మండలంలో శివారు పంచాయతీ కరకవలస కేంద్రం గా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సాయంత్రమైతే చాలు.. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.
జలుమూరు, న్యూస్‌లైన్: మండలంలో శివారు పంచాయతీ కరకవలస కేంద్రం గా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సాయంత్రమైతే చాలు.. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అటు హిరమండలం మండలం రెల్లివలస, అక్కారాపల్లి రేవుల్లో ట్రాక్టర్లు పెట్టి..కరకవలస మామిడి, జీగి తోటల్లో ఇసుకను పోగులుగా వేస్తున్నారు. చీకటి పడితే..రవాణా చేస్తూ..లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌తో ఇసుకను తెచ్చేందుకు సంబంధిత యజమానులకు రూ.500 నుంచి రూ.700 ఇస్తున్నారు.
మూడు ట్రాక్టర్ల లోడులను ఒక లారీలో వేసి..విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాతపట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ లోడు ఇసుకను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పగటిపూట అయితే..రెవెన్యూ, పోలీస్ అధికారుల నుంచి తప్పించుకోవడం కష్టసాధ్యమని భావించి..రాత్రిపూట రవాణా సాగిస్తున్నారు. ఎక్కువగా కరకవలస, రెల్లివలస, అంబావిల్లికి చెందిన ఇసుక అక్రమార్కులు ట్రాక్టర్లను లీజుకు తీసుకుని దందా సాగిస్తున్నారని భోగట్టా. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి..ఇసుకాసురుల ఆటకట్టించాలని..నదీమతల్లుల గర్భశోకాన్ని ఆలకించాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని తహశీల్దార్ వై.శ్రీనివాసరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. గతంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా ఉండేదని..గ్రామాల్లో దండోరా వేయించి, ప్రత్యేక నిఘా ఉంచి..నిలుపుదల చేశామని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేసి..దాడులు నిర్వహిస్తామన్నారు.