విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పంచాయతీల పరిస్థితి. రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గిన పంచాయతీలకు జూలైలో జరిగిన ఎన్నికల్లో పాలకవర్గాలను ఎన్నుకున్నారు. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సమ్మె కారణంగా నిధులు అందుబాటులో లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఎటు చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పారి శుద్ధ్యం లోపించి కంపుకొడుతున్నాయి. వీధి దీపాలు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది. రోడ్లు, తాగునీటి సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగి సిన మరుసటి రోజు నుంచే సమైక్య ఉద్యమం జిల్లాలో ఊపందుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెబాట పట్టారు. దీంతో పంచాయతీల్లో అసలు ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయన్న లెక్కలు వారికి తెలియకపోగా రావలసిన నిధులకు బ్రేక్ పడింది.
ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహక నిధులు
జిల్లాలో 921 పంచాయతీలకు వాటి పరిధిలోని 8,764 వార్డులకు ఈ ఏడాది జూలై 23, 27 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 131 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆయా పంచాయతీల్లో ఎన్నికల ఖర్చు లేకపోవడంతో గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైన మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.5 లక్షల వరకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 131 పంచాయతీలూ మైనర్ పంచాయతీలు కావడంతో ఒక్కొక్క పంచాయతీకి రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల కావాల్సి ఉంది.
ఈ లెక్కన జిల్లాకు రూ 6.55 కోట్లు రావలసి ఉంది. మరో రూ 2 కోట్ల వరకు నిధులు పంచాయతీల్లో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను, సీనరేజీ పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులతో పంచాయతీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు చేపడతారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుంచే జిల్లాలో సమైక్య ఉద్యమం ఊపందుకోవడం పంచాయతీలకు గొడ్డలిపెట్టుగా మారింది. ఎంపీడీఓలు, ఖజానా శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు సమ్మెలో ఉండడంతో నిధులున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు.
ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయిన సేవలు..
రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో ఉద్యోగులంతా ఆగస్టు మొదటి వారంలో సమ్మెబాటపట్టారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడికలు తీయాలన్నా, తాగునీటి పైపులైన్లు మరమ్మతులు చేయించాలన్నా, వీధి లైట్లు వెలగించాలన్నా పంచాయతీల్లో నిధులు లేకపోవడం, ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువై సర్పంచ్‌లు అప్పులు పాలైన తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి రావడం వారికి భారంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఇంటి పన్ను ఎలా వసూలు చేయాలో తెలియని పరిస్థితిలో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు.
వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. బ్లీచింగ్ చల్లేందుకు ప్రతి పంచాయతీకి కనీసం రూ2 వేల నుంచి రూ3 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సొంత నిధులు వెచ్చిస్తే తీర్మానాలు లేకుండా చేసిన పనులకు బిల్లులు వస్తాయా...? రావా...? అన్న ప్రశ్నలు వారిలో తలెత్తుతున్నాయి. రెండేళ్ల పాటు రాజకీయ నిరుద్యోగంతో విసిగెత్తిపోయిన గ్రామస్థాయి నాయకులు పంచాయతీ ఎన్నికలు ప్రకటించగానే పరుగులు పెట్టి పోటీ చేసి గెలుపొందినప్పటికీ ఆదిలోనే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఓ వైపు నిధులు విడుదల కాక, మరోవైపు బాధ్యతలు పూర్తి స్థాయిలో అందకపోవటంతో వారి బాధను బయటకు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.
పంచాయతీలకు ‘సమ్మె’ పోటు
Published Fri, Oct 18 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement