పదేళ్లలో నాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించాం
ప్రజలకు శాశ్వత నివాసం ఉండాలన్నదే నా స్వప్నం
ఆది ఆప్ కాదు.. ముమ్మాటికీ ఆపద
విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను అద్దాల మేడ(శీష్ మహల్) కట్టుకోలేదు. కానీ, పదేళ్లలో నాలుగు కోట్ల మందిపైగా పేదల సొంతింటి కల నెరవేర్చాను. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన కోసం విలాసవంతమైనæభవనం కాకుండా పేదలకు శాశ్వత నివాసం ఉండాలన్నదే తన స్వప్నం అని వివరించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించిన 1,675 ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. వారితో ముచ్చటించారు. నౌరోజీ నగర్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్‌లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్‌ఏ)టైప్–2 క్వార్టర్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
ద్వారకలో రూ.300 కోట్లతో నిర్మించిన సీబీఎస్‌ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్ల విలువైన మూడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)పై నిప్పులు చెరిగారు. అది ఆప్ కాదు, ఆపద అంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారంటే...
ఢిల్లీని ఆపదలో పడేశారు
‘‘మోదీ ఎప్పుడూ తన కోసం ఇల్లు నిర్మించుకోలేదన్న విషయం దేశానికి తెలుసు. గడచిన పదేళ్లలో నాలుగు కోట్ల కంటే ఎక్కువగా ఇళ్లు నిర్మించి పేదల కలను సాకారం చేశాం. నేను కూడా శీష్ మహల్(అద్దాల మేడ) నిర్మించుకొనేవాడినే. కానీ, అది నాకు ఇష్టం లేదు. నా దేశ ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలన్నదే నా కల. కొందరు వ్యక్తులు(కేజ్రీవాల్) అబద్ధపు ప్రమాణాలు చేసి ప్రజల సొమ్ముతో అద్దాల మేడలు నిర్మించుకున్నారు.
గత పదేళ్లలో ఢిల్లీ పెద్ద ఆపదలో పడిపోయింది. అన్నా హజారేను ముందు పెట్టి పోరాటాలు చేసిన కొందరు కరడుగట్టిన అవినీతిపరులు ఢిల్లీని ఆపదలో పడేశారు. మద్యం, పాఠశాలలు, వైద్య చికిత్స, కాలుష్య నియంత్రణ, ఉద్యోగ నియామకాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. వీళ్లా ఢిల్లీ అభివృద్ధి గురించి మాట్లాడేది? ముంచుకొచ్చిన ఆపదకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు యుద్ధం చేయాలి. ఆపద నుంచి విముక్తి పొందాలని ఢిల్లీ ప్రజలు సంకల్పించారు.
ఆదపను సహించం.. మార్చి చూపిస్తాం అని ఢిల్లీలోని ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ అంటున్నారు. యమునా నది శుద్ధి చేస్తే ఓట్లు పడవని అంటున్నారు. ఓట్ల కోసం యమునను వదిలేస్తామా? యమునను శుద్ధి చేయకపోతే ఢిల్లీ ప్రజలకు తాగునీరు ఎలా వస్తుంది? అవినీతిపరుల కారణంగా ప్రజలకు కలుషితమైన నీరు అందుతోంది. ఈ ఆపద తెచ్చిపెట్టిన వ్యక్తులు ఢిల్లీ ప్రజల జీవితాలను వాటర్ ట్యాంకర్ల మాఫియాకు వదిలేశారు.
ఈ ఆపద ఇలాగే కొనసాగితే మరిన్ని కష్టాలు తప్పవు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా వాళ్లు అడ్డుకుంటున్నారు. ఈ ప«థకం కింద ప్రజలకు ప్రయోజనం అందకపోవడానికి కారణం ఆ వ్యక్తులే. ప్రజల జీవితాల కంటే తమ స్వార్థం, విజయం, అహంకారమే ప్రధానంగా భావిస్తున్నారు. జాతీయ పథకాల ప్రయోజనాలు ఢిల్లీ ప్రజలకు చేరేలా చేయడమే మా లక్ష్యం. ఆపద నుంచి తప్పించుకోవాంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment