సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
గ్రేటర్‌లో శివారు పంచాయతీల విలీనంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో జిల్లాలోని 35 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ డంపై జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని శ్రీధర్‌బాబు ప్రస్తావించారు. గ్రేటర్‌లో పంచాయతీల విలీనంపై జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ అంశంపై డీఆర్‌సీ సమావేశంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని సీఎం దృష్టికి తెచ్చారు. విలీన పంచాయతీలను ముందుగా నగర పంచాయతీ, మున్సిపాలిటీ, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీలో కలిపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
శ్రీధర్‌బాబు వాదనతో ఏకీభవించిన ప్రసాద్ కుమార్.. పంచాయతీల విలీనంతో జిల్లా ఉనికి దెబ్బతింటుందని, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయపార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. పంచాయతీల విలీనంపై పునరాలోచన చేయాలని కోరారు. మంత్రుల వాదనను ఓపిగ్గా విన్న సీఎం కిరణ్.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలావుండగా.. గ్రేటర్‌లో పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 17గ్రామాల ప్రతినిధులు కోర్టుకెక్కారు. దీనిని శుక్రవారం విచారించిన ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.
విలీనం వద్దు!
Published Fri, Sep 20 2013 11:24 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement