బ్రాహ్మణపల్లి పంచాయతీ కార్యాలయం
సాక్షి, అచ్చంపేట : గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈసారి పంచాయతీ పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీలకు వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకద్బందీగా అమలు చేయనున్నారు.
సర్పంచ్‌లకు సవాలే
గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి పరిస్థితులు లేవు. అభివృద్ధి పనులను చేయాలంటే మొదటగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిందే. గ్రామంలో ఏ పనులు చేయాలన్నా సమావేశంలో తీర్మాణాలు చేసి వారి సమక్షంలో నిధులు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
తీర్మానం తప్పనిసరి
గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటుగా వారిపై వేటుపడే అవకాశం ఉంది. గత సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బు ఖర్చు చేసి గ్రామాల్లో పనులు చేసి ఆతర్వాత వచ్చిన నిధులను తీర్మాణాలు చేయకుండానే పనులు చేశామని పంచాయతీ నుంచి డబ్బు తీసుకునేవాళ్లు. ఈసారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మాణం చేసుకుని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవినీతికి పాల్పడే సర్పంచ్‌ల పదవికి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది.
అందుబాటులో వివిధ యాప్‌లు
ప్రియా సాఫ్ట్‌వేర్‌తో అక్రమాలకు చెక్ పడనుంది. పంచాయతీరాజ్ ఇనిస్టిషన్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. పంచాయతీలకు ఎంత బడ్జెట్ మంజూరైంది. మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చు చేశారు. శానిటేషన్, వైద్యం, నీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణం, సిబ్బంది వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామజ్యోతి వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వార్షిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపు, నిధుల ఖర్చు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్లాన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా సమాచారాన్ని నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జనాభా సామాజిక వివరాలు, భౌతిక వనరలు, మౌలిక వసతులు, సాంఘిక ఆర్థిక సహజ వనరులను యాక్షన్ ప్లాన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
పారదర్శక పాలన
నూతనంగా అమలు చేయనున్న పంచాయతీరాజ్ చట్టాలతో గ్రామాల్లో పారదర్శక పాలన అందనుంది. అందుబాటులోకి యాప్‌లు రావడంతో ఎలాంటి అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతాయి. అవినీతికి పాల్పడే సర్పంచ్‌లపై వేటు పడే అవకాశాలు ఉన్నందున తప్పులకు తావివ్వరు. యాప్‌లపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం.
– సురేష్‌కుమార్, ఎంపీడీఓ, అచ్చంపేట
Comments
Please login to add a commentAdd a comment