యాచారం, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టాలని కిందిస్థాయి సిబ్బందిని పురమాయిస్తోంది. నిధులులేక అభివృద్ధి పనులు కుంటుపడుతున్న ఈ పరిస్థితుల్లో.. పంచాయతీలను పటిష్ట పరిచేందుకు పన్నుల వసూళ్లే ఉత్తమ మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో వసూలయ్యే పన్నుల వివరాలను ప్రతి నెలా 5వ తేదీలోగా అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిసర ప్రాంతాలు నగరానికి సమీపంలో ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్లు, బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారు. అయితే నిబంధనల ప్రకారం అనుమతులు పొందకపోవడంతోపాటు పన్నులు కూడా చెల్లించడం లేదు. దీంతో పెద్దఎత్తున పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అదేవిధంగా ఇంటి, నీటి తదితర పన్నులు సక్రమంగా వసూలు కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఉన్నతాధికారులు గ్రామాల్లో ఇంటి, నీటి పన్నులతోపాటు వెంచర్లు, గృహ నిర్మాణాలకు సంబంధించిన పన్నుల వసూళ్ల వివరాలను ప్రతి నెల తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్న వారికి నోటీసులు పంపి నిర్దేశిత ఫీజు వసూలు చేయడంతోపాటు మిగతా పన్నులు సక్రమంగా చెల్లించేలా అవగాహన కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో (2013 ఏప్రిల్ -సెప్టెంబర్) గ్రామాల్లో వసూలు చేసిన పన్నుల వివరాలను తెలియజేయాలని, అది కూడా వారం రోజుల్లోగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలను ఆదేశించారు. ఇకపై ప్రతి నెల క్రమం తప్పకుండా 5వ తేదీలోపు వసూలైన పన్నుల లెక్కలు పంపించాలని కూడా స్పష్టం చేశారు. వివరాలు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల్లో 2012-13 సంవత్సరానికి గాను వివిధ పన్నుల రూపంలో రూ.29,81,320 వసూలు కావాల్సి ఉండగా, కేవలం 12శాతం మాత్రమే వసూలయ్యాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు పన్నుల బకాయిలపై దృష్టిపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు వెంటనే పన్నుల వసూళ్ల వివరాలను అందజేయాల్సిందిగా ఈఓఆర్డీ శంకర్ నాయక్ పం చాయతీ కార్యదర్శులను పురమాయించారు.
ఇన్‌చార్జి బాధ్యతలతో కార్యదర్శుల ఇబ్బందులు
ఇదిలా ఉంటే, ఒక్కొక్కరు మూడేసి గ్రామాల బాధ్యతలను చూస్తున్నందున పన్నుల వసూళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు 20మంది కార్యదర్శులు ఉండాలి. అయితే కేవలం ఆరుగురిని మాత్రమే నియమించారు. నలుగురు పర్మనెంట్ కార్యదర్శులు కాగా మిగతా ఇద్దరు కాంట్రాక్టు పద్ధతిన కొనసాగుతున్నారు. వీరిలో యాచారం కార్యదర్శి (పర్మనెంట్) లక్ష్మయ్య ఈ నెల 30న పదవీ విరమణ పొందుతుండగా, గునుగల్ కార్యదర్శి రాములుకు ఆరోగ్యం సహకరించక ఆస్పత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం 20 గ్రామాల్లో కేవలం నలుగురు కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. పన్నులు సక్రమంగా వసూలు చేయడానికి, లెక్కలు చెప్పడానికి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది
పన్నుల వసూళ్ల వివరాల కోసం ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రతి నెల 5వ తేదీలోపు వివరాలు తెలి యజేయాలని ఆదేశాలు వచ్చాయి. గ్రామా ల్లో చూస్తే పన్నుల వసూళ్ల శాతం తక్కువగా ఉంది. బకాయిలతోపాటు ప్రతి నెలా పన్నులు సక్రమంగా వసూళ్లు చేయాలని కార్యదర్శులను ఆదేశించాం. సర్పంచ్‌లు, ప్రజలు ఇందుకు సహకరించాలి. పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసేందుకు వెనుకాడం.
- శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం
పంచాయతీ ‘లెక్క’ చెప్పాల్సిందే!
Published Mon, Oct 28 2013 12:14 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement