కాతేరులో.. ‘కట్టు’కథలు..
కాతేరులో.. ‘కట్టు’కథలు..
Published Thu, May 18 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
- యథేచ్ఛగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం
– అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు
– సెట్‌బ్యాక్స్ రెండు అడుగులు కూడా లేని వైనం
– నిర్మించి అమ్మేస్తున్న వ్యాపారులు
– చూసీచూడనట్టుగా అధికారులు
అక్రమ కట్టడాలకు కాతేరు పంచాయతీ అడ్డాగా నిలుస్తోంది. పంచాయతీ అనుమతులు తీసుకుని బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. బిల్డర్ల ‘కట్టు’కథలు వింటున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు సాగుతున్నా.. తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. - సాక్షి, రాజమహేంద్రవరం
దాదాపు 9వేల గడప ఉన్న కాతేరు పంచాయతీ రాజమహేంద్రవరంలో కలిసినట్టుగానే ఉంటుంది. నగరం నుంచి కాతేరు వరకు మధ్యలో నిర్మాణాలు ఉండడంతో పంచాయతీలో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో స్థలాలు లేకపోవడంతో వ్యాపారులు నగరాన్ని ఆనుకుని ఉన్న హుకుంపేట, పిండిగొయ్యి, కాతేరు, ధవళేశ్వర్యం తదితర పంచాయతీల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ఐదేళ్లుగా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అక్కడ జన్మభూమి కమిటీలు, పంచాయతీ అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ క్రమంలోనే పంచాయతీ అధికారులు అడిగిందే తడవుగా అనుమతులు ఇస్తున్నారు. సాధారణంగా పంచాయతీ స్థాయిలో జీ ప్లస్ 2 వరకు అనుమతులు ఇస్తారు. అయితే వ్యాపారులు మూడు, నాలుగు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. కాతేరు గ్రామం, పంచాయతీ పరిధిలోని మల్లయ్యపేటలో ఈ విధంగా అనధికారిక కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మల్లయ్యపేట కాతేరు మధ్యలో చెరువు వద్ద శివాని బిల్డర్స్, డెవలెపర్స్ సంస్థ పంచాయతీ అనుమతులతో జీ ప్లస్ 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. నిబంధనల ప్రకారం పంచాయతీ అనుమతితో గరిష్టంగా జీ ప్లస్ 2 వరకే నిర్మించాలి. కానీ జీ ప్లస్ 4 అంతస్తుల భవనం నిర్మిస్తున్న శివాని బిల్డర్స్, డెవలపర్స్ సంస్థ కనీసం సెట్‌బ్యాక్స్ కూడా నిబంధనలకు అనుగుణంగా వదలలేదు. భవనం నాలుగు వైపులు కనీసం రెండు అడుగుల ఖాళీ ప్రదేశం కూడా వదల్లేదు. మల్లయ్యపేటలోని నిర్మించిన లక్ష్మీ టవర్స్ కూడా ఇలాగే నిబంధలకు విరుద్ధంగా నిర్మించారు. పంచాయతీ అనుమతితో జీ ప్లస్ 4 అంతస్తులు నిర్మించిన బిల్డర్, సెట్‌బ్యాక్స్ రెండు అడుగులు కూడా వదల్లేదు. ఇలా పంచాయతీలో అనేక ఇళ్లు కూడా ఉన్నాయి. గతంలో కాతేరు పంచాయతీ కార్యదర్శి ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. నిధుల గోల్‌మాల్, పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలపై ఆ కార్యదర్శిని సస్పెండ్ చేశారు.
పట్టించుకోని అధికారులు, సిబ్బంది..
కాతేరు పంచాయతీలో నిబంధలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్లు, భవనాలు నిర్మిస్తున్నా పంచాయతీ అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా ఉంటున్నారు. రాజకీయ పార్టీ నేతల ఒత్తిడులు, ఇతర వ్యవహారాల నేపథ్యంలో కింది స్థాయి అధికారులు మిన్నుకుండిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది.
నష్టపోనున్న కొనుగోలుదారులు...
నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ అనుమతులకు మించి మూడు, నాలుగు అంతస్తుల మేర అపార్ట్‌మెంట్లు నిర్మించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణాలు, నగరాలలో నిర్మించిన పాత భవనాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం బీఆర్‌ఎస్ అనే పథకం ప్రవేశపెట్టి అమలు చేసింది. కానీ పంచాయతీలలోని అనధికారిక, అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేలా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకం ప్రవేశ పెట్టలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. అనధికారికి కట్టడాలను కూల్చివేడం, లేదా భారీ స్థాయిలో జరిమానా విధించడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్టు గత కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. అయితే వీటిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది జరిగితే అప్పటికే కొనుగోలు చేసిన వారు నష్టపోనున్నారు.
నోటీసులు ఇస్తాం.. చట్టప్రకారం చర్యలు
అనధికారిక, అక్రమ కట్టడాలు నిర్మించే వారికి నోటీసులు ఇస్తాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, సబ్‌కలెక్టర్ తరచూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ నిర్మాణదారులు లెక్కచేయడం లేదు. అక్రమ, అనధికారిక అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు కొన్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
– వరప్రసాద్, డీఎల్‌పీవో, రాజమహేంద్రవరం డివిజన్
Advertisement
Advertisement