సాక్షి, మచిలీపట్నం :
కాంగ్రెస్ సర్కార్ తీరుతో గ్రామ పంచాయతీలకు ఇబ్బందులు తప్పడంలేదు. తమ ఊరిని బాగుచేసుకోవాలనే కోటి ఆశలతో పదవులు చేపట్టిన నూతన పాలకవర్గాలకు ప్రభుత్వ తీరు రుచించడంలేదు. వరుస అవరోధాలతో పల్లెల్లో అభివృద్ధి అడుగంటింది. తాజాగా ప్రభుత్వం జిల్లాలోని పంచాయతీలకు రూ.20 కోట్ల నిధులు మంజూరుచేసినా జాయింట్ చెక్‌పవర్‌తో సమస్యలు తప్పేలా లేవు. దీనిపై తుది కసరత్తు పూర్తిచేసిన జిల్లా పంచాయతీ అధికారి ఆయా పంచాయతీలకు జరిపిన కేటాయింపులను జిల్లా ట్రెజరీ(ఖజానా)కి నివేదించారు. నిధుల కేటాయింపు జరిగినా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో చెక్కులపై సర్పంచి, కార్యదర్శి ఉమ్మడి సంతకాలు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.
జిల్లాలో 970పంచాతీలకు గానూ ఇటీవల మూడు దశల్లో 968 పంచాతీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెల్సిందే. 2006లో ఎన్నికలు జరిగిన పంచాయతీలకు 2011తో పదవీకాలం తీరింది. అయినా దాదాపు రెండేళ్లపాటు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనతోనే కాలక్షేపం చేసింది. దీంతో గత రెండేళ్లలో జిల్లాలోని పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.40కోట్లు ప్రభుత్వ నిధులు రాకుండాపోయాయి. దీనికితోడు గత 2006ఎన్నికల్లో 109పంచాయతీలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 134పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికల వ్యయం లేకుండా ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక పారితోషికం అందించే విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడిన మూడు నెలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాకు కొద్ది రోజుల క్రితం రూ.20కోట్లు విడుదలయ్యాయి.
13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15కోట్లు, స్టేట్ ఫైనాన్స్ నిధులు రూ.5కోట్లు కేటాయించారు. కాగా, పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడిన 15రోజుల్లోనే పంచాయతీ కార్యదర్శి నుంచి అటెండర్ వరకు సమ్మెబాట పట్టారు. ఆగస్టు 12 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జిల్లాలోని పంచాయతీ సిబ్బంది సమ్మెబాట పట్టడంతో పల్లెల్లో అభివృద్ధితోపాటు నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పంచాయతీ ఉద్యోగులు సమ్మెబాట వీడి విధుల్లోకి చేరడంతో ప్రభుత్వం కేటాయించిన రూ.20కోట్ల నిధులను ఆయా పంచాయతీలకు కేటాయించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు జనాభాలోని తలసరి(తలకు ఒక్కింటికి) రూ.52, స్టేట్ ఫైనాన్స్ నిధులు తలసరి రూ.18చొప్పున కేటాయింపులు జరిపినట్టు జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ సాక్షికి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయా పంచాయతీల వారీగా కేటాయించిన నిధుల వివరాలను జిల్లా ట్రెజరీకి పంపామని ఆయన తెలిపారు.
ఉమ్మడి సంతకం పిటలాటకం..
ప్రభుత్వ తీరు ఒకచేత్తో పెట్టి మరో చేత్తో మొట్టినట్టు ఉందని జిల్లాలోని పంచాయతీల సర్పంచులు మండిపడుతున్నారు. సర్పంచుల చెక్ వపర్‌కు ఉమ్మడి సంతకం(కార్యదర్శుల జాయింట్ సిగ్నేచర్) మెలిక పెట్టడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కును కాలరాస్తూ ప్రభుత్వం జాయింట్ చెక్‌పవర్ పద్ధతి పెట్టడాన్ని సర్పంచులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది కొత్త వివాదాలకు తెరతీస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.
‘జాయింట్’ పంచాయ(యి)తీ !
Published Wed, Oct 23 2013 2:54 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement