పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, గుంటూరు
పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి జరగనున్న రాత పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష నిర్వహణ బాధ్యతలను జిల్లా పరిషత్ కు అప్పగించడంతో సీఈవో సుబ్బారావు, డిప్యూటీ సీఈవో వీరాంజనేయులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈ నెల 23న రాత పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్జీవోల సమ్మె నేపథ్యం లో పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ రాత పరీక్ష యథావిధిగా జరగనుందని ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ నెల 10 నుంచే హాల్ టికెట్లు పొందవచ్చని తొలుత అధికారులు ప్రకటించారు. అయితే సోమవారం వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ఆందోళన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,677 ఖాళీల భర్తీకి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత ఏడాది 30న ఏపీపీఎస్సీ చైర్మన్ బిశ్వాల్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు.
దీంతో జిల్లాలో 26 పోస్టుల భర్తీకి అవకాశం దక్కింది. 26 పోస్టులకు 32,240 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 50 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీలున్నాయి. అనుమతించిన 26 పోస్టులకు ఓసీ జనరల్ కేటగిరీలో 7, ఓసీ మహిళ-4, బీసీ-ఎ కేటగిరీలో ఒకటి మహిళ, మరొకటి జనరల్, బీసీ-బీలో రెండింటిలో ఒక మహిళ, జనరల్, బీసీ-సీలో జనరల్, బీసీ-డీలో జనరల్, మహిళ, బీసీ-ఈ లో జనరల్, ఎస్సీలో రెండు జనరల్, రెండు మహిళ, ఎస్టీ కేటగిరీలో రెండింటిలో జనరల్, మహిళ పోస్టులున్నాయి. వికలాంగుల కోటాలో ఓ పోస్టు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్ళ వరకు, వికలాంగులకు 46 ఏళ్ళ వరకు వయోపరిమితి ఉండటంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం మార్చి 24న జిల్లా స్థాయిలో ర్యాంకింగ్ జాబితాలు తయారు చేయనున్నార.