మహబూబ్‌నగర్: ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి చనిపోయాడంటూ పరిహారం కోసం పంచాయితీ పెట్టిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్‌లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని జూరాల గ్రామానికి చెందిన బాలస్వామి గత నెల 25వ తేదీన జెన్‌కో అతిథి గృహ నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి జారి కిందపడ్డాడు.
ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, గురువారం బాలస్వామి మృతి చెందాడని పుకార్లు లేచాయి. పలు ప్రజాసంఘాల నాయకులు గ్రామస్తులు సంబంధిత కాంట్రాక్టర్ వద్ద పంచాయితీ పెట్టారు. ఈ చర్చల్లో బాధిత కుటుంబానికి రూ.4.50లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు కాంట్రాక్టర్ ఒప్పుకున్నాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు, గ్రామస్తులు ఆస్పత్రికి తరలివెళ్లారు. అయితే, అక్కడి వైద్యులు మాత్రం బాలస్వామి చికిత్స పొందుతున్నాడని, చనిపోలేదని చెప్పటంతో నివ్వెరపోయారు.