ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో
సర్పంచ్‌ల్లో పెరుగుతున్న ఆందోళన
అవకతవకలు బయటపడకుండా
జాగ్రత్తలు పడుతున్న కార్యదర్శులు..?
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:
పంచాయతీలకు ఆడిట్ గుబులు పట్టుకుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో అటు సర్పంచ్‌లతో పాటు ఇటు కార్యదర్శుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాస్తవానికి పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి ఏటా నిధుల వినియోగం, జమా ఖర్చులపై ఆడిట్ జరగవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను జిల్లా ఆడిట్ శాఖ అధికారులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే 2013-14 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 921 పంచాయతీలకు కేటాయించిన నిధులు వాటి జమా, ఖర్చులు వివరాలపై ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ చేయించుకోవలసి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఆడిట్ జరగని పక్షంలో చట్టం ప్రకారం సంబంధిత పంచాయతీ సర్పంచ్‌పై అనర్హత వేటు వేస్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఈఓపీఆర్‌డీపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పంచాయతీలో కూడా నిధుల వినియోగంపై ఆడిట్ జరగకపోవడంతో 40 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందా లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంలో చొరవతీసుకోవలసిన ఈఓపీఆర్‌డీతో పాటు ఆడిట్ శాఖ అధికారులు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో నిధులు వినియోగంపై కార్యదర్శులు సమగ్ర లెక్కలతో ఆడిట్ చేయించుకోవాలని, ఈఓపీఆర్‌డీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలో 921 పంచాయతీలుండగా అందులో 15 మేజర్ పంచాయతీలు, మిగిలిన 906 మైనర్ పంచాయతీలు. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులు వినియోగం, జమా ఖర్చులు ఇతర వివరాలపై ఆడిట్ జరగాల్సి ఉంటుంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి నిధుల వినియోగంపై ఈ ఏడాది నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లే ఆడిట్ చేయించుకోవలసిన బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎన్నికలు నిర్వహించడంతో అంతకుముందు ప్రత్యేకాధికారులు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పంచాయతీల్లో నిధులు వినియోగించారు. అయితే వాటి గురించి తమకేమి తెలుస్తుందని కొత్త సర్పంచ్‌లు చెబుతుండగా... చట్టం ప్రకారం పదవుల్లో ఉండే సర్పంచ్‌లే ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో సర్పంచ్‌లున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 921 పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్టోబర్ మొదటి వారం వరకు పంచాయతీ రికార్డులు, చెక్ బుక్‌లు అందజేయలేదు. అనంతరం జాయింట్ చెక్‌పవర్‌ను రద్దుచేయాలంటూ అక్టోబర్ ఆఖరి వారం వరకు పోరాటం చేశారు. అదే దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ మొత్తంలో నిధులు కేటాయించటంలో పూర్తి స్థాయిలో సర్పంచ్‌లు బాధ్యతలపై దృష్టి సారించారు. ఈ తరుణంలో మరో 40 రోజుల వ్యవధిలో 921 పంచాయతీల్లో నిధులపై ఆడిట్ నిర్వహించాల్సి ఉండడం వారికి కాస్త తలనొప్పిగా మారింది. లెక్కల్లో తేడాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నిధుల వినియోగంలో జరిగిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు పలువురు కార్యదర్శులు పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంచాయతీలకు ఆడిట్ గుబులు!
Published Fri, Feb 21 2014 1:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement