు గురైన ఓ వ్యక్తిని, వింత చేష్టలు చేస్తున్న మరోవ్యక్తిని వైద్యులకు చూపించారు. డాక్టర్లు పరీక్షలు చేసి వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ భూతవైద్యులను ఆశ్రయించారు. దెయ్యం కారణంగానే వీరంతా మరణిస్తున్నారని చెప్పడంతో ఆ గ్రామంలో పూజలు చేయించారు. అయినప్పటికీ మరణాలు ఆగకపోవటంతో గ్రామస్తులందరూ ఊరిని, పొలాలను వదిలి.. చింతమడక, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.
రోడ్డున పడ్డాం..
గ్రామంలో మా వంశానికి చెందిన వారందరూ ఎలాంటి కారణాలు లేకుండా చనిపోవడంతో మాకు భయం వేసి చింతమడకలోనే ఉంటున్నాం. భూమిని వదిలిపెట్టడంతో ఉపాధి లేక రోడ్డున పడ్డాం. – రాందేవి నర్సింహులు, ఉప్పలోనికుంట
అద్దె ఇంట్లో ఉంటున్నాం..
దెయ్యం ఉందన్న కారణంతో గ్రామం నుంచి వలస వచ్చేశాను. నా నాలుగు ఎకరాల భూమిలో పగలే వ్యవసాయం చేస్తున్నాను. దెయ్యం భయంతో సాయంత్రానికే తిరిగి వస్తున్నాను. – రాందేవి వెంకటయ్య. ఉప్పలోనికుంట
Comments
Please login to add a commentAdd a comment